ఆర్‌బీ.నగర్‌ కమానరోడ్డు దీక్షలో కలకలం

ABN , First Publish Date - 2022-05-17T06:23:36+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరిలోని ఆర్‌బీనగర్‌ కమాన రోడ్డు విస్తరణ కోసం కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది.

ఆర్‌బీ.నగర్‌ కమానరోడ్డు దీక్షలో కలకలం

 మడిగె యజమాని కుమారుడి ఆత్మహత్యాయత్నం

 భువనగిరి టౌన, మే 16: జిల్లా కేంద్రం భువనగిరిలోని ఆర్‌బీనగర్‌ కమాన రోడ్డు విస్తరణ కోసం కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది. కమాన రోడ్డు విస్తరణ కోసం ఆందోళన కారులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న మడిగె యజమాని పుమార్‌ విక్రమ్‌ కొడుకు పుమార్‌ వీరకుమార్‌ అకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. కమానరోడ్డు విస్తరణ కోసం స్థానిక కౌన్సిలర్‌ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆంధోళనలో భాగంగా సోమవారం కూడా చేస్తున్న దీక్షకు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపి, దీక్షా శిబిరంలో మాట్లాడుతుండగా వీరకుమార్‌ శిబిరంలోకి ప్రవేశించి ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం లేచింది. అయితే రోడ్డు విస్తరణ కోసం తన 84 గజాల మడిగె విస్తీర్ణంలో 33 గజాలను స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్దమే నంటూ గతం నుంచి తాను పేర్కొంటున్నానని ఈ మేరకు కోర్టు కూడా డైరెక్షన ఇచ్చిందని అయినప్పటికీ రాజకీయ ఉద్దేశంతోనే నాయకులు తమ కుటుంబంపై  కక్ష కట్టి ఆందోళన చేస్తున్నారని డీసీసీ అఽధ్యక్షుడికి పుమార్‌ విక్రమ్‌ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ మేరకు అధికారులే సరైన న్యాయం చూపాల్సి ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో వీరకుమార్‌ నుంచి అందరూ పెట్రోల్‌ డబ్బా, అగ్గి పెట్టెను బలవంతంగా లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం కుటుంబ సభ్యులందరూ  పట్టణ ప్రధాన రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు, స్థానికుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సద్దుమనిగింది. ఈ అలజడి కొనసాగుతుండగానే దీక్ష శిబిరానికి హాజరైన నాయకులు ఎవరికి వారుగా వెళ్లిపోయారు. 


Updated Date - 2022-05-17T06:23:36+05:30 IST