కార్పొరేట్‌, రిటైల్‌ రుణాల పునర్‌ వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2020-08-07T06:35:49+05:30 IST

అందరూ ఊహించినట్టుగానే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఈ సారి రెపో రేటు జోలికి పోలేదు. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే ప్రయత్నంలో భాగంగా ఎంపిక చేసిన కార్పొరేట్‌, వ్యక్తిగత రుణాల రీస్ట్రక్చరింగ్‌కు బ్యాంకులను అనుమతించింది...

కార్పొరేట్‌, రిటైల్‌ రుణాల పునర్‌ వ్యవస్థీకరణ

అందరూ ఊహించినట్టుగానే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఈ సారి రెపో రేటు జోలికి పోలేదు. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే ప్రయత్నంలో భాగంగా ఎంపిక చేసిన కార్పొరేట్‌, వ్యక్తిగత రుణాల రీస్ట్రక్చరింగ్‌కు బ్యాంకులను అనుమతించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు అదనపు లిక్విడిటీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా బంగారం ఆభరణాలపై ఇచ్చే రుణాల పరిమితిని కూడా పెంచింది. స్టార్ట్‌పలను ప్రాధాన్యతా రంగం కిందకు తీసుకురావాలని కూడా ఆర్‌బీఐ నిర్ణయించింది.  



  • కేవీ కామత్‌ సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • రెపో రేటు యథాతథం
  • ద్రవ్యోల్బణం పైకి, వృద్ధి రేటు దిగువకు
  • స్టార్ట్‌పలకు ప్రాధాన్య రంగం ప్రతిపత్తి
  • ఇక  కార్డుల ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ చెల్లింపులు
  • ఆర్‌బీఐ పాలసీలో కీలక నిర్ణయాలు 


ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం కన్నా ప్రస్తుత కష్టకాలంలో కార్పొరేట్లు, సామాన్య ప్రజల చేతిలో నగదు చలామణిలో ఉంచడానికే మొగ్గు చూపింది. ఫిబ్రవరి నుంచి వరుసగా 1.15 శాతం మేరకు రెపో రేటును 1.15 శాతం మేరకు తగ్గించిన అనంతరం ఈ సారి దాన్ని 4 శాతం వద్ద యథాతథంగా నిలిపింది. ఆరుగురు సభ్యుల ఎంపీసీ రెపోరేటు యథాతథ స్థితికి ఏకగ్రీవంగా ఓటు వేసింది. అలాగే కరోనా కల్లో లం కారణంగా పాతాళానికి పడిపోయిన వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీరేట్ల విషయంలో సానుకూల వైఖరిని కొనసాగించాలని కూడా ఎంపీసీ నిర్ణయించింది. శక్తికాంత దాస్‌ గురువారం ఈ నిర్ణయాలను ప్రకటించారు. కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని వర్గాల రుణగ్రహీతలకు అందుబాటులో ఉంచిన రుణ వాయిదాల మారటోరియం ఆగస్టు 31 తర్వాత పొడిగించేది, లేనిది ఆయన వెల్లడించలేదు. 


రుణ పునర్‌ వ్యవస్థీకరణ

కొవిడ్‌-19 కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న కార్పొరేట్‌, రిటైల్‌ రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ ఏకకాల రుణ పునర్‌ వ్యవస్థీకరణ ప్రకటించింది. 2019 జూన్‌ 7వ తేదీన జారీ చేసిన విధివిధానాల పరిధిలోనే ఈ పథకం అమలు జరుగుతుందని దాస్‌ ప్రకటించారు. రుణ పునర్‌ వ్యవస్థీకరణ కల్పించే ఖాతాలపై బ్యాంకులు 10 శాతం ప్రత్యేక ప్రావిజనింగ్‌ చేసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం వచ్చే కార్పొరేట్‌ సంస్థల అభ్యర్థనలు, వాటి సాధ్యాసాధాలను పరిశీలించి సిఫారసులు చేసేందుకు ప్రముఖ బ్యాంకర్‌ కేవీ కామత్‌ సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఆర్థిక స్వస్థతను కాపాడడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక ఒత్తిడిలో పడిన ఖాతాలకు మాత్రమే ఇది పరిమితమని, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి రుణ చెల్లింపులో 30 రోజులకు మించని జాప్యం ఉన్న కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింప చేస్తామని ఆయన చెప్పారు. ఈ  ఏడాది డిసెంబరు 31 లోగా    రిజల్యూషన్‌ ప్రణాళిక మంజూరు చేయవచ్చని, అప్పటి నుంచి 180 రోజుల్లోగా దాన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ   తెలిపింది. దీని కింద రుణం చెల్లింపునకు మిగిలి ఉన్న కాలపరిమితిని పెంచవచ్చని, రెండేళ్లకు మించకుండా రుణ చెల్లింపులపై మారటోరియం కూడా ఇవ్వవచ్చని పేర్కొంది. 

రిటైల్‌ కస్టమర్ల వ్యక్తిగత రుణాలకు ప్రత్యేక విధివిధానాలుంటాయని, దీని కింద కూడా డిసెంబరు 31 లోగా రిజల్యూషన్‌ మంజూరు చేసి ఆ తేదీ నుంచి 90 రోజుల్లోగా దాన్ని అమలుపరచాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది.  


ఎంఎ్‌సఎంఈలకు పొడిగింపు 

రుణ పునర్‌ వ్యవస్థీకరణ ఇప్పటికే అమల్లో ఉన్న ఎంఎ్‌సఎంఈ విభాగానికి ఆ సదుపాయం 2021 మార్చి 31 వరకు అంటే మరో మూడు నెలలు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అలాగే ఈ పథకం ఉపయోగించుకునేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో కొన్నింటిని సడలించనున్నట్టు కూడా తెలిపింది. అయితే ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి స్టాండర్డ్‌ ఖాతాల వర్గీకరణలో ఉన్న వాటికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని, వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ లోగా రుణ పునర్‌ వ్యవస్థీకరణ అమలుపరచాల్సి ఉంటుందని దాస్‌ చెప్పారు.   


ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు

ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ సమాజంలోకి మరింత లోతుగా చొచ్చుకుపోవడానికి, సమర్థవంతమైన బ్యాంకింగ్‌ సేవలకు ఉపయోగపడే సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహించేందుకు, ఇంక్యుబేషన్‌ సదుపాయం కల్పించేందుకు ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. బాధ్యతాయుతమైన ఆలోచనలను ఆర్‌బీఐ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉం టుందంటూ కొత్త ఉత్పత్తులపై ప్రయోగాల కోసం అనుమతించిన రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌ను ఇందుకు ఉదాహరణగా చూపింది. దీని కింద డిజిటల్‌ చెల్లింపులకు చెందిన ఆరు ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందని, కానీ కొవిడ్‌-19 కారణంగా వాటిపై ప్రయోగాత్మక అధ్యయనాలు, పరీక్షలకు అంతరాయం కలిగిందని తెలిపింది.  


కార్డులతో ఆఫ్‌లైన్‌ రిటైల్‌ చెల్లింపులు 

కార్డులు, మొబైల్‌ డివైస్‌లను ఉపయోగించి రూ.200 వరకు ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు ఆమోదించే కొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేని కారణంగా డిజిటల్‌ లావాదేవీలు జరపలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని   తెలిపింది. ఇందుకు అనుగుణంగా వివిధ సంస్థలు ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ సొల్యూషన్లు అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆర్‌బీఐ త్వరలోనే జారీ చేస్తుంది. 


ఆర్‌బీఐ ఇంకా ఏమన్నదంటే...

ధరల కాటు తప్పదు : సరఫరాల వ్యవస్థలో అవరోధాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా ద్రవ్యోల్బణం అధికంగానే ఉండి ఆ తర్వాత తగ్గుముఖం పట్టవచ్చు. కరోనా కల్లోలం కారణంగా ప్రపంచంలోని పలు ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. అయితే అది ఎంతమేరకు ఉంటుందనేది అంచనా వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం. రబీ పంట దిగుబడులు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే దానిపై ఒక స్పష్టత వస్తుంది.   

వృద్ధిలో భారీ క్షీణత: కొవిడ్‌-19 సృష్టించిన కల్లోలం కారణంగా ఆర్థిక వృద్ధి మరింతగా క్షీణించే ప్రమాదం ఎదుర్కొంటోంది. సుదీర్ఘ కాలం పాటు పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోవడం, ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్‌ దశలో ప్రవేశించినా కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికీ కట్టడి చర్యలు కొనసాగుతూ ఉండడం ఈ ముప్పును మరింతగా పెంచింది. కరోనా కేసులు ఎంతగా పెరుగుతూ ఉంటే అంతకాలం ఆర్థిక వ్యవస్థ ముప్పును ఎదుర్కొంటూనే ఉంటుంది.   

నాబార్డ్‌, ఎన్‌హెచ్‌బీలకు నిధులు: చిన్న తరహా ఆర్థిక సంస్థలు, గృహ రుణ కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు నాబార్డ్‌, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల అదనపు స్పెషల్‌ లిక్విడిటీ సదుపాయం కల్పిస్తారు. రెండు బ్యాంకులకు ఈ మొత్తాన్ని సమానంగా అందచేస్తారు. ప్రత్యేకంగా అందిస్తున్న ఈ నిధులపై ఆ రెండు బ్యాంకుల నుంచి రెపో రేటుతో సమానంగానే వడ్డీ వసూలు చేస్తారు. రిటైల్‌ రుణగ్రహీతలు మారటోరియంను అధికంగా  ఉపయోగించుకున్నందు వల్ల ఈ రెండు బ్యాంకులకు రీపేమెంట్‌ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఈ ప్రత్యేక నిధులు అందిస్తున్నారు. 

స్టార్ట్‌పలకు ప్రాధాన్యతా రుణాలు: ప్రాధాన్యతా రుణాల పరిధిని మరింతగా విస్తరించనున్నారు. ఇక నుంచి స్టార్ట్‌పలు కూడా ప్రాధాన్యతా రుణాల పరిధిలోకి వస్తాయి. అలాగే పునరుత్పాదక ఇంధన రంగానికి రుణ పరిమితిని పెంచడంతో పాటు చిన్నకారు, సన్నకారు రైతులు, బలహీన వర్గాలకు రుణ లక్ష్యాలను పెంచాలని కూడా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇందుకు వీలుగా బ్యాంకులు ఇక నుంచి 40 శాతం రుణాలను లేదా తమ పద్దుల్లో దానితో సమానమైన మొత్తాన్ని ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని ప్రాధాన్యతా రంగాలకు రుణాలుగా కేటాయించాలి. 

పాజిటివ్‌ పే విధానంతో చెక్‌ మోసాలకు చెక్‌:  బ్యాంకుల్లో చెక్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ త్వరలో కొత్త విధానం తీసుకు రాబోతోంది. పాజిటివ్‌ పే పేరుతో ఈ విధానం తీసుకురానుంది. ఈ విధానంలో చెక్‌ జారీ చేసే వ్యక్తి, సంబంధిత లబ్దిదారుడికి చెక్‌ ఇచ్చే ముందే, ఆ చెక్‌ ఫొటో తీసి దాన్ని బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రూ.50,000 అంత కంటే ఎక్కువ మొత్తానికి జారీ చేసే చెక్కులన్నిటిని ‘పాజిటివ్‌ పే’ పరిధిలోకి తీసుకురానున్నారు. దీంతో చెక్‌ క్లియరెన్స్‌కు వచ్చే ముందే బ్యాంక్‌కు ఆ చెక్‌ ఎవరి పేరు మీద, ఎంత మొత్తానికి జారీ చేశారనే విషయం తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 2016 నుంచే ఈ విదానం అనుసరిస్తోంది.  

కరెంట్‌ ఖాతాలపై ఆంక్షలు: కరెంట్‌ ఖాతాల ప్రారంభంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. క్యాష్‌ క్రెడిట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాల్ని ఉపయోగించుకున్న వ్యాపార సంస్థలు కొత్త కరెంట్‌ ఖాతాలు ప్రారంభించడాన్ని నిషేధిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. పరపతి వ్యవస్థలో క్రమశిక్షణ కోసం ఈ చర్య తీసుకుంది. 


Updated Date - 2020-08-07T06:35:49+05:30 IST