ఆర్బీకే ఎండమావి

ABN , First Publish Date - 2022-07-06T05:45:27+05:30 IST

ఆర్బీకేలపై ప్రభుత్వ ప్రచారం అంతా ఇంతా కాదు.

ఆర్బీకే ఎండమావి
మిడుతూరు మండలం నాగలూటి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం

ఎరువులు, విత్తనాలు ఎప్పుడొస్తాయో తెలియదు 

ముందస్తు డబ్బులిచ్చినా అనుమానమే 

సూక్ష్మ పోషకాలదీ ఇదే పరిస్థితి

అన్నీ బయటే కొంటున్న రైతులు


ఆర్బీకేలపై ప్రభుత్వ ప్రచారం అంతా ఇంతా కాదు. రైతుల అవసరాలన్నీ తీర్చడానికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. ఎరువులు, విత్తనాలకు ఆర్బీకేల్లో ముందస్తుగా డబ్బు చెల్లించాలి. అయినా సకాలంలో అందుతాయనే నమ్మకం లేదు. ఆర్బీకేల నిర్వహణ మీద నమ్మకం లేక రైతులు అన్నీ బయటే కొంటున్నారు. 


నంద్యాల, ఆంధ్రజ్యోతి 


‘ఎరువులు, విత్తనాలను రైతులకు సకాలంలో అందిస్తాం. నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల అందించడమే ఆర్బీకేల లక్ష్యం. బ్లాక్‌లో అధిక ధరలకు కొనాల్సిన పని లేదు. అన్నీ ఆర్బీకేల్లోనే అందుబాటులోకి తీసుకొస్తాం...’ ఇదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో జిల్లా అధికారులు అన్నారు. ఎరువులు బ్లాక్‌లో కొనాల్సిన పని లేకుండా అన్నీ ఆర్బీకేల్లోనే అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. కానీ ఆచరణలో ఇవేవీ అమలు కావడం లేదు. పైగా  ఆర్బీకేల్లో ముందస్తుగా డబ్బు చెల్లించాల్సి వస్తోంది. అయినా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించే ఏర్పాటు లేకపోవడంతో రైతులు ఆర్బీకేల వైపు చూసి నిరాశకు గురవుతున్నారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు వచ్చేదీ లేనిదీ తెలియక ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల రైతులు బయటి వ్యక్తుల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. 


అయోమయంలో..


జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ పనులు మొదలయ్యాయి. పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కిలో కలిపి చల్లేందుకు ఎరువులు ఆర్బీకేల్లో దొరకడం లేదు. కొన్ని చోట్ల ఆర్బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచామని అధికారులు అంటున్నారు. కానీ తగినన్ని ఎరువులు ఆర్బీకేల్లో లేదని రైతులు అంటున్నారు. ఈ విషయం స్థానిక ఆర్బీకేల్లోని ఉద్యోగులను అడిగితే ముందు డబ్బులు చెల్లించండి.. తర్వాత వచ్చి తీసుకోండి.. అంటున్నారని రైతులు నిరాశకు గురవుతున్నారు. సాధారణంగా ఖరీఫ్‌ పంటలను ఎక్కువగా కౌలు రైతులే సాగు చేస్తుంటారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇంకా కౌలు ఖరారు కాక, కౌలు అర్హత కార్డులు అందక కౌలు రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగు చేయాలా, వద్దా? అనే సంశయంలో ఉండగా ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు అందకపోవడం అదనపు సమస్యగా మారింది.  


అప్పుడు అలా... 


గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభంకాగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేవి. మండలాలకు విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాల అవసరానికి తగినట్లు ప్రణాళికబద్ధంగా అందించేవారు. ముందస్తు డబ్బు చెల్లింపులు అవసరం లేకుండా అన్నీ సిద్ధం చేసేవారు. కానీ ప్రస్తుత విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులపైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు వ్యాపారుల మీద తనిఖీలు లేకపోవడంతో  రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల నకిలీ విత్తనాలు బయటపడిన దాఖలాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు నకిలీ విత్తనాలపైన నామమాత్రపు దాడులు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేసిన వారవుతారు.

 

సూక్ష్మపోషకాలు ఏవీ..?


ఎక్కువ దిగుబడికి ఎరువులతో పాటు జింక్‌ వంటి సూక్ష్మపోషకాలను చల్లాల్సి ఉంటుంది. ధాతు లోపం నివారణకు ఎకరాలకు 20 కిలోల చొప్పున మట్టి పరీక్షలతో సంబంధం లేకుండా వాడాల్సిందేనని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అయితే జింక్‌ ఆర్బీకేల్లో దొరకకపోవడంతో మన గ్రోమోర్‌ కంపెనీల దగ్గరే రైతులు అధిక ధరలకు కొంటున్నారు. 


 ఎస్‌ఎస్‌పీ సరిపోయేనా..?


ధాతు లోపాలు లేకుండా, సూక్ష్మపోషకాలు ఉండేలా, మట్టి సారాన్ని వృద్ధి చేసి మొక్క ఎదుగుదలకు, వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు అవసరమైన ఎస్‌ఎస్‌పీ (సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌) వంటి ఎరువులను కూడా చల్లాల్సి ఉంటుంది. ఎకరాకు కనీసం మూడు బస్తాల ఎస్‌ఎస్‌పీ అవసరమని వ్యవసాయ శాఖ రైతులకు సిఫార్సు చేసింది. అధికారులు అంచనా ప్రకారం దాదాపు 2,600 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయి. అయితే ఇప్పటి వరకు ఆ స్థాయిలో అందుబాటులో లేవని సమాచారం. ఇవి ఏ మేరకు సరిపోతాయని, ఉన్న సరుకు అయిపోతే అవసరమైనవారు బయట కొనుగోలు చేయక తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఎస్‌ఎస్‌పీ బస్తా ధర గతంలో రూ.500కి అటు ఇటుగా ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.600కి పైనే పలుకుతోంది. ప్రైవేటు వ్యాపారులు ఇంకాస్త పెంచి రైతులకు అమ్ముతున్నారు. దీని తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిపోవడంతో ఎస్‌ఎస్‌పీ ధర ఎక్కువయింది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా కంపెనీల దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు అధిక ధరల భారాన్ని మోయాల్సి వస్తోంది. 

Updated Date - 2022-07-06T05:45:27+05:30 IST