వడ్డీ రేట్లు యథాతథం?

ABN , First Publish Date - 2020-09-28T06:11:12+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మంగళవారం నుంచి సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఎంపీసీ....

వడ్డీ రేట్లు యథాతథం?

  • రేపటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ


ముంబై : భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మంగళవారం నుంచి సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఎంపీసీ.. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ద్రవ్యపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. అక్టోబరు 1న సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ ప్రకటిస్తారు. కొవిడ్‌ ఇంకా సద్దుమణగనందున ఆర్‌బీఐ కీలక రెపో వడ్డీ రేటును మరింత తగ్గించాలనే వాదన వినిపిస్తోంది. అయితే ద్రవ్యోల్బణం భయంతో ఈ సమావేశంలో నూ ఆర్‌బీఐ ఇందుకు సాహసించక పోవచ్చని భావిస్తున్నారు.


ఆగస్టు నెలలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతం అటుఇటుగా, నాలుగు శాతం దగ్గర కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లెక్కన చూస్తే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా ఆరు శాతంపైన కొనసాగుతోంది. సెప్టెంబరులో మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలూ వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి కోసం అవసరమైన అన్ని ఆయుధాలనూ సిద్ధంగా ఉంచుకుంటామని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరు శాతం దిగువకు దిగొచ్చే వరకు ఆర్‌బీఐ రెపో రేటు తగ్గిపు జోలికి పోకపోవచ్చని నిపుణుల అంచనా. అప్పటి వరకు రెపో రేటుకు సంబంధించి ఆర్‌బీఐ యథాతథ స్థితినే కొనసాగిస్తుందని సీఐఐ, అసోచామ్‌ వంటి పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు ఇప్పటికే అంచనాకు వచ్చాయి. 


బ్యాంకింగ్‌ మోసాలపై బిగ్‌బీ ప్రచారం

బ్యాంకింగ్‌ మోసాలపై ఖాతాదారులను అప్రమత్తం చేసేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు చేపట్టింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ద్వారా ఇందుకోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. ట్వ్టిట్టర్‌లో ఇందుకోసం ఏకంగా ‘ఆర్‌బీఐ సేస్‌’ పేరుతో ఆదివారం ప్రత్యేక ఖాతా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో బిగ్‌బీ.. బ్యాంకింగ్‌ మోసాలపై అవగాహన పెంచుకునేందుకు నయాపైసా ఖర్చు కాదు. లేకపోతే కష్టార్జితమంతా ఊడ్చుకుపోతారు జర జాగ్రత్త’ అంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-09-28T06:11:12+05:30 IST