రూ. 2 వేల నోటు ముద్రణ నిలిపివేతపై కేంద్రం స్పష్టత

ABN , First Publish Date - 2020-09-20T02:15:53+05:30 IST

చలామణి నుంచి రూ. 2 వేల నోటును క్రమంగా తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది.

రూ. 2 వేల నోటు ముద్రణ నిలిపివేతపై కేంద్రం స్పష్టత

న్యూఢిల్లీ: చలామణి నుంచి రూ. 2 వేల నోటును క్రమంగా తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి ఆలోచనేదీ లేదని మరోమారు స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2 వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసే అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. బ్యాంకు నోట్ల ముద్రణపై భారతీయ రిజర్వు బ్యాంకును సంప్రదించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 


31 మార్చి 2019 నాటికి 32,910 రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉండగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 27,398కి తగ్గిందన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా నోట్ల ముద్రణ తాత్కాలికంగా నిలిచిపోయినట్టు ఆర్‌బీఐ తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా దశల వారీగా ముద్రణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. 2 వేల రూపాయల నోటును ఆర్బీఐ ముద్రించడం లేదంటూ గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఠాకూర్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2020-09-20T02:15:53+05:30 IST