ఆర్బీకేలలో.. చేతివాటం

ABN , First Publish Date - 2022-08-02T05:18:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారాయి. అధికారపార్టీకి చెందిన రైతులకే సేవలందిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్బీకేలలో.. చేతివాటం
రైతుభరోసా కేంద్రం


అక్రమాలకు కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు

అధికారపార్టీకి చెందిన రైతులకే సేవలు 

కంపెనీలకు డబ్బుచెల్లించకుండా కాలయాపన

      

         (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారాయి. అధికారపార్టీకి చెందిన రైతులకే సేవలందిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 856 ఆర్‌బీకేలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో స్థానిక నేతల కనుసన్నల్లో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నా దానికి సంబంధించిన డబ్బును కంపెనీలకు వెంటనే చెల్లించటంలేదు.  

- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో సుమారు పది ఆర్‌బీకేలలో రైతులకు ప్రభుత్వ అను మతి లేకుండా కల్తీ వేపనూనె అమ్మారు. స్థానిక వైసీపీ నేత ఆదేశాలతోనే ఈ అమ్మకాలు జరిగాయి. ఈ వేపనూనె కల్తీది అని ప్రభుత్వ ల్యాబ్‌ తేల్చింది. కానీ ఇంతవరకు చర్యలు లేవు. 

- గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, బాపట్ట జిల్లా చెరుకుపల్లి మండలాల్లో పంటల బీమా పథకం లబ్ధిదారుల వివరాల కంప్యూటరీకరణలో ఆర్‌బీకే సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై వ్యవసాయ శాఖ డీడీ స్థాయి అధికారి దర్యాప్తు చేశారు. బోగస్‌ రైతుల పేర్లు నమోదు చేసిన ఆర్‌బీకే సిబ్బంది ని సర్వీస్‌ నుంచి తొలగించాలని రెండేళ్ల కిందట సిఫార్స్‌ చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. 

- బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో ఆర్‌బీకేలకు వచ్చిన ఎరువులను ప్రైవేట్‌ షాపుల్లో అమ్ము తున్నట్లు అధికారపార్టీ సర్పంచ్‌లు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

- పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండల పరిషత్‌ కాంప్లెక్స్‌లోని చాగంటివారిపాలెం ఆర్‌బీకేలో ఎరువులు విక్రయించగా వచ్చిన డబ్బును సిబ్బందే దొంగిలించారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

- పెదకాకాని ఆర్‌బీకేలో ప్రభుత్వం ఇచ్చిన టీవీని దొంగిలించినట్లు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

- పొన్నూరు మండలం ఆరెమండ ఆర్‌బీకేలో ఎరువులు అమ్మిన డబ్బును జమ చేయలేదు. దీంతో  సిబ్బందికి ఉన్నతాధికారులు నోటీసులిచ్చారు. 

- చేబ్రోలు మండలం ఆర్‌బీకే సిబ్బంది సరిగా పనిచేయడం లేదని ఏకంగా ఎమ్మెల్యే కిలారి రోశయ్య వ్యవసాయ శాఖ అధికారులకు లేఖ రాశారు.

- పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఉద్యాన శాఖ ఆర్‌బీకే ఉద్యోగి రూ.2 లక్షలు ఎరువుల  డబ్బు చెల్లించలేదని క్రమశిక్షణ చర్యలు తీసు కోబోతున్నట్లు అధికారులు తెలిపారు.


ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో..

ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ధాన్యం, మొక్కజొన్న, జొన్న, మినుములు, పెసలు తదితర పంటలు కొ నుగోలు చేసింది. పల్నాడు జిల్లాలో 13 మంది  సిబ్బంది ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. దీంతో 11 మందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు పల్నాడు వ్యవసాయ శాఖ జేడీ మురళి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లల్లో అధికారపార్టీ రైతులకే ఆర్‌బీకే సిబ్బంది ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్‌ ఉన్న పత్తి విత్తనాలు వైసీపీ అనుచరులకే ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  



Updated Date - 2022-08-02T05:18:54+05:30 IST