బిల్లులు రావు.. పనులు సాగవు...

ABN , First Publish Date - 2022-05-19T06:38:14+05:30 IST

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి.

బిల్లులు రావు.. పనులు సాగవు...
పాయకరావుపేట మండలం అరట్లకోటలో పునాదులకే పరిమితమైన ఆర్‌బీకే భవనం

ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు

కాంట్రాక్టర్లకు నెలల తరబడి అందని బిల్లులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 699 ఆర్‌బీకేలు

671 కేంద్రాలకు భవనాలు మంజూరు

ఒక్కోదానికి రూ.21.08 లక్షలు కేటాయింపు

ఇంతవరకు 120 భవనాలు మాత్రమే పూర్తి

వివిధ దశల్లో 551 భవన నిర్మాణ పనులు

మార్చినాటికి రూ.51.92 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌

రూ.28 కోట్లు మాత్రమే చెల్లింపు

పలుచోట్ల పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. జిల్లాలో 671 ఆర్‌బీకేలకు భవనాలు మంజూరుకాగా ఇంతవరకు 120 భవనాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన భవనాల పనులు వివిధ దశల్లో వున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు విరుద్ధంగా వుంది. మార్చినాటికి రూ.51.92 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేయగా రూ.28 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్లకు అందాయి. బిల్లులు మంజూరు కాని  కాంట్రాక్టర్లు భవవ నిర్మాణ పనులను ఆపేశారు. 

రైతులకు అన్ని రకాల సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి అవసరమైన భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని పాలకులు, అధికారులు తరచూ చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ఈ భవన నిర్మాణాలకు నిధుల కొరత కూడా లేదంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి మరోలా వుంది. చాలా మండలాల్లో ఆర్‌బీకేల భవన నిర్మాణాలు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. నెలల తరబడి ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపేసినట్టు తెలిసింది. మరికొన్ని భవన నిర్మాణ పనులు ఏడాది కాలంగా కొనసా...గుతూనే ఉన్నాయి. 

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 699 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఆర్‌బీకేకు రూ.21.08 లక్షలతో  భవన నిర్మాణాలు చేపడతామని అధికారులు చెప్పారు. కొన్నిచోట్ల స్థలాల కొరత, భూ వివాదాలు, ఇతరత్రా కారణాలతో 28 ఆర్‌బీకేలకు భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన వాటిలో 120 భవనాలు పూర్తయ్యాయని, 551 కేంద్రాల భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ చాలా భవనాల పనులు నెలల క్రితం ఆగిపోయాయి. బిల్లులు మంజూరు కాకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది.  పీఆర్‌ ఇంజనీర్లు గత మార్చినాటికి రూ.51.92 కోట్ల మేర బిల్లులు అప్‌లోడ్‌ చేయగా రూ.28 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్లకు అందినట్టు తెలిసింది.  బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియక, చేతిలో డబ్బులు లేక పలువురు కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు.

పాయకరావుపేట మండలంలో మొత్తం 19 రైతు భరోసా కేంద్రాలకు సుమారు ఏడాది క్రితం భవన నిర్మాణ పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు మూడు భవనాలు  మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 16 భవన నిర్మాణాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఎక్కడా పనులు జరగడంలేదు. 

బుచ్చెయ్యపేట మండలంలో 22 రైతు భరోసా కేంద్రాలు వుండగా విజయరామరాజుపేటలో మాత్రమే భవన నిర్మాణం పూర్తయ్యింది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్‌కు కొంత మేర బిల్లు అందాల్సి వుందని, దీంతో వ్యవసాయ శాఖకు భవనాన్ని అప్పగించలేదని సమాచారం. మిగిలిన 21 భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. 

మునగపాక మండలంలో 20 రైతు భరోసా కేంద్రాలకుగాను మూడు కేంద్రాల భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 

 

త్వరలో భవన నిర్మాణాలు పూర్తి

వీరంనాయుడు, ఎస్‌ఈ, పీఆర్‌ ఇంజనీరింగ్‌ విభాగం, అనకాపల్లి

జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేయిస్తాం. సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తాయి. ద దీంతో బిల్లుల చెల్లింపులో కొంతజాప్యం జరిగింది.    కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆయా కాంట్రాక్టర్లను ఆదేశించాం.




Updated Date - 2022-05-19T06:38:14+05:30 IST