రియల్‌ బ్రోకర్స్‌ నకిలీలలు

ABN , First Publish Date - 2022-04-13T17:03:18+05:30 IST

నకిలీ పత్రాలు సృష్టించి భూములు విక్రయిస్తున్న తొమ్మిది మంది రియల్‌ మోసగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 20 కోట్ల

రియల్‌ బ్రోకర్స్‌ నకిలీలలు

అమ్మకానికి రూ.20 కోట్ల విలువైన ప్లాట్లు..

ముఠా ఆటకట్టు.. 9 మంది అరెస్ట్‌


హైదరాబాద్‌ సిటీ: నకిలీ పత్రాలు సృష్టించి భూములు విక్రయిస్తున్న తొమ్మిది మంది రియల్‌ మోసగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 20 కోట్ల విలువైన పది నకిలీ సేల్‌ డీడ్‌ డాక్యుమెంట్లు, రూ. 10.4 లక్షల నగదు, నకిలీ స్టాంపులు, రెవెన్యూ పేపర్లు, పది సెల్‌ఫోన్లు, కారు, గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. చర్లపల్లికి చెందిన కుమారస్వామి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌. ఉప్పయ్యపల్లి పంచాయతీ పరిధిలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న 266.66 చ.గజాల స్థలంపై కన్నేశాడు. భూ యజమానులు ఇక్కడ ఉండడం లేదని తెలుసుకున్నాడు. మరి కొందరు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కలిసి కబ్జాకు ప్లాన్‌ చేశాడు. బొడ్డు శ్రీనివాస్‌, గడ్డం శ్యామ్‌రావు, సుధాగాని కుమారస్వామి, గంటా రాజశేఖర్‌, మేరుగు జానయ్య, ఆవుల బాలరాజు, వల్లపు కృష్ణయ్య, నౌస్‌ శ్రీధర్‌, దయాకర్‌, హఫీజ్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. మలక్‌పేటకు చెందిన బొమ్మ రామారావు సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించారు. 


వెలుగులోకి వచ్చిందిలా.. 

ముఠాలోని గడ్డం శ్యామ్‌రావును భూమి యజమాని గురజాడ కొండల్‌రావుగా చిత్రీకరించాడు. బొడ్డు శ్రీనివాస్‌ ద్వారా భూమిని అమ్మకానికి పెట్టారు. యాదయ్య అనే వ్యక్తి భూమి కొనేందుకు అడ్వాన్స్‌గా రూ. 8లక్షలు ఇచ్చాడు. అగ్రిమెంట్‌ సేల్‌డీడ్‌తో పాటు, జిరాక్స్‌ పత్రాలను తీసుకుని వాకబు చేయగా అవి నకిలీవని తేలింది. బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. సీపీ ఆదేశాలతో మల్కాజిగిరి ఎస్‌వోటీ టీమ్‌, కుషాయిగూడ పోలీసులను రంగంలోకి దింపారు. మోసంలో భాగస్వాములైన తొమ్మిది మందిని కటకటాల్లోకి నెట్టారు. 


నకిలీ పత్రాలు

బంజారాహిల్స్‌, కొండాపూర్‌, మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ, ఆర్‌సీపురం, సలీమ్‌నగర్‌ మలక్‌పేట, తుర్కయాంజల్‌ ప్రాంతాల్లో రూ. 20 కోట్ల విలువైన 10 నకిలీ సేల్‌ డీడ్‌లు నిందితులు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాటిని సీజ్‌ చేశారు.

Updated Date - 2022-04-13T17:03:18+05:30 IST