Abn logo
Aug 2 2021 @ 00:54AM

రూ.50 లక్షలతో.. నున్నలో రైతుబజార్‌

నున్నలో రైతు బజార్‌ ఏర్పాటు చేయనున్న స్థలం ఇదే

 45 షాపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

  నిర్మాణానికి మార్కెటింగ్‌ శాఖ కసరత్తు

విజయవాడ రూరల్‌, ఆగస్టు 1 : ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత నున్నకు రైతుబజార్‌ మంజూరైంది. మండలంలోని నున్న, పాతపాడు, మంగళాపురం, సీతారామపురం, అప్పారావుపేట, పీ నైనవరం, అంబాపురంతోపాటు విజయవాడ నగరంలోని కుందావారి కండ్రికతోపాటు గన్నవరం మండలంలోని ముస్తాబాద, సూరంపల్లి, మాదలవారిగూడెం తదితర గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నున్నలో రైతు బజార్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్‌శాఖ రైతు బజార్లను మంజూరు చేసింది. గతనెల ఎనిమిదో తేదీన జరిగిన రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా మంజూరైన రైతు బజార్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనంతపురంలో వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెటింగ్‌శాఖ అధికారులు నున్నలో రైతు బజార్‌ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కూడా పరిశీలించారు. విజయవాడ - నూజివీడు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు వెంబడి మాంసం దుకాణాలను తొలగించిన ప్రదేశంలోనే రైతు బజార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అందుబాటులో సుమారు 30 సెంట్ల స్థలం ఉంది. అందులో 40 నుంచి 45 షాపులు వచ్చేలా రైతు బజార్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. షాపులతోపాటు రైతు బజార్‌ కార్యాలయ నిర్మాణం కోసం సుమారు రూ.50 లక్షలతో అంచనాలను రూపొందించారు. నున్నతోపాటు కొత్తగా మంజూరైన అన్ని రైతు బజార్లకు త్వరలోనే టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. నున్నలో రైతు బజార్‌ను ఏర్పాటు చేయడం వల్ల సుమారు 60 వేలమందికి ఉపయోగకరంగా ఉంటుంది. విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న నున్న ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికితోడు ఉద్యోగులుసైతం నున్న లోనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల కోసం పాయకాపురం, విజయవాడ నగరంలోని రైతు బజార్లకు వెళ్లి కూరగాయాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. నున్నలోనే రైతు బజార్‌ను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక రైతులే నేరుగా షాపులలో కూరగాయాలను విక్రయించడంతోపాటు ప్రజలకు కూడా వ్యయ ప్రయాసాలు తగ్గే అవకాశం ఉంది.

ఫ ఎమ్మెల్యే వంశీ కృషి

  నున్నలో రైతు బజార్‌ ఏర్పాటుకు  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ తనవంతు కృషి చేశారు. ఆయన సూచన మేరకు 2018లో అప్పటి గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) నున్నలో రైతు బజార్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే మరోసారి రైతు బజార్‌ గురించి మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడటంతో నున్నకు రైతు బజార్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మెల్యే వంశీ ప్రత్యేక శ్రద్ధతో నున్న ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది.