- వ్యవసాయానికి 2.71 లక్షల కోట్లు ఖర్చు చేశాం
- మీ రాష్ట్రాల్లో చేసింది చెప్పగలరా..?
- కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి కేటీఆర్ సవాల్
- రాజకీయ పర్యాటకులు రావడంపై అభ్యంతరం లేదు కానీ..
- ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
- ధాన్యం కొనే దమ్ములేకే కేంద్రం చేతులెత్తేసింది..
- కేసీఆర్‌ను విమర్శించే అర్హత ఎంపీ సీఎంకు లేదు
- మా సీఎం ‘జై కిసాన్’ అంటుంటే..
- మోదీ ‘నై కిసాన్’ అంటున్నారు: మంత్రి హరీశ్
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారని, ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు.. దమ్ముంటే తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశాయో చెప్పాలని, ఈ అంశంలో తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ‘రైతుబంధు కేసీఆర్’ హ్యాష్‌ట్యాగ్.. ట్విటర్ ట్రెండింగ్‌లో దేశంలో మొదటిస్థానంలో నిలిచిన సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో రైతు సంక్షేమం కోసం రూ.2.71 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. తెలంగాణ భవన్ వేదికగా కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసరుతున్నా.. మీ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. తిట్ల పురాణం ఆపి.. నా సవాల్‌ను స్వీకరించాలి’’ అని డిమాండ్ చేశారు. రైతాంగానికి వ్యతిరేకంగా నల్లచట్టాలు తేవడం కాదని, చేతనైతే.. రైతు సంక్షేమంలో తమతో పోటీ పడాలని సూచించారు. రాష్ట్రానికి రాజకీయ పర్యాటకులు రావడంపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, కానీ.. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.
కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ కాదని, ‘నో డేటా అవైలబుల్’ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ‘‘రైతుబంధు ద్వారా 64 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు అందించాం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబురాలు మిన్నంటాయి. అందరూ కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. రైతాంగం ఎడ్లబండ్లను ఊరేగిస్తూ.. ‘ఽరైతుబంధు కేసీఆర్’ అని నినదిస్తున్నారు. ఇది ఇలాగే సంక్రాంతి వరకు కొనసాగుతుంది’’ అని కేటీఆర్ తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ చేయనంతగా కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చిందన్నారు. టీఆర్ఎస్ అంటే ‘తెలంగాణ రైతు సర్కార్’ అని ఆయన భాష్యం చెప్పారు. రెండోవిడత రుణమాఫీని 4 లక్షల మంది రైతులకు వర్తింపజేశామని, మిగిలిన వారికి కూడా దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. రైతు బీమాకు రూ.3,205 కోట్ల ప్రీమియం చెల్లించినట్లు కేటీఆర్ చెప్పారు. రోజూ పనిగట్టుకుని విమర్శలు చేసే ప్రతిపక్ష నాయకుల ఖాతాల్లోనూ రైతుబంధు సొమ్ము పడుతోందన్నారు. రోజూ కేసీఆర్‌ను విమర్శించే ఓ నాయకుడి తండ్రిని తమ ప్రభుత్వం ఆసరా పింఛనుతో ఆదుకుంటోందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ కష్టాలే..
ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలే ఉండేవని కేటీఆర్ గుర్తు చేశారు. ‘‘నాడు మన రైతులు.. గ్రామాలు వీడి పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు వలస వెళ్లేవారు. ఉద్యమ సమయంలో ఈ దుస్థితి చూసి చలించిపోయిన కేసీఆర్.. అన్నదాతలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలతో వారికి అండగా నిలిచారు. ఇప్పుడు రాష్ట్ర రైతాంగం.. కల్లాల్లో ధాన్యపు రాశులతో ఆనందంగా ఉంది’’ అని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో 10 ఎకరాల రైతు కూడా బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లే వాడని, నాడు ఇక్కడ రైతుకు గౌరవం ఉండేది కాదని చెప్పారు. నాడు రైతు ఆత్మహత్యలు పతాకశీర్షికలుగా ఉండేవని, కానీ.. నేడు రైతు ఖాతాలు శీర్షికలకు ఎక్కుతున్నాయని పేర్కొన్నారు. ‘‘గతంలో ఇక్కడ భూమికి విలువ ఉండేది కాదు. దీంతో.. రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లిపోయేవారు. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 15 లక్షల మంది రైతు కూలీలు వలసవెళ్లిపోయారు. అలాంటి రాష్ట్రం ఇప్పుడు ముక్కోటి టన్నుల ధాన్యాగారంగా మారింది. గోదాముల్లో పట్టనంత ధాన్యం తెలంగాణ నుంచి వస్తోంది. దాన్ని కొనే దమ్ములేక కేంద్రం చేతులెత్తేసింది’’ అని విమర్శించారు.
నరహంతకుడు చౌహాన్: హరీశ్‌రావు
రైతు బాంధవుడు కేసీఆర్‌ను విమర్శించే అర్హత.. రైతులను కాల్చి చంపిన నరహంతకుడు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం.. రైతులతో కన్నీరు పెట్టిస్తుంటే.. కేసీఆర్.. వారికి అండగా నిలుస్తూ.. అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు బంధు పథకం కింద ఇప్పటివరకు 50 వేల కోట్లు అందించిన సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సంబురాలు చూసి సహించలేక పోతున్న బీజేపీ నేతలు.. అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని, వారికి రైతులే తగిన గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. గతంలో ఏ ప్రధానీ ధాన్యం కొనబోమని చెప్పలేదని, ఇలా చెప్పిన ప్రధాని మోదీ ఒక్కరేనని విమర్శించారు. కేసీఆర్.. ‘జై జవాన్, జై కిసాన్’అంటుంటే.. బీజేపీ మాత్రం ‘జై టీచర్లు, ఉద్యోగుల బదిలీలపై జారీ చేసిన 317 జీవోపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు.