పఠన వికాసం

ABN , First Publish Date - 2021-12-23T06:00:37+05:30 IST

హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన జోరుగా సాగుతోంది. గత ఏడాది కరోనా కారణంగా ప్రదర్శన లేకపోవడంతో జనం మొఖం వాచిపోయి ఉన్నారనీ, ఇప్పుడు కరువు తీరా అన్ని తరాలవారూ తరలివస్తున్నారని నిర్వాహకులు...

పఠన వికాసం

హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన జోరుగా సాగుతోంది. గత ఏడాది కరోనా కారణంగా ప్రదర్శన లేకపోవడంతో జనం మొఖం వాచిపోయి ఉన్నారనీ, ఇప్పుడు కరువు తీరా అన్ని తరాలవారూ తరలివస్తున్నారని నిర్వాహకులు సంతోషిస్తున్నారు. ఈ బుక్ ఫెయిర్ సంరంభం అంతా కొత్త సంవత్సరంలో విజయవాడకు తరలిపోతుంది. ప్రచురణ కర్తలూ రచయితలే కాదు, పుస్తక ప్రేమికుల్లో అనేకులు అక్కడ కూడా ప్రత్యక్షమవుతారు. చెన్నైలోనూ జనవరి ఆరునుంచి పుస్తక ప్రదర్శన ఆరంభమవుతున్నది. ఎక్కడ పుస్తక ప్రదర్శన జరిగినా చదువరులకు అదో అద్భుతమైన అనుబంధం, అనుభూతి. ఫ్రాంక్‌ఫర్‌్టలో ఐదువందలేళ్ళుగా బుక్ ఫెయిర్ ఘనంగా జరుగుతున్నది. కోల్‌కతా, ఢిల్లీ పుస్తక ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. అంతటి ఘనకీర్తి, ఉజ్వలచరిత్ర హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌కూ ఉన్నందుకు సంతోషం కలుగుతుంది.


అన్ని వయసులవారికీ కనువిందుచేసే ఎన్నోవేల పుస్తకాలు ఒక్కచోటచేరినప్పుడు విందుభోజనంలాగానే ఉంటుంది. కరోనా కాలంలో అది నోటికి అందనప్పుడు ఎంతో కోల్పోయినట్టే అనిపించింది. కానీ, మహమ్మారి భయంతో దేశం మూతబడిన ఈ కాలంలోనే ప్రజల్లో పఠనాభిలాష బాగా పెరిగిందని సర్వేలు తేల్చేశాయి. వీధుల్లోకి పోలేక, గదుల్లో బందీలైన ఆ లాక్ డౌన్ కాలంలో అధ్యయన గంటల సగటు మరో సగానికంటే ఎక్కువే పెరిగిందట. జనం ఫిక్షన్ మాత్రమే కాదు, ఇంతకు మించిన తరుణం దొరకదనుకొని సీరియస్ సాహిత్యాన్ని కూడా బాగానే చదివారట. కరోనా తెచ్చిన తీరికతో మొత్తానికి పఠనం హెచ్చింది. ఈ–బుక్స్, డిజిటల్, ఆడియో రూపాల్లో చదువు మరింత హెచ్చినందుకూ, అచ్చుపుస్తకాలను ఆన్‌లైన్లో కొనుక్కొని మరీ తెచ్చుకున్నందుకూ సంతోషించాల్సిందే. మహమ్మారి మారు రూపాల్లో మనలను పలుమార్లు చుట్టుముడుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నా, పుస్తకపఠనాన్ని మాత్రం అది పెంచింది, పోషించింది. ఈ లిబరలైజేషన్ యుగంలో ప్రతీ నిముషాన్నీ కరెన్సీలోకి మార్చాలన్న వెంపర్లాటలో కొత్తతరం పఠనానికి దూరమైందన్న బాధ పెద్దల్లో కనిపిస్తూంటుంది. కానీ, అది ఆధునిక రూపాలను సంతరించుకున్నదే తప్ప సన్నగిల్లలేదంటున్న సర్వేలు కాస్తంత ధైర్యాన్నిస్తాయి.


మంచిపుస్తకం, చెడ్డపుస్తకం అన్నది చదువరుల దృక్పథాన్ని బట్టి ఉంటుందేమో కానీ, మనం నడుస్తున్న దారిని సరిచేస్తూ, పాటిస్తున్న విలువలను ఎత్తిచూపుతూ ప్రగతిశీలమార్గంలో పయనించేట్టు చేస్తే చాలు. దారిని చూపి దరిచేర్చేది పుస్తకం. పుస్తకాలు చదివినవాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేకపోవచ్చునేమో కానీ, ఎక్కువమంది గొప్పవాళ్ళకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలిగే అద్భుతమైన శక్తి ఏటా వెలువడే వేలాది పుస్తకాల్లో కొన్నింటికి మాత్రమే ఉంటుంది కనుక వాటిని వెతికిపట్టుకోవలసిన బాధ్యత మనదే. చదివిన ప్రయోజనం, రచన లక్ష్యం కూడా అప్పుడే నెరవేరుతుంది. ఒకే పుస్తకం అందరి జీవితాలనూ ప్రభావితం చేయకపోవచ్చు. తమ జీవితాన్ని మేలిమలుపు తిప్పిందన్న ఓ పుస్తకం ఎవరిది వారిదే, వేరువేరే. నచ్చిన రంగాల్లో తమ ఆలోచనలు విస్తరింపచేసుకోవడానికీ, పరిణతి పెంచుకోడానికీ పఠనం ఉపకరిస్తుంది. మనమెదడుకు సానబెట్టి, ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. ఒత్తిడి తగ్గించి, జ్ఞానాన్ని పెంచుతుంది. విచక్షణతో పాటు విశ్లేషణాశక్తినీ ఇస్తుంది. మాటలో చేతలో రాతలో మనకు దారిచూపుతుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బుక్ ఫేస్ చూసి ఎన్నాళ్ళయిందని మనలను మనమే ప్రశ్నించుకుంటూ పుస్తకాన్ని అందుకోవాలి, అందుబాటులోనే ఉంచుకోవాలి. పుస్తక పఠనాన్ని పెంచడం సమాజ సమష్టి బాధ్యత.


తెలుగునాట భక్తిరసం ఎంతగా పారుతున్నా అంతకంటే ఎక్కువగా సాహిత్యం, కవిత్వం పుస్తకప్రదర్శనల్లో చెల్లుబాటు కావడం సంతోషించాల్సిందే. కొత్త పుస్తకాలతో పాటు వందేళ్ళనాటి రచనలకు కూడా తరగని గిరాకీ ఉన్నందుకు మెచ్చవలసిందే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్ ఆధ్వర్యంలో సంబరంగా సాగుతోంది. చిన్నాపెద్దా భేదం లేకుండా అక్కడకు చేరిన జనాన్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. పార్కింగ్‌ స్థలంలో ద్విచక్రవాహనాలు అత్యధికంగా ఉండడం... లోపల యువతరం పేజీలు తిరగేస్తోందనడానికి నిదర్శనమంటూ ఓ పుస్తక ప్రేమికుడు ముచ్చటపడ్డాడు. పఠనం పదికాలాలపాటు వర్ధిల్లాలని కోరుకుందాం.

Updated Date - 2021-12-23T06:00:37+05:30 IST