రీ పోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశం..

ABN , First Publish Date - 2020-09-25T10:55:55+05:30 IST

: చర్ల మండలంలోని చెన్నాపురం గ్రామంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

రీ పోస్టుమార్టానికి హైకోర్టు ఆదేశం..

భద్రాచలం, సెప్టెంబరు 24 : చర్ల మండలంలోని చెన్నాపురం గ్రామంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌కౌంటర్లో సోడి జోగయ్యతో పాటు మరో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందగా వారి మృతదేహాలకు గురువారం భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.


అనంతరం వారి మృతదేహాలను వారి బంధువులు, కుటుంబ  సభ్యులు గుర్తించడంతో వారికి అందజేశారు. అయితే చర్ల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను ఫ్రీజ్‌ చేయాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోరారు. అలాగే ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలని, మృతదేహాలను, వరంగల్‌ ఎంజీఎం లేదా హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.


దీంతో కుటుంబసభ్యుల నుంచి మృతదేహాలను తీసుకొని ప్రభుత్వ వైద్యశాలలో ఫ్రీజ్‌ చేయాలని, మూడు మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించి ఫోరెన్సిక్‌ నిపుణులతో రీపోస్టుమార్టం చేయాలని, పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించి ఆ నివేదికను సీల్డు కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-09-25T10:55:55+05:30 IST