పంటల కొనుగోలు బాధ్యత ఆర్బీకేలదే

ABN , First Publish Date - 2021-10-23T07:12:20+05:30 IST

పంటల కొనుగోలు బాధ్యత ఇకపై రైతు భరోసా కేంద్రాలదేనని (ఆర్బీకేలు) రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.

పంటల కొనుగోలు బాధ్యత ఆర్బీకేలదే
సి.గొల్లపల్లె ఆర్బీకే వద్ద పూనం మాలకొండయ్య

 వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య

తిరుపతి రూరల్‌, అక్టోబరు 22: పంటల కొనుగోలు బాధ్యత ఇకపై రైతు భరోసా కేంద్రాలదేనని (ఆర్బీకేలు) రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. తిరుపతి రూరల్‌ మండలం సి.గొల్లపల్లెలోని రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్థానిక రైతుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు సదుపాయాలు కల్పించడమే కాకుండా, పంటల కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలు రూపుదిద్దుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కియోక్స్‌ ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నమోదు కోసం మార్క్‌ఫెడ్‌ నుంచి నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. అన్ని ఉత్పత్తులను ఎమ్మార్పీకే అందించేలా చూడాలన్నారు. ఆర్బీకే పరిధిలో పంటల వివరాలను నమోదు  చేయాలని సూచించారు. పంట రుణాల మంజూరులోనూ బ్యాంకు ప్రతినిధులు వారంలో రెండు రోజులు గ్రామాలకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, హార్టికల్చర్‌, సిరికల్చర్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయికి వెళ్ళి సలహాలు ఇవ్వాలన్నారు. ఉచిత పంటల బీమా నమోదు చేయాలన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్‌ వంటి ప్రోత్సాహకాలు అర్హత గల అందరికీ అందేలా చూడాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఆర్బీకే ప్రాంగణంలో ఆమె మొక్క నాటారు. బిందు సేద్యం పరికరాలు, సూక్ష్మ పోషకాలు, జిప్సం వంటివి సబ్సిడీ ధరలకు అందించాలని ఆవెనుఉ రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో తుడా కార్యదర్శి లక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాసులు, ఏడీ సుబ్రమణ్యం, ఏవో మమత, ఆర్బీకే ఇన్‌చార్జి సోము, ఎంపీటీసీ మాధవరెడ్డి, సర్పంచ్‌ రవి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T07:12:20+05:30 IST