Abn logo
Sep 21 2020 @ 04:18AM

కొత్త కథలకు విమర్శ సిద్ధమేనా?

Kaakateeya

టెక్నాలజీపరంగా ప్రసారమాధ్యమాలు కొత్తపుంతలు తొక్కుతున్న నేటి నేపథ్యంలో కథ రూపంలోనూ మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. కథ ఆడియో, వీడియో రూపాలను సంతరించుకుంది. విమర్శ దీనికి కొలమానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కథానిర్మాణంలో అతిక్లుప్తత చోటుచేసుకుంది. నానో కథలు లాంటి వాటికి సూత్రాలు నిర్మించాల్సిన పరిస్థితీ నేడు ఉంది. 


సాహిత్యలోకంలో చెలామణిలో ఉన్న సూత్రాలే కాదు, కొత్తగా కథాలోకంలోకి వస్తున్న, వచ్చిన కథకుల నాడిని గట్టిగా పట్టుకోవాలనుకున్న విమర్శకులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు ఇతర భాషల్లో కథానిర్మాణ పద్ధతుల గురించి అధ్యయనం చేస్తూనే ఉండాలి. కథలకు సంబంధించి కొత్త నిర్మాణ పద్ధతులను సూత్రీకరణ చేసే సృజనశక్తిని అలవర్చుకోవాలి. అప్పుడే కథలకు సంబంధించిన విమర్శ, పరిశోధన విస్తృతమవుతుంది. కథకు సంబంధించిన సంపూర్ణ సత్యాలు ఆవిష్కృతమవుతాయి. 


కథ ఎలా పుడుతుంది? ఎలా నడుస్తుంది? ఎలా ముగుస్తుంది? ఒక కథ రాయడానికి రచయితను ప్రేరేపించే అంశాలు ఏమిటి? ఆ ప్రేరణ కథగా మార డానికి మధ్య రచయిత ఏం చేస్తాడు? కథ రాసిన తర్వాత ఏ కొలమానాలతో ఆ కథను చూడాలి? కథలో రచ యిత చెప్పిన అంశాలనే ప్రామాణికంగా తీసుకొని కథను పరిశీలించాలా? కథను ఎలా చెప్పాడో చూస్తే సరిపోతుందా? కథలో రచయిత చెప్పిన అంశాలను, చెప్పిన విధానాన్ని సమతూకంగా చూస్తూ అధ్యయనం చేయాలా? రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? దేని ప్రాధాన్యత ఎంత? నేడు కథను తూచడానికి ఉన్న రాళ్లు సరిపో తాయా? కొత్త ప్రమాణాలు అవసరమా? అసలు ఇది గొప్ప కథ, ఇది తక్కువ అని ఒక కథ స్థాయిని నిర్ణయించడం సరైనదేనా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు.


వస్తువు, శిల్పం అని రెండు ప్రధాన భాగాలుగా కథ స్వరూపాన్ని స్వభావాన్ని నిర్ణయించడం నేడు దాదాపు అందరూ చేస్తున్న పని. కొందరు రూపం అని, కథన పద్ధతి అనే పదాలను శిల్పానికి దగ్గరగా వాడుతున్నారు. కథలో రచయిత చెప్పిన అంశాన్ని వస్తువు అని, దాని నేపథ్యాన్ని ఇతివృత్తం అని పిలుస్తున్నారు. పరిశోధ నలు, విమర్శలు ఇదే మూస ధోరణిలో సాగుతున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. వీటిని మించిన కథా నిర్మాణ సూత్రాలు అందుబాటులో ఉన్నాయా అని ఆలో చించాల్సిన అవసరం ఉంది.


రచనకు సంబంధించిన అంశాన్ని రచయిత ఎంచుకోవడానికి, దాన్ని కథగా మార్చడానికి మధ్య కథకుడు ఏం చేస్తాడు? కథకుల మనసులో ఎలాంటి ప్రయోగశాల ఉంది? దానిలో ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయి? దాన్ని బద్దలు కొట్టా ల్సిన అవసరం లేదా? కథ లిఖిత రూపంలో లేదా వాగ్రూపంలో బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పరి శీలించి మంచిచెడులను బేరీజు వేస్తే సరిపోతుందా? కథా వస్తువుకు, కథకుడికి మధ్య జరిగే సంఘర్షణాత్మక మనో లోకాన్ని పూర్తిగా పట్టుకోవడం కూడా జరగాలి. అసలు కథకులు ‘‘ఈ వస్తువుకు ఈ కథన పద్ధతే సరిపోతుంది. ఈ కథను ఇలాగే రాస్తాను’’ అని ఎలా నిర్ణయించుకుంటారు? ఆ నిర్ణయంపై ఎలాంటి ప్రభావాలున్నాయి? రచయిత స్వేచ్ఛ వెనకున్న నేపథ్యాలను ముందుకు తీసుకురావాల్సిన అవసరమూ ఉంది.


కథలో రచయిత చెప్పిన అంశానికి, చెప్పిన విధానానికి మధ్య సంబంధం ఉంటుందా? ఉంటే ఎలాంటి సంబంధం ఉంటుంది? ఏ రచనకైనా వస్తు రూప సంబంధాలు విశ్లేషిం చడం నేడు కనిపిస్తున్న విధానాల్లో ఒకటి. ఒక వస్తువు కథగా మారడానికి, మరే ఇతర ప్రక్రియగా మారకపోవడా నికి ఉన్న కారణాలను రచయిత ఇష్టానికే వదిలేయాలా? అందుకు ఉన్న కారణాలను పట్టుకోవాలి కదా. ప్రతిభ ఉన్న రచయితలు ఒకే వస్తువును కథగా, కవితగా లేదా దాని నేపథ్యాన్ని, వస్తువును విస్తృతం చేసి నవలగా కూడా రాయగలరు. మరి కథలో వస్తురూపాల మధ్య సంబం ధాన్ని నిర్ణయించేది కేవలం రచయిత మాత్రమేనా? రచనా వస్తువు మాత్రమేనా? ఆ కాలం నాటి సాహిత్య, సామాజిక పరిస్థితులు కూడానా? మరి ఒక కథలో వస్తురూప సంబంధాలను నిగ్గు తేల్చేటప్పుడు వేటిని ప్రమాణాలుగా తీసుకోవాలి? మరి ఈ దిశగా కొత్త అన్వేషణ కొనసాగించాల్సిన అవసరం లేదా?


కథా వస్తువును విశ్లేషించడం అంటే దానిలో ప్రతిబిం బించే చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల లోతులను చూడడం పరిపాటిగా కొసాగుతోంది. వివిధ ఉద్యమాలు, వాదాలు, తాత్విక సిద్ధాంతాల పరంగా కూడా కథలను చూస్తున్నారు. కానీ ఏదైనా అంశాన్ని కథలోకి తీసుకొస్తున్నప్పుడు రచయిత ఉద్దేశ్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఏ దృష్టితో చూస్తున్నాడు?... అలా చూడ్డం వెన కున్న రచయితను ఎలా అర్థం చేసుకోవాలన్న పరిశోధనలు, విమర్శలు చేయడం నేడు తగ్గిపోయాయి. ప్రతి కథకుడి దగ్గరా పెన్ను మాత్రమే కాదు, ఆ పెన్నుకు ఓ గన్నులాంటి కన్ను కూడా ఉంటుంది. ఆ చూపును పరిశీలించాల్సిన అవసరం తప్పనిసరి. కథలో రచయిత అన్ని విషయాలను చర్చించకపోవచ్చు. ఒక్కోసారి చెప్పాలనుకున్న విషయాన్ని కథలో ఎక్కడో ఓ చోట నర్మగర్భితంగా దాచేయొచ్చు. అందుకే కథను విశ్లేషించేటప్పుడు కథలోని విషయాలేకాక, ఆ కథలో రచయిత చెప్పకుండా వదిలేసినవి ఎన్నో ఉంటాయి. వాటిని సూక్ష్మదృష్టితో చూసి వెలికితీయాల్సిన అవసరమూ ఉంది. కథలో కనిపించని కథాంశాల శోధనే ఇది. కథలోని ప్రతి అక్షరం ముఖ్యమే. శోధనీయమే.


శీర్షిక, ప్రారంభం లేదా ఎత్తుగడ, ముగింపు, భాష, పాత్రలు, సన్ని వేశాలు, వర్ణనలు, సంఘటనలు, దృష్టికోణం అంటూ కథ నడి చిన తీరులోని లోతుపాతు లను అంచనావేసి, భాగా లుగా విడగొడుతున్నారు నేడు కొందరు. కథలో దాగిన కథాంగాల మధ్య ఉన్న బంధనాన్ని విప్పే ప్రయత్నం పూర్తిగా చేయడం లేదు. శీర్షికనే ప్రామాణికంగా తీసుకొని కథ మొత్తాన్ని విశ్లేషించే అవకాశం కొన్ని కథల్లో కనిపించొచ్చు. ప్రారంభమే కథలోని వస్తువుకు ఎలాంటి న్యాయం చేసిందో చూడాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఒక్కోసారి కథా లక్ష్యం ఎత్తుగడలోనో మరే ఇతర కథాంగంలోనో ఇచ్చిన క్లూలో దొరికిపోవచ్చు. కథలో అక్కడక్కడా వచ్చే చిన్నచిన్న మలుపుల్లో కథలోని ప్రధాన అంశాన్ని రచయితలు దాచొచ్చు. కథను కవితా త్మకంగా నడిపించొచ్చు. అందుకు కారణాలూ ఉండొచ్చు. కథ చుట్టూ నేపథ్యాన్ని రచయిత చెప్పకుండా వదిలేసినా జాగ్రత్తగా పట్టుకొంటే సరికొత్త సంగతులు దొరకొచ్చు. 


కథ నడకలో రచయితలు పాటించిన తీరులో పురోగ మనం ఉందా, తిరోగమనం ఉందా, మిశ్రగమనంలో కథను చెప్పారా వంటివి కూడా కథన పద్ధతిలో భాగంగా అధ్యయనంచేసి, వీటివల్ల కథకు చేకూరిన ప్రయోజనాన్ని తెలియజేయొచ్చు. ఇప్పటికే వాస్తవిక కథనం, లేఖా కథనం, ఊహా త్మక కథనం, మ్యాజిక్‌ రియలిజం, అంతరార్థ కథనం, చైతన్యస్రవంతి వంటి కథన పద్ధతులతో కథను చూస్తు న్నారు. అన్ని కథలకు ఈ విభజన సరిపోకపోవచ్చు. ఒక్కో కథలో వీటిలోని రెండు మూడు పద్ధతులను రచయితలు చొప్పించి ఉండొచ్చు. మరేదైనా కొత్త పద్ధతిలో కథను రాసి ఉండొచ్చు. అందుకు తగిన సరంజామా సిద్ధం చేసుకోకుండా పాత కొలమానాలతోనే కథను చూడడం సరైంది కాదు. 


కథకులు కథను చెప్తున్నారా? రాస్తున్నారా? దృశ్యీకరిస్తు న్నారా? లేదా మరేవిధంగానైనా కథను పాఠకులకు చేరవేశారా చూడాల్సిన అవసరమూ ఉంది. చెప్పడంలో వక్త శ్రోత ఎదురెదురుగా ఉండే మౌఖిక సంప్రదాయ సూత్రా లను అన్వయించి శోధించాలి. లిఖిత పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో రచయిత పాటించిన విధానాలను పట్టుకోవాలి. దృశ్యీకరిం చినప్పుడు నాటకీయశిల్పం లేదా సినిమా పద్ధతులతో కథను వివరించాలి. నాటకానికి అన్వ యించే పంచసంధులను కొన్ని కథలకు అన్వయించి చూడా ల్సిన అవకాశం ఉండొచ్చు. కథా లక్ష్యాన్ని చేరడంలో ముఖ, ప్రతిముఖ, గర్భ, అవమర్శ, నిర్వహణ సంధు లను గమనించడం వల్ల కథన లోతులకు మేలు చేకూరవచ్చు. అర్థప్రకృతులకు, కార్యావస్థలకు మధ్య ఉన్న ఈ సంధులను సరిగా గమనిస్తే కథ చెక్కిన తీరు, కథా ప్రయోజనాలను పాఠకులకు సులభంగా చేరవేయవచ్చు. 


టెక్నాలజీపరంగా ప్రసారమాధ్యమాలు కొత్తపుంతలు తొక్కుతున్న నేటి నేపథ్యంలో కథ రూపంలోనూ మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. కథ ఆడియో, వీడియో రూపా లను సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన కొలమానా లను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మాధ్యమాలలో అనుభూతులను, అనుభవాలను రాయడానికి ఎక్కువమందికి అవకాశం కలిగింది. కథా నిర్మాణంలో అతిక్లుప్తత చోటుచేసుకుంది. నానో కథలులాంటి వాటికి సూత్రాలు నిర్మించాల్సిన పరిస్థితీ నేడు ఉంది.


అసలు ఒక కథకు కొలమానాలు నిర్ణయించడం సరైం దేనా? విమర్శకులు లేదా పరిశోధకులు తమకు తెలిసిన కొలమానాలను పట్టుకొని త్రాసులో వేసి తూస్తే ఆ కథ సాహితీలోకంలో నిలబడుతుందా? కథ గొప్పతనాన్ని నిర్ణ యించే అధికారంలో రచనే మొదటి స్థానంలో ఉంటుంది కదా. దాని మూల స్వభావాన్ని అంచనా వేయలేకపోతే విమర్శకులు, పరిశోధకుల స్థాయి తగ్గినట్లే కదా. కథను కొలవడానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవసరం. పాత పద్ధతులతో కొత్త కథలను తూచడం, బేరీజు వేయడం కథ, కథనాలను తక్కువ చేయ డమే. కథా వస్తువులో వచ్చినంత త్వరతిగతిన కథా నిర్మాణంలో మార్పులు రావడం లేదు. రావు కూడాను. ఈ రెంటిలో వచ్చినంతగా విమర్శ, పరిశోధనల్లో కొత్త విధానాలు రూపొందవు. కథాలోకంలోకి అడుగుపెట్టే కొత్త రచయితలకు ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. కథకు కొలమానం పాఠకులే. వాళ్ల హృదయాలే. ఆ హృదయాలను పట్టి చూపించే ‘ప్రమాణాలు కథలో ఏవి ఉన్నాయో? ఎలా ఉన్నాయో? కథకులు ఏం చేశారో’ చెప్తే చాలు.


ఏ కథకు ఆ కథను ప్రత్యేకంగా నిశితదృష్టితో చూడా ల్సిందే. ఎవరికి వాళ్లు కథా స్వరూప స్వభావాన్ని బట్టి కొత్త సూత్రాలను నిర్మించుకోవాల్సిందే. విమర్శలో, పరిశోధనలో కథే ప్రమాణం. దాని వెనకున్న మూలాలు ముఖ్యం. సాహిత్యలోకంలో చెలామణిలో ఉన్న సూత్రాలే కాదు, కొత్తగా కథాలోకంలోకి వస్తున్న, వచ్చిన కథకుల నాడిని గట్టిగా పట్టుకోవాలనుకున్న విమర్శకులు, పరిశోధకులు ఎప్పటిక ప్పుడు ఇతర భాషల్లో కథానిర్మాణ పద్ధతుల గురించి అధ్య యనం చేస్తూనే ఉండాలి. కథలకు సంబంధించి కొత్త నిర్మాణ పద్ధతులను సూత్రీకరణచేసే సృజనశక్తిని అలవర్చు కోవాలి. అప్పుడే కథలకు సంబంధించిన విమర్శ, పరిశో ధన విస్తృతమవుతుంది. కథకు సంబంధించిన సంపూర్ణ సత్యాలు ఆవిష్కృతమవుతాయి.

ఎ. రవీంద్రబాబు,

80086 36981


Advertisement
Advertisement
Advertisement