కమీషన్ల కోసమే ప్రాజెక్టు రీడిజైన్‌

ABN , First Publish Date - 2020-07-02T11:49:25+05:30 IST

కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ బృందం ఆరోపించారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్టు రీడిజైన్‌

నాసిరకంగా కాలువల పనుల నిర్మాణం

ఈఇన్‌సీ హరిరాంను సస్పెండ్‌ చేయాలి

టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌

రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల ఉపరితలంపై నిర్మాణం చేపట్టడం వల్లే నష్టం : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌, బీజేపీ లోపాయికారి ఒప్పందం : మాజీ ఎంపీ పొన్నం 


 మర్కుక్‌, జూలై1 :  కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ బృందం ఆరోపించారు. బుధవారం మర్కుక్‌ మండల పరిధిలోని శివారువెంకటాపూర్‌ వద్ద తెగిపోయిన కాలువను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి సీఎం ప్రాజెక్టును రీడిజైన్‌ చేశారని, ప్రారంభించి వారం కూడా కాకముందే కొండపోచమ్మకాలువకు గండి పడడమేమిటని ప్రశ్నించారు. సీఎం ఫాంహౌస్‌ పక్కనే జరిగినా ఆయన శివారు వెంకటాపూర్‌ గ్రామస్థులను పరామర్శించకపోవడం శోచనీయమన్నారు.


ఈఇన్‌సీ హరిరాంను బాధ్యున్ని చేస్తూ సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రీడిజైన్‌ పేరుతో ప్రాజెక్టుల ఉపరితలంపై నిర్మాణం చేపట్టడం వల్లే నష్టం జరుగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందంతో ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్న విధంగా తెలంగాణ ప్రాజెక్టులపై విచారణ జరిపించాలని డిమాం డ్‌ చేశారు. వారి వెంట జగదేవపూర్‌, ములుగు, నంగునూర్‌, వర్గల్‌ మండలాల అధ్యక్షులు కేశిరెడ్డి రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, యాదగిరి, శ్రీనివా్‌సరెడ్డి, పాములపర్తి సర్పంచ్‌ తిర్మల్‌రెడ్డి, నాయకులు తాండ కనకయ్య గౌడ్‌ ఉన్నారు.


నిర్వాసితులకు అండగా కాంగ్రెస్‌ 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కక్ష రాజకీయాలతో పాటు నిర్వాసితులకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని, ఇప్పటికైనా నిర్వాసితులకు సమన్యాయం జరిగేలా కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికిబొల్లారంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కేసులు వేసిన నిర్వాసితులతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మాట్లాడారు.  నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 


  రాజకీయాలు శాశ్వతం కాదని ప్రజలకు సేవల చేసిన వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డితో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయినవారందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని, నిర్వాసితులకు జరిగిన అన్యాయం గురించి ముఖ్యమంత్రికి తెలియకుండా అధికారులు, కలెక్టర్‌, పోలీసులు నాటకమాడుతున్నట్లు అనిపిస్తుందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని చెప్పారు. వారి వెంట కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, రమేష్‌, మల్లేష్‌ యాదవ్‌, రవి, నాయని యాదగిరి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-07-02T11:49:25+05:30 IST