హెల్త్‌కేర్‌కు భారీ ఉద్దీపన

ABN , First Publish Date - 2021-05-06T06:40:44+05:30 IST

కరోనా రెండో దశ ఉధృతి నుంచి ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ తనవంతు చర్యలు ప్రకటించింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులకు రుణ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించింది...

హెల్త్‌కేర్‌కు భారీ ఉద్దీపన

  • రుణ మద్దతు కోసం బ్యాంకులకు రూ.50 వేల కోట్ల నిధులు
  • రూ.25 కోట్ల లోపు రుణాల పునర్‌ వ్యవస్థీకరణ
  • చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల రుణం 
  • చిన్న రుణగ్రహీతలకూ ఊరట 
  • కరోనా కష్టకాలంలో ఆర్‌బీఐ కీలక చర్యలు

ముంబై: కరోనా రెండో దశ ఉధృతి నుంచి ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ తనవంతు చర్యలు ప్రకటించింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులకు రుణ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించింది. వ్యాక్సిన్‌ తయారీదారులు, ఆసుపత్రులు, కరోనా సంబంధిత మౌలిక సదుపాయాల కొనుగోలుకు రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకుల కోసం రూ.50,000 కోట్ల ప్రత్యేక వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం ప్రకటించిన కరోనా ఊరట చర్యలకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు.. 

  1. వ్యక్తులతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎ్‌సఎంఈ) రుణ చెల్లింపుల గడువును రెండేళ్ల వరకు పెంచుకోవడం లేదా వడ్డీ రేటు విషయంలో రుణదాతతో పునఃసంప్రదింపులు చేసుకునే అవకాశం కల్పించింది. గత ఏడాది ప్రకటించిన రుణ పునర్‌వ్యవస్థీకరణ అవకాశాన్ని ఉపయోగించుకోనివారు, ఈ ఏడాది మార్చి వరకు సక్రమంగా ఈఎంఐలు చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 
  2. మొత్తం బకాయిలు రూ.25 కోట్లకు మించని రుణగ్రహీతలకు మాత్రమే పునర్‌వ్యవస్థీకరణకు అవకాశం లభిస్తుంది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)  అంచనా ప్రకారం.. వ్యవస్థలోని 90 శాతం రుణగ్రహీతలు ఇందుకు అర్హులవుతారు. 
  3. కరోనా కాలంలో వైద్య రంగానికి పెద్దఎత్తున రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంక్‌లకు ఆర్‌బీఐ రూ.50 వేల కోట్ల ద్రవ్య మద్దతు కల్పించింది. వ్యాక్సిన్‌ తయారీదారులు, దిగుమతిదారులు, వ్యాక్సిన్‌ సరఫరాదారులు, వైద్య పరికరాల సంస్థలకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. 
  4. బ్యాంక్‌లు ప్రస్తుత రెపో రేటుకే (4 శాతం) మూడేళ్ల కాలానికి రుణాలు పొందే అవకాశం లభించనుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రత్యేక వసతి అందుబాటులో ఉంటుంది. 
  5. ప్రభుత్వ సెక్యూరిటీస్‌ అక్విజిషన్‌ ప్రోగ్రామ్‌ (జీశాప్‌) కింద ఈనెల 20న రూ.35,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేయనుంది. 
  6. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల లాంగ్‌టర్మ్‌ (మూడేళ్ల కాలపరిమితి) రెపో కార్యకలాపాలను ప్రకటించింది. 
  7. చిన్న రుణగ్రహీతలకిచ్చే రుణాల కోసం బ్యాంక్‌లు కనిష్ఠ నిల్వల నిర్వహణకు అనుమతి  కల్పించింది. 
  8. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేవైసీ (వినియోగదారు వ్యక్తిగత వివరాల ధ్రువీకరణ) నిబంధనల్లో సడలింపు. కొన్ని విభాగాలకు వీడియో కేవైసీకి అనుమతి. ఈ ఏడాది డిసెంబరు 1 వరకు పరిమిత కేవైసీ వెసులుబాటు. 
  9. సెప్టెంబరు 30 వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) నిబంధనల్లో సడలింపు. 



స్వాగతించిన ఇండస్ట్రీ వర్గాలు 

ఆర్‌బీఐ చర్యలను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. సరైన సమయంలో సానుకూల చర్యలు చేపట్టిందన్నారు. ప్రజల ప్రాణాలతోపాటు జీవనోపాధిని రక్షించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టిందని సీఐఐ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు. 



వృద్ధిపై అనిశ్చితి

మహోగ్రరూపం దాల్చిన కరోనా రెండో దశ వ్యాప్తితో భవిష్యత్‌పై అనిశ్చితి పెరిగిందని, జీడీపీ వృద్ధి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం మాత్రం అంచనాల మేరకే నమోదుకావచ్చన్నారు. ‘‘గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి భారత్‌ వృద్ధి పునరుద్ధరణ వేగవంతమైంది. వృద్ధి మళ్లీ సానుకూల స్థాయికి పెరిగింది. కరోనా కేసులు కూడా భారీగా తగ్గాయి. కానీ, కొన్ని వారాల్లోనే పరిస్థితులు అనూహ్యంగా మారాయి. ఆర్‌బీఐ ప్రస్తుత పరిణామాలను నిశితంగా పర్యవేక్షించడంతోపాటు అవసరమైన చర్యలు చేపడుతుంద’’ని శక్తికాంత దాస్‌ అన్నారు. 


Updated Date - 2021-05-06T06:40:44+05:30 IST