సాగుకు సమాయత్తం

ABN , First Publish Date - 2022-05-12T05:25:41+05:30 IST

వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరగనుంది. దీంతో రైతులకు విత్తనాలు, ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయనే దానిపై కార్యాచరణ రూపొందించారు.

సాగుకు సమాయత్తం

వానాకాలం సీజన్‌కు ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు

గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం


సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 11:  వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరగనుంది. దీంతో రైతులకు విత్తనాలు, ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయనే దానిపై కార్యాచరణ రూపొందించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి ఏ పంట విత్తనాలు ఎంత మేర అవసరమవుతాయనేది అధికారులు అంచనా వేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.

 జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్‌లో 2.70లక్షల మంది రైతులు 5,15,140 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా, ఈసారి సాగు విస్తీర్ణం ఉద్యాన పంటలను కలుపుకుని 6 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఉద్యాన పంటలు కాకుండా 5.46 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చే అవకాశం ఉంది. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. గత వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పత్తి, కంది పంటల విస్తీర్ణం కంటే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది పత్తి పంట 1.27 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ సారి 2 లక్షల ఎకరాలకుపైగానే సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. కంది పంట గతేడాది 22 వేల ఎకరాల్లో సాగవగా, ఈసారి 40వేల ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. గత సీజన్‌లో 46 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా, ఈసారి 50 వేల ఎకరాలకు పెరగొచ్చు. స్వీట్‌కార్న్‌ 793 ఎకరాల్లో పండించగా, ఈసారి 1000 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. గతంలో వరి అత్యధికంగా 3.17 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 2.50 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇతర పంటలు గత ఏడాది 1,261 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 3,240 ఎకరాల్లో సాగు చేయొచ్చని అంచనా వేశారు. 


ముందే అందుబాటులో విత్తనాలు

వానాకాలం సాగుకు ప్రధాన పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏ పంట విత్తనాలు ఎంత మేర అవసరమవుతాయనేది అధికారులు అంచనా వేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ఈసారి పత్తి సాగు విస్తీర్ణం భారీ స్థాయిలో పెరిగే అవకాశముందని అంచనా. ఈ నేపథ్యంలో పత్తి విత్తనాలు 5 లక్షల ప్యాకెట్లకుపైగానే అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇతర పంట విస్తీర్ణం పెరిగే అవకాశముంది. దీని దృష్ట్యా కంది విత్తనాలు 40 వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 4 వేల క్వింటాళ్లు, వరి 62,500 క్వింటాళ్లు, స్వీట్‌కార్న్‌ 1000 క్వింటాళ్ల విత్తనాలు, ఇతర పంటలు 100 క్వింటాళ్లపైగానే అవసరమవుతాయని అంచనా వేశారు. వానాకాలంలో పంటల సాగు ప్రారంభించే సమయం కంటే ముందే మార్కెట్లో రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉండేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


1.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువుల వినియోగం

పంటల సాగుకు ఎంతో ముఖ్యమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత వానాకాలం సీజన్‌లో రైతులు 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈసారి 1,36,490 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. యూరియా 49,888 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 26,440 మెట్రిక్‌ టన్నులు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటా్‌ష(ఎంవోపీ) 8,277 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 51,884 మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరమవుతాయని ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వానాకాలం సాగు ప్రారంభమయ్యే నాటికి రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత వానాకాలం సీజన్‌లో సకాలంలో ఎరువులు అందక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. క్యూలో నిల్చుని పడిగాపులు కాసినా రైతుకు సరిపడా ఎరువులను అందించలేకపోయారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంది.


Read more