వడ్డీ రేట్లు పెంపుతో మీపై EMI భారం పెరిగింది.. ఏ స్థాయిలోనో తెలుసా...

ABN , First Publish Date - 2022-06-08T22:07:51+05:30 IST

ఆర్థికవేత్తల అంచనాలను నిజం చేస్తూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) కీలకమైన రెపో రేటుని 50 బేసిస్ పాయింట్ల

వడ్డీ రేట్లు పెంపుతో మీపై EMI భారం పెరిగింది.. ఏ స్థాయిలోనో తెలుసా...

ముంబై : ఆర్థికవేత్తల అంచనాలను నిజం చేస్తూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) కీలకమైన రెపో రేటుని 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రెపో రేటు 4.90 శాతానికి చేరిన విషయం తెలిసిందే. అయితే వడ్డీ రేట్లు పెంపు నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాలపై ఎంతమేర ప్రభావం పడుతుందో ఓ లుక్కేద్దాం..


రెపో రేటు పెంపు ప్రభావం ఆర్బీఐ వద్ద స్వల్పకాలిక రుణాలు తీసుకునే కమర్షియల్ బ్యాంకులపై పడుతుంది. అంటే ఆర్బీఐకి బ్యాంకులు చెల్లించే వడ్డీ పెరుగుతుంది. అయితే బ్యాంకులు పెరిగిన రెపో రేటు భారాన్ని నేరుగా భరించక.. తమ కస్టమర్లపై మోపుతాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు పెంపు ఇందులో భాగమే. అందుకనే రెపో రేటు పెంపు నిర్ణయం కమర్షియల్ బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారిపై పరోక్ష ప్రభావం పడుతుంది. కాబట్టి తాజా ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణం వంటి రిటైల్ రుణాలపై అదనపు భారం పడుతుంది. 


ఈఎంఐలపై ఎంతమేర ప్రభావం...

ఎస్‌బీఐ నుంచి మీరు 7.1 శాతం వడ్డీతో రూ.20 లక్షల గృహ రుణాన్ని 30 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారనుకుందాం. రెపో రేటు పెంపు ప్రభావంతో వడ్డీ రేటు 7.1 శాతం నుంచి 8 శాతానికి పెరిగితే.. మీ ఈఎంఐ భారం రూ.13,441 నుంచి రూ.14,675కి పెరుగుతుంది. అంటే మీపై రూ.1234 అదనపు భారం పడిందన్నమాట. ఇదే విధంగా ఎస్‌బీఐ కారు రుణ రేటు  ప్రస్తుతం 7.45 శాతంగా ఉంది. ఈ రేటు 8.35 శాతానికి పెరిగిందనుకుంటే.. రూ.10 లక్షల రుణం తీసుకున్నవారి ఈఎంఐ రూ.8,025 నుంచి రూ.8,584కు పెరుగుతుంది. రుణగ్రహీతలపై రూ.559 అదనపు భారం పడుతుంది. ఇక 7.05 శాతం వడ్డీతో 10 ఏళ్ల కాలానికి రూ.10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నారనుకుంటే.. వడ్డీ రేటు 7.95 శాతానికి పెరిగితే ఈఎంఐ భారం రూ.469 పెరుగుదలతో రూ.11,637 నుంచి రూ.12,106కు చేరుతుంది.


రెపో పెరిగిందంటే భారంపడినట్టే... కారణం ఇదే..

ఏప్రిల్‌లో 6.50 శాతంగా ఉన్న గృహరుణ వడ్డీ రేటు రెపో రేటు పెంపు ప్రభావంతో ప్రస్తుత నెల జూన్‌లో ఏకంగా 7.60 శాతానికి చేరింది. వెంటవెంటనే వడ్డీ రేట్లు పెంచడంతో ఇప్పటికే రుణాలు పొందినవారిపై దీర్ఘకాలంపాటు ప్రభావం చూపనుంది. ఉదాహరణగా ఒక వ్యక్తి 7 శాతం వడ్డీతో 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తీసుకున్నాడనుకుందాం. వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగితే రుణగ్రహీత అదనంగా 24 ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్‌బజార్.కామ్ సీఈవో అధిల్ శెట్టీ వివరించారు. కాగా గత నెలలోనే ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో 36 రోజుల వ్యవధిలోనే మొత్తం 90 బేసిస్ పాయింట్ల భారం రుణగ్రహీతలపై పడింది. దీంతో ప్రస్తుత రుణగ్రహీతలతోపాటు కొత్తగా రుణాలు తీసుకునేవారిపై కూడా ప్రభావం పడనుంది.

Updated Date - 2022-06-08T22:07:51+05:30 IST