‘పంచాయతీ’ ఎన్నికలకు సన్నద్ధం!

ABN , First Publish Date - 2021-01-25T07:35:26+05:30 IST

‘పంచాయతీ’ ఎన్నికలకు సన్నద్ధం!

‘పంచాయతీ’ ఎన్నికలకు సన్నద్ధం!

 స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారుల నియామకం

అనధికారికంగా ఏర్పాట్లు 

సుప్రీంకోర్టు తీర్పును బట్టి ముందడుగు

అంతా సవ్యంగా జరిగితే నేటి నుంచి నామినేషన్లు


చిత్తూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అమలై ఉంటే సోమవారం నేటి నుంచి జిల్లాలో నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికలను జరపలేమని హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. ఎన్నికలు జరపాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం కష్టమని భావించిన జిల్లా యంత్రాంగం అనధికారికంగా శని, ఆదివారాల్లో ఏర్పాట్లను చేసినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలు ఎన్నికలు జరిగేందుకు అనుకూలంగా వస్తే సోమవారం నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాలి. దీని కోసం అవసరమైన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఎంపిక చేసి నియమించినట్లు తెలుస్తోంది. నామినేషన్ల స్వీకరణ వరకు స్టేజ్‌-1, ఫలితాల విడుదల వరకు స్టేజ్‌-2 రిటర్నింగ్‌ అధికారులు పనిచేస్తారు. ఈ క్రమంలో స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారులను ఇప్పటికే నియమించినట్లు సమాచారం. తొలి దశ ఎన్నికలు తిరుపతి రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాల్లో జరగనున్నాయి. ఈ మండలాల్లో 370 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో రిటర్నింగ్‌ అధికారికి 4 నుంచి 10 వరకు పంచాయతీలను అప్పగిస్తారు. హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు, వ్యవసాయాధికారి వంటి మండల స్థాయి అధికారులను స్టేజ్‌-1 ఆర్వోలుగా నియమించినట్లు తెలిసింది. అలాగే ఈవోపీఆర్డీ, డిప్యూటి తహసీల్దార్‌, గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శి, హైస్కూల్‌ హెడ్మాస్టర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ వంటివారిని స్టేజ్‌-2 ఆర్‌వోలుగా నియమించాల్సి ఉంది. దీంతో పాటు పోలింగ్‌ నాడు అవసరమయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయుల జాబితా కూడా మండల స్థాయిలో తహసీల్దార్లు సిద్ధంచేసి ఉంచినట్లు తెలిసింది.


అధికారుల వేటుపై నేడు స్పష్టత

ఎన్నికల బాధ్యతల నుంచి కలెక్టర్‌ భరత్‌గుప్తా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమే్‌షరెడ్డిలతో పాటు మరికొందరిని ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ప్రస్తుతానికి వారంతా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారి మీద చర్యలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. ఎన్నికలు జరగాలని ఆదేశాలు వస్తే కలెక్టర్‌ స్థానంలో ఎన్నికలు బాధ్యతలను జేసీ మార్కండేయులు తీసుకుంటారు. ఈ మేరకు జేసీకి బాధ్యతలు అప్పగిస్తూ ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.


నామినేషన్ల గడువు పెంచే అవకాశాలు!

తొలి దశ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించి.. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగితే.. నామినేషన్ల స్వీకరణలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నెల 25 నుంచి 27 వరకు నామినేషన్లను స్వీకరించాలి. ఇందులో 25వ తేది సుప్రీంకోర్టు తీర్పు రావడంతో సరిపోతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న సెలవు. ఇక మిగిలింది 27వ తేదీ మాత్రమే. కాబట్టి తొలి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు గడువు పెంచే అవకాశాలున్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు.

తిరుపతి రూరల్‌లో సామగ్రి సిద్ధం!

తిరుపతి రూరల్‌: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తిరుపతి రూరల్‌ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సామగ్రిని సిద్ధం చేసి ఉంచారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధం అన్నట్టు పనులు పూర్తి చేస్తున్నారు. అభ్యర్థులకు అందించే నామినేషన్‌ పత్రాలను, దాఖలైన వాటిని భద్రపరిచేందుకు బాక్సులను ఉంచారు.


‘ఎస్‌ఈసీ’ ఆదేశాలను ఉద్యోగులు పాటించాలి 

 విశ్రాంత అధికారుల సూచన

చిత్తూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో తాము ఎన్నికల విధులు నిర్వర్తించలేమంటూ స్టేట్‌ ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇలా.. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. పలువురు విశ్రాంత అధికారులు మాత్రం.. ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తే ప్రభుత్వ యంత్రాంగమంతా ఎస్‌ఈసీ పరిధిలోకి వస్తుందని వారు గుర్తుచేస్తున్నారు. ఎస్‌ఈసీ ఆదేశాలను వ్యతిరేకిస్తే అధికారులు తమ బాధ్యతను విస్మరించినట్టేనని అంటున్నారు. దేశమంతా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వార్తు గుర్తుచేస్తున్నారు.


ఉద్యోగులు సహకరించాలి

హైకోర్టు తీర్పును ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను గౌరవించి జిల్లా రిటర్నింగ్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణ చేయడం సరికాదు. దేశమంతా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇక్కడ అడ్డుకోవడం సరికాదు.

- కేశవులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు, చిత్తూరు


ఇపుడు ఇబ్బంది ఉండదు

కరోనా ఓ మోస్తరుగా ఉన్న సమయంలోనే తెలంగాణలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. మిగతా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ఇప్పుడు కరోనా చాలావరకు తగ్గింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

 - గురుమూర్తి రిటైర్డ్‌ హెచ్‌ఎం, మదనపల్లె

Updated Date - 2021-01-25T07:35:26+05:30 IST