ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.30,307 కోట్ల డివిడెండ్‌

ABN , First Publish Date - 2022-05-21T08:33:15+05:30 IST

ప్రభుత్వ ఆశలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నీళ్లు చల్లింది. ప్రభుత్వానికి ఏటా చెల్లించే డివిడెండ్‌లో భారీగా కోత పెట్టింది.

ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.30,307 కోట్ల డివిడెండ్‌

2021-22లో భారీగా తగ్గుదల 

ఆదాయం తగ్గటం, పొంచి ఉన్న ముప్పులే కారణం

ముందు జాగ్రత్తగా డివిడెండ్‌ కుదింపు 

ముంబై : ప్రభుత్వ ఆశలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నీళ్లు చల్లింది. ప్రభుత్వానికి ఏటా చెల్లించే డివిడెండ్‌లో భారీగా కోత పెట్టింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించే డివిడెండ్‌ను రూ.30,307 కోట్లకు కుదించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్‌ డైరెక్టర్ల బోర్డు ఈ మేరకు సిఫారసు చేసింది. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి రూ.73,948  కోట్ల మేరకు డివిడెండ్‌ చెల్లింపులు ఉంటాయని ప్రభుత్వం ఆశించింది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రూ.1.01 లక్షల కోట్ల డివిడెండ్‌తో పోల్చితే ఇది 27 శాతం తక్కువ. అయితే తాజాగా డివిడెండ్‌ను ఏకంగా రూ.30 వేల కోట్లకు తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ పెద్దలను నిరాశ పరిచిందనే చెప్పాలి. కొవిడ్‌తో గత ఏడాది ఆదాయం తగ్గడం, పొంచి ఉన్న ఆర్థిక ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు కంటిన్‌జెన్సీ రిస్క్‌ బఫర్‌ను 5.5 శాతం వద్ద కొనసాగించాలని ఆర్‌బీఐ బోర్డు నిర్ణయించింది.


ఆర్థిక సంవత్సరం మార్చుకున్నా: 2021 మార్చితో ముగిసిన తొమ్మిది నెలలతో పోలిస్తే ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి ఆర్‌బీఐ చెల్లించే డివిడెండ్‌ భారీగా తగ్గిపోయింది. గత ఏడాది మార్చితో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి ఆర్‌బీఐ రూ.99,122 కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్‌గా చెల్లించింది. అప్పట్లో ఆర్‌బీఐ జూలై నుంచి జూన్‌ వరకు ఆర్థిక సంవత్సరంగా పాటించేది. తర్వాత ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తన ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఏప్రిల్‌-మార్చికి మార్చుకుంది. అయినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఆర్థిక పరిస్థితులు విషమించాయి. మరోవైపు అమెరికాలో మాంద్యం పొంచి ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటూ గింగిరాలు పోతోంది. దీంతో ఆర్‌బీఐ ముందు జాగ్రత్త పడుతోందని భావిస్తున్నారు. కాగా 2018-19లో ఆర్‌బీఐ.. ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది

Updated Date - 2022-05-21T08:33:15+05:30 IST