నల్లగొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2022-05-25T06:37:43+05:30 IST

నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేయని అభివృద్ధి తాను మూడున్నరేళ్లలోనే చేశానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిపై ఎంతటి చర్చకైనా తా ను సిద్ధమేనని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

నల్లగొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సవాల్‌

20 ఏళ్లలో చేయని అభివృద్ధి మూడున్నరేళ్లలో చేశా


నల్లగొండ అర్బన్‌, మే 24: నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేయని అభివృద్ధి తాను మూడున్నరేళ్లలోనే చేశానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిపై ఎంతటి చర్చకైనా తా ను సిద్ధమేనని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న నల్లగొండలో గొడవలు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మొదట భువనగిరి నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయమని కోమటిరెడ్డికి సూచించారు. ఎలాంటి అభివృద్ధి చేయని వెంకట్‌రెడ్డిని నల్లగొండ నియోజకవర్గ ప్రజ లు నాలుగుసార్లు గెలిపించారని, ఇంత అభివృద్ధి చేస్తున్న తనను ప్రజ లు ఎన్నిసార్లైనా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంకా ఒకటిన్నర సంవత్సర కాలంలో నల్లగొండ నియోజకవర్గాన్ని మరింత అభివృ ద్ధి చేస్తామన్నారు. కోమటిరెడ్డి హయాంలో నల్లగొండ పట్టణం పక్కనే ఉదయ సముద్రం ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు సరైన తాగునీరు అందించలేదని, తాను గెలిచిన సంవత్సరంలోపే రెండో పైపులైను వేసి నల్లగొండ పట్టణానికి రోజు తప్పించి రోజు సమృద్ధిగా పట్టణ ప్రజలకు తాగు నీరు అందిస్తున్నామన్నారు. కమీషన్ల కోసం నల్లగొండలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని ఇష్టానుసారంగా నిర్మించి చిన్నవర్షానికే పట్టణం మునిగిపోయే విధంగా తయారు చేసిన ఘనత కోమటిరెడ్డికే దక్కిందన్నారు. 


రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు 

నల్లగొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 20 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతుందన్నారు. త్వరలోనే నల్లగొండ రూపురేఖలు మారనున్నాయన్నారు. రూ.90కోట్లతో పట్టణ రోడ్ల విస్తరణ, రూ.15కోట్లతో ఐటీహబ్‌, రూ.36కోట్లతో ఎన్జీ కళాశాల పునర్నిర్మాణం, రూ.118కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి అనుసంధానంగా రూ.40కోట్లతో నర్సింగ్‌ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, ఫార్మసీ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.45కోట్లతో మర్రిగూడ బైపాస్‌ వద్ద ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మైనార్టీ ఓట్లకోసం పాకులాడిన వెంకట్‌రెడ్డి పాతబస్తీని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.  సమావేశంలో నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ బొర్ర సుధాకర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, ఫ్లోర్‌ లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్‌, నాయకులు నిరంజన్‌వలి, కౌన్సిలర్‌ పిల్లి రామరాజు, కనగల్‌ ఎంపీపీ కరీంపాషా, ఆలకుంట్ల నాగరత్నంరాజు, పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


జూన్‌ 4న మెడికల్‌ కళాశాల భవనానికి శంకుస్థాపన

వచ్చే  నెల 4వ తేదీన జిల్లాకేంద్రం పరిధిలోని మెడికల్‌ కళాశాల భవనానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. రూ.118కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ వద్ద మెడికల్‌ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మెడికల్‌కళాశాల నిర్మాణం పూర్తయినట్లయితే జిల్లా ప్రజలకు అన్నిరకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. 


ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే 

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తనిఖీ చేశారు. గర్భిణులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో పడకలు సరిపోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఈ కేంద్రాన్ని ఆయన సందర్శించి రోగులతో మాట్లాడారు. ఎంసీహెచ్‌ కేంద్రంలో మూడో అంతస్తులో మెడికల్‌ కళాశాల హాస్టల్‌ కొనసాగుతుండడం వల్ల పడకలు సరిపోవడం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావిడి లచ్చు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

Updated Date - 2022-05-25T06:37:43+05:30 IST