రైతుల శ్రమ దోపిడీ..!

ABN , First Publish Date - 2021-05-11T07:17:40+05:30 IST

అన్నదాతలు శ్రమించి పండించిన ధాన్యం చివరకు దళారుల పరమవుతోంది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కమీషన్‌ వ్యాపారులకు మాత్రమే వరంగా మారాయి.

రైతుల శ్రమ దోపిడీ..!
అయినాపురంలో యాంత్రీకరణ ద్వారా ధాన్యం నూర్పిడి చేస్తున్న దృశ్యం

  • భరోసా ఇవ్వని రైతు భరోసా కేంద్రాలు
  • వ్యాపారులు, దళారులు, కమీషన్‌ ఏజంట్లకే ధాన్యం విక్రయాలు
  • తేమ శాతం నిబంధనే ప్రధాన అవరోధం
  • కనీస మద్దతు ధర లేక నష్టపోతున్న అన్నదాతలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

అన్నదాతలు శ్రమించి పండించిన ధాన్యం చివరకు దళారుల పరమవుతోంది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కమీషన్‌ వ్యాపారులకు మాత్రమే వరంగా మారాయి. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం విధించిన సవాలక్ష ఆంక్షల కారణంగా రైతులు తాము పండించిన ఉత్పత్తులను మధ్య దళారులకు, కమీషన్‌ ఏజంట్లకు, వ్యాపారులకు విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రతీసారీ ఇదే తరహా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నా కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షలను సడలించడంలో అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్యం రైతులు, కౌలు రైతులపాలిట శాపంగా మారుతోంది. దాళ్వా సాగు చేస్తున్న రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి సవాలక్ష నిబంధనలు అడ్డండిగా మారాయి. రైతు పంట పం డించే సమయంలోనే ఈ-క్రాప్‌ బుకింగ్‌ను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పంట కోసే సమయంలో ఆర్బీకేకు సమాచారమి వ్వాలి. సదరు రైతు పేరున ఆర్బీకేలో ఎంత భూమి ఉందనేది పరిశీలించి 75 కిలోల బస్తా చొప్పున ఎకరాకు 50 బస్తాలను మాత్రమే లెక్కగట్టి ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. తొలుత రైతు ఆర్బీకేలో నమోదు చేసుకున్న నిబంధన ప్రకారం పండించిన భూమిలో ఎన్ని బస్తాలు వస్తాయో చూసి వారికి ఓ కూపన్‌ నంబరు ఇస్తారు. ఆ తర్వాత రైతులు సూచించే మిల్లును ఆన్‌లైన్‌లో ఆమోదిస్తారు. సదరు మిల్లరు నుంచి రైతు వద్దకు వాహనం వస్తుంది. ధాన్యం పట్టుబడి, ఎగుమతి వ్యయాన్ని రైతే భరించాలి. తర్వాత మిల్లు నుంచి సంబంధిత సొసైటీకి అనుమతిస్తారు. సొసైటీ అధికారులు సదురు రైతు నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారో పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆన్‌లైన్‌ రికార్డుల్లో చూపుతారు. ఆపై రైతులకు సొమ్ము చెల్లిస్తారు. అయితే ఈ విధానం అమలు ప్రస్తుతం కౌలు రైతులకు ప్రాణ సంకటంగా మారింది. రైతు భరోసా కేంద్రంలో భూమి రైతు పేరున ఉంటే ఉత్పత్తి చేసిన కౌలు రైతులకు ఆ సొమ్ములు చెల్లించరు. ఈ నిబంధన వల్ల ప్రస్తుత దాళ్వా సీజన్లో ఆర్బేకేల ద్వారా పది శాతం మేర కూడా ధాన్యం కొనుగోలు జరగలే దనేది రైతుల ఆరోపణ. దాంతో దళారులను ఆశ్రయించి అయినకాడికి విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

తేమ నిబంధనతో... దళారుల వైపే రైతుల మొగ్గు..

ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నిబంధన కారణంగానే రైతులు వాటివైపు కన్నెత్తి చూడట్లేదు. ఉత్పత్తి అయిన ధాన్యంలో 17 శాతం తేమ లేదా నిమ్ము ఉండాలన్న కారణంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించడానికి అంగీకరించట్లేదు. ప్రస్తు తం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వారు యాంత్రీకరణ ద్వారా కోతలు చేపట్టడంతో ధాన్యంలో ఆరుదల తగ్గకపోవడంతో అయినకాడికి కళ్లాల వద్దే విక్రయించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.150 తగ్గించి దళారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తు న్నారు. ఆరుదల రకం 75 కిలోల బస్తా రూ.1410కి కొనుగోలు చేయాల్సి ఉండగా రూ.1300కు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. యాంత్రీక రణ ద్వారా తయారయ్యే ధాన్యాన్ని 75 కిలోల బస్తా రూ.1100 నుంచి రూ.1150 మధ్య  కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, టీడీపీ రైతు విభాగం అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మట్టా మహాలక్ష్మిప్రభాకర్‌ చెప్పారు. ఇక రైతుల వద్ద ఉండే రికార్డుల ఆధారంగా ఆయా వ్యాపారులు సమీపంలో అనుమతి పొందిన సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలకు విక్రయి స్తుండడం వల్ల ఆయా సొసైటీలకు కొంత శాతం కమీషన్‌ ఆదాయంగా లభి స్తుంది. వెనువెంటనే సొమ్ములు చేతికి వస్తున్న దృష్ట్యా రైతులు మద్దతు ధర రాకపోయినా దళారులవైపే మొగ్గు చూపుతు న్నా రు. ఉదాహరణకు అమలాపురం మండలం చిందాడ గరువుకు చెందిన ఒక రైతు ఆ గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా పండించిన ధాన్యాన్ని అమ్మాడు. ఆ గ్రామంలో మిగిలిన రైతులు దళారులవైపు మొగ్గు చూపారంటే నిబంధనల అమలు తీరు ఏ రీతిన ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పైగా అటు కౌలు రైతులకు నష్టం కలిగించడంతోపాటు, విక్రయించిన ధాన్యానికి డబ్బులు రావాలంటే నెలలపాటు నిరీక్షించాలని రైతులు చెబుతున్నారు. 

మద్దతు ధర చెల్లించాలి : ఎమ్మెల్యే గోరంట్ల 

రాజమహేంద్రవరం రూరల్‌, మే 10 : ప్రభుత్వం వరి పండించే రైతులకు సరైన మద్దతు ధర చెల్లించకపోవడంతో పంట పండించే రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా మద్ద తు ధర కల్పించి కాపాడాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఎంటీ యూ- 2636 (బొండాలు) రకం 75 కేజీల బస్తా ఒక్కంటికి రూ. 1,410 చెల్లించాల్సి ఉండగా రూ.1,100 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. రైతుభరోసా కేంద్రాల్లో పంటను కొనుగోలు చేయక పోవడం వల్ల రైసుమిల్లర్లు ప్రభుత్వాదేశాల ప్రకారం 16 శాతం తేమ ఉన్న పంటను కొనాల్సి ఉన్నప్పటికీ కేవలం 14 శాతం తేమ ఉన్న పంటను మాత్రమే రేట్లు తగ్గించి కొంటున్నారన్నారు. తేలిక రకం కాటా బొండాలు 75 కేజీలు ఒక్కంటికి రూ. 800 నుంచి రూ. వెయ్యి వరకు మాత్రమే కొంటున్నారన్నారు. దీనివల్ల రైతు ఎకరాకు రూ. 12 వేల నుంచి రూ.18 వేల వరకు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Updated Date - 2021-05-11T07:17:40+05:30 IST