అవసరాన్ని బట్టి రూ.5,000 కోట్ల పెట్టుబడులకు రెడీ

ABN , First Publish Date - 2022-05-29T08:49:06+05:30 IST

యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) తయారీకి అవసరమైన ముడి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో సరఫరా, వ్యయ సవాళ్లు కొనసాగుతున్నాయని దివీస్‌ లేబొరేటరీస్‌ పేర్కొంది.

అవసరాన్ని బట్టి  రూ.5,000 కోట్ల పెట్టుబడులకు రెడీ

కంపెనీ వద్ద రూ.3,000 కోట్ల నగదు 

సరఫరా అవరోధాలను అధిగమిస్తున్నాం

దివీస్‌ ల్యాబ్స్‌ ఎండీ మురళి దివీ 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) తయారీకి అవసరమైన ముడి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో సరఫరా, వ్యయ సవాళ్లు కొనసాగుతున్నాయని దివీస్‌ లేబొరేటరీస్‌ పేర్కొంది. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, చైనాలో లాక్‌డౌన్‌ తదితర అంశాలు ముడి ఉత్పత్తుల సరఫరా, వ్యయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలిపింది. అయితే.. కంపెనీ ఆయా ఉత్పత్తి ప్రాముఖ్యాన్ని బట్టి నిల్వలు పెట్టుకుంటోందని దివీస్‌ లేబొరేటరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి కే దివీ తెలిపారు. ముడి ఉత్పత్తులను స్థానికంగా సమకూర్చుకోవడానికి కంపెనీ అనేక చర్యలు తీసుకుంది. అంతర్జాతీయంగా జరిగే పరిణామాల వల్ల ఎదురయ్యే రిస్క్‌ను మరింతగా తగ్గించుకుంటోందన్నారు. షిప్పింగ్‌ వ్యయాలు, కంటైనర్ల కొరత, పెరుగుతున్న చమురు ధరలు, పోర్టుల్లో రదీ ్ద ముడి ఉత్పత్తుల సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నట్లు చెప్పారు. 


ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే: వచ్చే రెండు, మూడేళ్లలో రూ.2,000-3,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని దివీస్‌ లేబొరేటరీస్‌ భావిస్తోంది. అవసరమైతే రూ.4,000 నుంచి రూ.5,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మురళితెలిపారు. విస్తరణకు కంపెనీ వద్ద నిధులు ఉన్నాయి. అవసరమైతే సమీకరిస్తాం. దివీస్‌ లేబొరేటరీస్‌ రుణ రహిత కంపెనీ. బ్యాంకుల్లో కంపెనీకి రూ.3,000 కోట్ల నగదు ఉందన్నారు. ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టాం.  భవిష్యత్తులో కూడా మరిన్ని పెట్టుబడులు పెడతామని వివరించారు. కాకినాడ యూనిట్‌ కు అన్ని లైసెన్సులు లభించాయి. ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.


జెనరిక్‌ ఏపీఐ విభాగంలో : జెనరిక్‌ ఏపీఐల విభాగంలో 16 ఔషధాల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఔషధాలు స్వల్ప, దీర్ఘకాలిక వృద్ధికి దోహదం చేయగలవని కంపెనీ భావిస్తోంది. 2022-23 నుంచి 2024-25 మధ్య 2,000 కోట్ల డాలర్ల విక్రయాలు కలిగిన ఔషధాలకు పేటెంట్‌ హక్కుల గడువు తీరనుంది. దీర్ఘకాలంలో ఈ పరిణామం కంపెనీకి అవకాశాలను కల్పించనుంది. కాగా బయోలాజిక్స్‌ రంగానికి దూరంగా ఉండే ఉద్దేశమేమీ కంపెనీకి లేదని మురళి తెలిపారు. 

Updated Date - 2022-05-29T08:49:06+05:30 IST