మరో బాదుడుకు సిద్ధం...?

ABN , First Publish Date - 2022-08-01T06:10:36+05:30 IST

వారు చేసే వ్యాపారం తోపుడుబండ్లపైనే. వాటిని ఉదయం ఓ సర్కిల్‌లో ఉంచు కుంటే...సాయంత్రానికి మరో కాలనీలోనో, ఇంకో రోడ్డులోనే ఉంచుతారు

మరో బాదుడుకు సిద్ధం...?

తోపుడుబండ్లపైనా చెత్తపన్ను

ఒక్కో బండిపై రూ.150 

అనంతపురం క్రైం, జూలై 31: వారు చేసే వ్యాపారం తోపుడుబండ్లపైనే. వాటిని ఉదయం ఓ సర్కిల్‌లో ఉంచు కుంటే...సాయంత్రానికి మరో కాలనీలోనో, ఇంకో రోడ్డులోనే ఉంచుతారు. ప్రత్యేకంగా దుకాణం కూడా లేదు. కానీ అలాంటి తోపుడు బండ్లపైనా చెత్తపన్ను విధించడానికి నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో తోపుడు బండికి ప్రతి నెలా రూ.150 చెత్తపన్ను విధించాలంటూ కార్పొరేషన అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు కిందిస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలిచ్చేశారట. కొందరికి రోజు కూలీ కూడా గిట్టడం కష్టంగా ఉండే పరిస్థితి. అలాంటి వారిపై చెత్త పన్ను విధిస్తుం డటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర కమిషనర్‌, ఇనచార్జ్‌ ఎంహెచఓలు ఇప్పటికే సంబంధిత సిబ్బందితో వారికి ఎందుకు  లైసెన్సు చేయించారని ప్రశ్నించారట. వాళ్లకు దుకాణాలు కూడా లేవు కదా...ఎలా కట్టడమంటూ సిబ్బంది సందేహాలు వ్యక్తం చే శారట. దీంతో ఎవరు చెప్పారు..?అలా మీకు చేయకూడదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తోపుడుబండ్లపై చెత్తపన్నుకు రెడీ అయిపోయినట్లే. 


ఇదేం పద్ధతంటూ విమర్శలు...

వీధి వ్యాపారులపై చెత్తపన్ను విధిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారంతా గేట్‌ పేరుతో అనంతపురం కార్పొరేషనకు రోజూ పన్ను రూ.5, రూ.10 చొప్పున ప్రతి నెలా రూ. 150 నుంచి రూ. 300 చెల్లిస్తున్నారు. అదనంగా చెత్త పన్ను పేరుతో వసూలు చేయడం ఏంటని వీధి వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే  ఇళ్లకు, దుకాణాలకు చెత్తపన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తోపుడుబండ్ల వ్యాపారులపై బాదుడు వేయనుం డటంపై ఆ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఈ వ్యాపారానికి పన్నా...? : రమణ, మారుతీనగర్‌, అనంతపురం

మేము చేసేది తోపుడుబండ్ల వ్యాపారం. ఇప్పటికే మున్సిపాలిటీకి రోజూ రూ.5లు చొప్పున ప్రతి నెలా రూ.150 చెల్లిస్తున్నాం. పచ్చికాయల వ్యాపారం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఒక్కో కిలోపై రూ.10, రూ.20 కంటే లాభం ఉండదు. ప్లాస్టిక్‌ కవర్ల బ్యానతో న్యూస్‌ పేపర్లు, జూట్‌బ్యాగ్‌లు కొంటున్నాం. మళ్లీ ఈ వ్యాపారానికే చెత్త పన్ను విధిస్తారా...? ఇదేం పద్ధతి. 


బతకడమే కష్టమవుతోంది..: అల్లాబకాష్‌, సాయినగర్‌

వీధి వ్యాపారులు చేసుకునే జీవనాధారం పొందుతున్నాం. ఈ వ్యాపారాలతో బతకడమే కష్టంగా మారుతోంది. మళ్లీ  ప్రతి నెలా రూ. 150 ఎక్కడి నుంచి తేవాలి. ఈ పచ్చి వ్యాపారంతో కష్టంగా ఉంది. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడి కష్టపడితే కానీ గిట్టడం లేదు. ఇప్పుడు మళ్లీ చెత్తపన్ను విధిస్తే ఏం చేయాలి


 మళ్లీ ఇదేంటి.. 

కరోనా జయించి వచ్చామనుకున్నాం. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నా యి. మున్సిపాలిటీకి ప్రతి రోజూ రూ.10 చొప్పున ప్రతి నెలా రూ.300 చెల్లిస్తున్నాం. ఇప్పుడు మాపై కూడా చెత్త పన్ను విధిస్తే ఎలా బతికేది.  

- బాబా ఫకృద్దీన, కబాబ్‌ సెంటర్‌, బోయ వీధి


అలాంటిదేమీ లేదు :  పీవీవీఎస్‌ మూర్తి, మున్సిపల్‌ ఆర్డీ

వీధి వ్యాపారులకు చెత్త పన్ను విధించాలనే నిబంధన లేదు. చెత్తపన్నును కేవలం దుకాణాలు, ఇళ్లకు మాత్రమే విధించాలనే నిబంధన ఉంది. వీధి వ్యాపారులపై చెత్త పన్ను విధించాలనడం సరికాదు. ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదు.

Updated Date - 2022-08-01T06:10:36+05:30 IST