పరిశ్రమల భూముల్లో రియల్‌ దందా

ABN , First Publish Date - 2022-05-25T05:45:35+05:30 IST

పరిశ్రమల కోసం రైతులు ఆనాడు తమ భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు.

పరిశ్రమల భూముల్లో రియల్‌ దందా

ఐటీ క్లస్టర్ల అభివృద్ధి పేరుతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం

మూతపడ్డ టాటా ర్యాలీస్‌ భూముల్లో నయా దందా

అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతి

అనుమతుల కోసం ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం



ఆంధ్రజ్యోతి ప్రతినిధి సంగారెడ్డి/పటాన్‌చెరు, మే23 :  పరిశ్రమల కోసం రైతులు ఆనాడు తమ భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. సంగారెడ్డి జిల్లా  పటాన్‌చెరు పారిశ్రామికవాడ ఏర్పాటుకు 1970 ప్రాంతంలో వందలాది ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఇందుకోసం అప్పట్లో చెల్లించిన పరిహారం నామమాత్రమేనని పలువురు రైతులు అంటున్నారు.  నిరాకరించిన రైతులను బెదిరించి మరీ భూములను లాక్కున్నారు. అందులో భాగంగా పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన టాటా ర్యాలీస్‌ ఇండియా పురుగుల మందుల తయారీ  పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా 110 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చారు. సుమారు మూడు దశాబ్దాల పాటు నడిచిన పరిశ్రమ వివిధ కారణాలతో 2005లో శాశ్వతంగా మూతపడింది. 

 వాస్తవంగా పరిశ్రమను కేవలం 40 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సంస్థ మిగతా 70ఎకరాలను భవిష్యత్తులో పరిశ్రమ విస్తరణ కోసం వారి ఆధీనంలోనే పెట్టుకున్నారు. ఉన్న పరిశ్రమను నడపకుండానే మూసివేశారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ప్రస్తుతం 110 ఎకరాల భూమిని మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. అందులో 40 ఎకరాలను గోద్రేజ్‌ సంస్థకు విక్రయించారు. అలా భూమి చేతులు మారుతూ తాజాగా ఇన్‌కార్‌ నిర్మాణ సంస్థ ఆధీనంలోకి వెళ్లిపోయింది. పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన భూమిలో రియల్‌ వ్యాపారానికి తెరతీశారు. ఒక వైపు సాకి చెరువు కట్ట, మరో వైపు ముంబాయి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సదరు భూమిలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ల నిర్మాణం కొనసాగుతున్నది. టీఎ్‌సఐఐసీ నిబంధనల ప్రకారం పరిశ్రమల కోసం కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదు. పైగా హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మాన్యుఫ్యాక్చరింగ్‌జోన్‌గా పేర్కొన్న పారిశ్రామికవాడలో నివాస గృహాల నిర్మాణానికి అనుమతులు జారీ కావడం వెనక పెద్ద ఎత్తున అవకతవకలున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అసాధ్యం అనుకున్న చోట ఏకంగా పది అంతస్తుల అపార్ట్‌మెంట్ల సమూహానికి అనుమతుల జారీ చకచకా జరిగిపోయింది. ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో ఇప్పటికే వందలాది ఫ్లాట్లను అమ్ముకుని కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్నారు. సుమారు 30 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న తీరు, అమ్మకాలను చూస్తే సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


 ఫిఫ్టీ ఫిఫ్టీ ఐటీ కారిడార్‌  అభివృద్ధి పేరుతో అనుమతులు 

ఐటీ గ్రిడ్‌, కారిడార్‌లను అభివృద్ధి చేయడంలో భాగంగా టీఎ్‌సఐఐసీ, ఐలా స్థలాల్లో భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. అందుకు ప్రత్యేక జీవో ఎంఎస్‌ నెంబర్‌ 16ను జారీ చేశారు. జీవో ఆధారంగా ఇకపై పారిశ్రామిక వాడలోని స్థలాల్లో పెద్ద ఎత్తున బహుళ అంతస్తు భవనాలు రాబోతున్నాయి. పరిశ్రమల ఆధీనంలో ఉన్న మొత్తం స్థలంలో 50 శాతం ఐటీ పార్కును అభివృద్ధి చేసి, మిగతా సగంలో రెసిడెన్షియల్‌, లేదా వ్యాపార భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. నాన్‌ ఐటీ విభాగం కింద యాభై శాతం భూముల్లో అనుమతులు తీసుకుని దర్జాగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. పారిశ్రామికవాడ (ఐడీఏ) పరిధిలోని పరిశ్రమల భూముల రిజిస్ట్రేషన్‌ విలువలో 30శాతం చెల్లిస్తే పరిశ్రమ కేటగిరి నుంచి మార్చేస్తున్నారు. ఇదే అదనుగా పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని ర్యాలీస్‌ భూముల్లో నిర్మాణాలను ప్రారంభించారు. సుమారు 1,700 ఫ్లాట్లను బహుళ అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. మరో సగం స్థలంలో ఐటీ పార్కుల పేరుతో భారీ నిర్మాణాలను చేపట్టి బహుళ జాతి సంస్థలకు అద్దెలు ఇచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే పద్ధతిలో ర్యాలీస్‌ ఆధీనంలోని మొత్తం 110 ఎకరాల్లో భారీ టవర్లు నిర్మించేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఒక వైపు ఐటీ అభివృద్ధి అని చెబుతూనే మరో వైపు గృహాల నిర్మాణానికి అనుమతులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు పరిశ్రమల కోసం సేకరించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే సదరు భూములను స్వాధీనం చేసుకునే అఽధికారం ప్రభుత్వానికి ఉన్నా, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో అటు పరిశ్రమలను మూసివేసిన పారిశ్రామికవేత్తలకు, ఇటు ప్రభుత్వానికి లాభం చేకూరుతుందే తప్ప వీటి కోసం గతంలో భూములను త్యాగం చేసిన రైతులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. ఇదే పద్ధతిలో ఐడీఏ పరిధిలో భారీ పరిశ్రమల యాజమాన్యాలు ఐటీ క్లస్టర్ల పేరుతో అనుమతులు తీసుకుని యాభై శాతం భూముల్లో గృహాలు, షాపింగ్‌మాల్స్‌ను నిర్మించేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తున్నది.  



Updated Date - 2022-05-25T05:45:35+05:30 IST