Abn logo
Jan 14 2021 @ 03:17AM

సడి లేకుండా రెడీ..రెడీ

  • రాజధానికోసం విశాఖలో భవనాల పరిశీలన
  • అధికారులూ, వైసీపీ నేతలూ ఇదే పనిలో...
  • విద్యాసంస్థలనూ వదలకుండా అన్వేషణ
  • గిరిజన మ్యూజియంలో ఆ శాఖ ఆఫీసు
  • ఉత్తరాంధ్ర జలశాఖ ఆవరణలో కృష్ణాబోర్డు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు చేస్తోంది. కోర్టులో కేసులు పరిష్కారమయ్యే సమయానికి అన్ని సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీంతో పలు శాఖల ఉన్నతాధికారులు తమ ప్రధాన కార్యాలయాల ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. దీనికోసం విశాఖ నగరంతోపాటు మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో భవనాలను పరిశీలిస్తున్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో గాయత్రి, గీతం విద్యా సంస్థల మధ్య గిరిజన మ్యూజియం కోసం భవన నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ భవనంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఏర్పాటుచేయాలని దాదాపు నిర్ణయించారు. ఈ విషయాన్ని విజయవాడలో ఉన్న అధికారులకు సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. కాగా, ఆనందపురం సమీపాన భారీ భవంతిలో ఓ ప్రైవేటు పాఠశాల నడుస్తోంది. తమ కార్యాలయాల ఏర్పాటు కోసం కొన్ని శాఖల అధికారులు ఈ భవన యజమానిని సంప్రదించినట్టు తెలిసింది. అప్పటినుంచి భవనం ఖాళీ చేయాల్సిందిగా పాఠశాల నిర్వాహకులపై భవన యజమాని ఒత్తిడి తీసుకువస్తున్నారని చెబుతున్నారు. 


పాఠశాల కంటే ప్రభుత్వ శాఖలైతే ఎక్కువ అద్దె వస్తుందనే ఉద్దేశంతో స్కూలును ఖాళీ చేయించాలని ఆయన భావిస్తున్నారు. పది రోజుల క్రితం విజయనగరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో విశాఖ కలెక్టర్‌ను విమానంలో తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా విశాఖలో పాలనా రాజధానికి సంబంధించి భవనాల అన్వేషణ, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు, ఇతర ఏర్పాట్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా జూన్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరుగుతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. నాలుగు నెలల్లో విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు తథ్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది.కాలుష్య నియంత్రణ మండలి: మండలి ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం మాధవధారలోని జోనల్‌ కార్యాలయం ఉన్నప్పటికీ ప్రధాన కార్యాలయానికి మరోచోట భారీ భవనం నిర్మించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.


ఇందుకు విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఎకరా స్థలం దీర్ఘకాలిక లీజు విధానంలో తీసుకోనున్నారు. త్వరలో విశాఖ ఉక్కు కర్మాగార యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిసింది. కృష్ణా బోర్డు: జల వనరుల శాఖ ఉత్తరాంధ్ర సీఈ కార్యాలయ ఆవరణలో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుచేస్తారని తెలిసింది. ఇదే ప్రాంగణంలో నిర్మిస్తున్న మరో భవనాన్ని జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయానికి కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు. కొందరు మంత్రులు భవనాల కోసం అటు అధికారులతోపాటు ఇటు పార్టీ నేతల ద్వారా అన్వేషిస్తున్నారు. అయితే రాజధాని తరలింపుపై కోర్టులో కేసులు ఉన్నందున ఎవరూ బహిరంగంగా ఈ విషయాలను వెల్లడించడం లేదు.

Advertisement
Advertisement
Advertisement