రాయలసీమ పంపింగ్ స్కీం- ముందుకు కదిలే దారేది?

ABN , First Publish Date - 2020-06-02T06:25:55+05:30 IST

ఆంధ్రా తెలంగాణాల మధ్య జలవివాదాలకు విభజన ఒక పరిష్కారం అనుకున్నారు. విభజన జరిగి ఆరేళ్ళయినా పరిష్కారాలు దొరకలేదు కదా జగడాల స్థాయి కూడా తగ్గలేదు. దీనికి ఒక కారణం తెలంగాణా వారు అన్యాయమైన అనుచితమైన ధోరణిని అవలంబించటమే...

రాయలసీమ పంపింగ్ స్కీం- ముందుకు కదిలే దారేది?

అనాలోచితంగా ఇచ్చిన జీవో 203 రద్దు చేయాలి. రాయలసీమ పంపింగ్ స్కీంకి నీటిలభ్యత, వినియోగసరళి, ఎటువంటి పరిస్థితులలో నీటిని బయటకు తీస్తార్నది వివరణ ఇస్తూ తిరిగి తాఖీదు ఇవ్వాలి. ఒకవేళ దీనికీ అడ్డంకులు కలిగినా మిగతా పనులు ముందుకెళ్ళడానికి అవకాశముంది. ఈ స్కీం గురించి అపెక్స్ కౌన్సిల్‌లో ప్రస్తావించండి, వివరణ ఇవ్వండి. అంతేగానీ హడావిడిగా నీటి లభ్యతమీద స్పష్టత లేకుండా, కార్యాచరణ విధాన వివరణ లేకుండా ముందుకెళ్ళితే బోర్లాపడటమే జరుగుతుంది. అడ్డంకులున్న విధానాన్ని ఎంచుకొని ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎవరినో నిందించడం వల్ల ఉపయోగముండదు. 



ఆంధ్రా తెలంగాణాల మధ్య జలవివాదాలకు విభజన ఒక పరిష్కారం అనుకున్నారు. విభజన జరిగి ఆరేళ్ళయినా పరిష్కారాలు దొరకలేదు కదా జగడాల స్థాయి కూడా తగ్గలేదు. దీనికి ఒక కారణం తెలంగాణా వారు అన్యాయమైన అనుచితమైన ధోరణిని అవలంబించటమే. వారి రాష్ట్రంలో నదీ పరీవాహకప్రాంతం ఎక్కువ వుంది కనుక వారి హక్కుకే ప్రాధాన్యమెక్కువన్న ఒక గుడ్డి నమ్మకమే సమస్య పట్ల వారి ధోరణిని శాసిస్తోంది. బేసిన్ ఎవరి స్వంతం కాదు. అందరూ వినియోగదారులే. సమానహక్కుదారులే. ఆ మాటకొస్తే 512 టి.ఎం.సి.ల కేటాయింపులు కల్గిన ఆంధ్రప్రదేశ్, 299 టి.ఎం.సి.ల కేటాయింపుల తెలంగాణా కంటె పెద్ద వినియోగదారు. పోతిరెడ్డిపాడు తెలంగాణాకి ఎద్దుకు ఎర్ర రంగులాంటిది. కోపం, ప్రకోపనం, క్లేశము కలిగిస్తుంది. వారికేదో నష్టం జరుగుతుందేమోనని అపోహ తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెగ్యులేటర్ ద్వారా నీటిమళ్ళింపు తెలంగాణాకి తీవ్రనష్టం కలిగించిన దాఖలాలు లేవు. అటువంటప్పుడు ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ కృష్ణాబోర్డు చేతిలోకి వెళ్ళాక పెద్ద ఎత్తున అనధికార నీటి మళ్ళింపు జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు? ఈ భయం వారికి ఆ బోర్డుపై నమ్మకం లేక, ఉంచక. విభజన జరిగిన మరుక్షణం నుంచీ బోర్డు అధికార పరిధిలో వారు ఉండమని చెప్తూనే ఉన్నారు. బోర్డ్ అధికార పరిధిని గుర్తించనివారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పితూరీ చేయడానికి మటుకు అక్కరకొచ్చింది. తెలంగాణా ఒక వితండవాదం చేస్తుంది. ఈ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా నీటిని సాగునీటి వినియోగంకోసం తరలించడం బచావత్ ట్రైబ్యునల్ తీర్పులో లేదని కనుక చట్టవిరుద్ధమనీ అంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ కేవలం విద్యుత్ ఉత్పత్తికేననీ సాగునీటి సరఫరాకి కాదని వాదిస్తుంది. అప్పుడు ఎస్.ఎల్.బి.సికి సొరంగం ద్వారా నీటి మళ్ళింపుకి కూడా ఈ సూత్రం వర్తిస్తుందికదా! 


ఇంతకీ ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వారికంత ఆక్రోశం ఎందుకు కలగాలి? వారి స్కీంలు -నెట్టెంపాడు, కల్వకుర్తి, దిండి, పాలమూరు-–రంగారెడ్డి, అన్నిటికీ నికరజలాలుగానీ, మిగులుజలాలుగానీ, వరదజలాలుగానీ కేటాయింపులు లేవు. వాటిగురించి వారు బోర్డ్ ముందుగానీ అపెక్స్ కౌన్సిల్ ముందుగానీ ప్రస్తావించలేదు. ఆ పథకాలకు నీటిలభ్యతపై ఏ విధమైన వివరణ ఉండదు. ఏమంటే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మాకు నికరజలాలు కేటాయించేస్తుంది వేచి చూడండి అంటారు. కృష్ణా బేసిన్‌లో వారు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయని కొత్తవి కాదని బోర్డ్ అనుమతి అవసరం లేదని చెప్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలుపెట్టిన 6 ప్రాజెక్టులకు విభజన చట్టంలో రక్షణ కల్పించారు. ఆ ఆరులో తెలంగాణావి రెండున్నాయి (నెట్టెంపాడు, కల్వకుర్తి). ఈ ఆరు ప్రాజెక్టులకు తిరిగి బోర్డ్ అనుమతి అవసరం లేదు చట్టంలోనే ఉన్నాయి కనుక.


కానీ తెలంగాణా రెండు ప్రాజెక్టులలోనూ నీటి వాడకాన్ని పెంచి వాటి లక్ష్యాలను మార్చేసింది. అవి ఎప్పుడు ప్రారంభయ్యాయి అనే అంశం కంటే వాటికి కేంద్ర జల సంఘంనుంచి కానీ కేంద్ర ప్రభుత్వంనుంచి కానీ సాంకేతిక ఆర్థిక అనుమతులున్నాయా అన్నది ముఖ్యం. ఏ ప్రాజెక్టుకూ ఈ అనుమతుల ప్రక్రియే ప్రారంభించలేదు. అనుమతులు ఎక్కడుంటాయి? కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మధ్య వివరణ కూడా ఇచ్చారు. ఏమని? ప్రాజెక్టు కొత్తదయినా పాతదయినా సాంకేతిక ఆర్థిక అనుమతులు లేనిచో అటువంటివాటిపై బోర్డ్ సమీక్ష అవసరమని. పాతవయినా లక్ష్యాలు మారితే కూడా బోర్డ్ అనుమతి తప్పదని కేంద్ర కార్యదర్శి వివరణ ఇచ్చారు. వెరసి తెలంగాణ అన్ని ప్రాజెక్టులకూ, కల్వకుర్తి, నెట్టెంపాడు కూడా కలిపి, బోర్డ్ ముందు వివరాలు దఖలు పరచి అనుమతులు పొందాలి. ఈ విషయంగా ఆంధ్రప్రదేశ్ అయిదేళ్ళనుంచీ మొత్తుకుంటోంది. తెలంగాణా ప్రాజెక్టులు మాకు నష్టం కలిగిస్తాయి వాటిని నియంత్రించండి అని. అయినా ఉలుకు పలుకు లేని కేంద్రం ఇప్పుడు రాయలసీమ పంపింగ్ స్కీంపై ఆంధ్రప్రదేశ్‌ని నిలువరించటానికి అత్యంత వేగంగా స్పందించింది.


బోర్డ్ పరిధిని ట్రైబ్యునల్ తీర్పుకు ముడిపెట్టి తెలంగాణ తమ కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డం రాకుండానూ, తమ ఇష్టం వచ్చినట్టు ఉమ్మడి రిజర్వాయర్లయిన శ్రీశైలం నాగార్జునసాగర్‌ల నుంచి నీటి వాడకాన్ని నియంత్రించటానికీ ప్రయత్నిస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాలువ రెగ్యులేటర్‌ని ఆక్రమించి ఆంధ్రప్రదేశ్‌ని ఇబ్బంది పెడుతోంది. నియంత్రణ పరిధిలు మార్పు చేసుకోవటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. కనుక ఈ మధ్య (ఫిబ్రవరి 2020) అంతర్రాష్ట్ర సమావేశంలో నిర్ణయించినట్టుగా, ట్రైబ్యునల్ తీర్పు కోసం ఆగకుండా పరిధులు వెంటనే అధికారకంగా ప్రకటించాలి.


ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాజెక్టుల కోసం నీటి సరఫరా ఏర్పాట్లు చేయతలపెట్టటాన్ని ఎవ్వరూ వద్దనరు. కాని ఎంచుకున్న విధానం, పద్ధతి ఆచరణసాధ్యమైనవి కావు. వెలువరించిన జీవో 203ని గమనిస్తే ప్రస్తుత పరిపాలనా స్థాయి ఎంత కిందికి జారిందో, నిశిత పరీక్షా ప్రక్రియకు ఎలా మంగళం పాడారో విశదమవుతుంది. సాధారణంగా ఒక ప్రతిపాదన క్రిందస్థాయి కార్యాలయం నుంచి ప్రభుత్వ సెక్రటేరియట్‌కి వచ్చినప్పుడు అక్కడ నిశితంగా పరిశీలిస్తారు. అవసరమైతే చట్టపరంగా, సాంకేతికపరంగా సానుకూలమా లేదా అన్నదీ, ఆర్థిక వనరుల లభ్యత సాధ్యాసాధ్యాల గురించీ చర్చించి అనుమతులు మంజూరు చేస్తారు. ఇటువంటి ప్రక్రియ అనుసరించబడిందని తెలిసేందుకు ఆర్డర్ ఉపోద్ఘాతంలో - ఫలానా అధికారి నుంచి వచ్చిన ప్రతిపాదనలని క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలించి పరిపాలనా అనుమతి మంజూరు చేయటం జరిగిందనీ వివరణ ఉంటుంది. ఈ తాఖీదులో అటువంటి వాక్యమే కనపడదు. ప్రతిపాదనలు ఎవరి వద్ద నుంచి వచ్చాయనేది కూడా కనపడదు. ప్రతిపాదనలు చీఫ్ ఇంజనీర్ కర్నూలు నుంచి వచ్చాయని పైన నిర్దేశంలో (రిఫరెన్స్) లేఖల సంఖ్య చూస్తేనే తెలుస్తుంది. దీనినిబట్టి ఆ తాఖీదులు ఆఘమేఘాలమీద అనాలోచితంగా వెలువరించిన భావన కలుగుతుంది. ఈ జీవోలో రెండురకాల పనులున్నాయి.


ఒకటి ఉన్న కాలువల సామర్థ్యం పెంపు, రెండవది రిజర్వాయర్ నుంచి నీటిని తోడటానికి మోటార్లు ఏర్పరచడం. రిజర్వాయర్ నుంచి నీటిని పంపులద్వారా బయటికి తీయటానికి నదీ యాజమాన్య బోర్డ్ అనుమతి విధాయకం. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్ ముందు తెలంగాణా వారి పాలమూరు-–రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి మొదలైన ప్రాజెక్టులు బోర్డ్ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని చెప్తూ అదే పద్ధతిని అనుసరించడం సరియైనదా? ఏ బాధ్యత గల ప్రభుత్వమైనా, అవతలివారు తప్పుచేస్తున్నారు కనుక నేనూ చేస్తున్నాను అని ఒక కోర్టు ముందు గానీ లేక ఒక చర్చాస్థలంలో గానీ చెప్పటం వివేకమనిపించుకుంటుందా? చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణా అయినా ఒకరోజు వీటి విషయంగా బోర్డ్ ముందు నిలబడాల్సిందే. ట్రైబ్యునల్ రెండు రాష్ట్రాలకు వాటాలు నిర్ధారించి ప్రాజెక్టు వారీ కేటాయింపులు కూడా నిర్దేశించి, కార్యాచరణ ఒడంబడిక (ఆపరేషన్ ప్రోటొకోల్) నిర్ణయించాకే ఇటువంటి ప్రాజెక్టులకు నీటి లభ్యత గురించి స్పష్టత ఏర్పడుతుంది. బచావత్ ట్రైబ్యునల్ రాష్ట్రాలకు గంపగుత్త కేటాయింపులు చేసి రాష్ట్ర పరిధిలో ఎక్కడయినా నీటిని వాడుకొనే వెసులుబాటు కల్పించడం వలనే నేడు హంద్రీ -నీవా, కల్వకుర్తి లాంటి కేటాయింపులులేని ప్రాజెక్టులకు నీటి విడుదల సాధ్యమవుతోంది.


అప్పటి మూడు రాష్ట్రాలు, ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా లెక్క కట్టినా, అంతిమంగా కేటాయింపు ఎన్-బ్లాక్‌గా చూపిస్తే మాకు అవసరమైనప్పుడు ఎక్కడయినా వాడుకోవటానికి, లేక పునః కేటాయింపులకి వీలుకలుగుతుందన్న ఉమ్మడి అభ్యర్థనని మన్నించింది. కానీ ఇప్పుడు విభజన చట్టం ప్రాజెక్టులవారీ కేటాయింపులు జరపాలనీ, కార్యాచరణ ప్రణాళిక కూడా (నీటి లభ్యత తక్కువయినప్పుడు) సూత్రీకరించమనీ నిర్దేశించింది. కనుక ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయో చెప్పలేం. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వెనుకటిలాగా ఏకాభిప్రాయం కుదిరి ఉమ్మడి అభ్యర్థనతో ట్రైబ్యునల్ ముందుకు వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం లేదు. విభజన చట్టం పదకొండవ షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్‌వి నాలుగు (హంద్రీ-నీవా, వెలిగొండ, గాలేరు-నగరి, తెలుగుగంగ), తెలంగాణావి రెండు (కల్వకుర్తి, నెట్టెంపాడు) ప్రాజెక్టులున్నాయి. వీటికి కేటాయింపులు ఎలా సాధ్యమవుతాయన్నది చర్చనీయాంశం. ట్రైబ్యునల్ -2 సరాసరి నీటి లభ్యత వరకు కేటాయింపులు చేసేసింది. కనుక షెడ్యూల్ 11 ప్రాజెక్టులకు నీటిని ఎక్కడ్నుంచి తెస్తుంది, ఎలా చెప్పుతుందీ అనేది ఊహకందనిది. వీటికి నీరు లభించదు, కేటాయింపులు సాధ్యం కాదు అని చెప్పినా చెప్పవచ్చు.


ఇంకొక ప్రత్యామ్నాయం, అన్ని కేటాయింపులపై అధికంగా లభించే (వరద జలాలు లేక మిగులు జలాలు) వాడుకోవచ్చని నిర్ణయిస్తే షెడ్యూల్ 11లో ఉన్న అన్ని ప్రాజెక్టులకూ ఇస్తారా లేక కొన్నింటికే ఇస్తారా? ఇస్తే ప్రాధాన్యతాక్రమాల నిర్ణయం ఆయా రాష్ట్రాలు ట్రైబ్యునల్ ముందుంచిన సమాచారం, భోగట్టా, సాక్ష్యం వాదనల సారాం శంగా ఉండవచ్చు. తెలంగాణా ప్రాజెక్టులకు వారు అడిగినట్లుగా నికరజలాలు నిరాకరిస్తే, ఆ ప్రాజెక్టులకు గోదావరి జలాలు మళ్ళింపు లేక కృష్ణాజలాల మార్పే శరణ్యం. ఏతావతా చెప్పవచ్చేదేమిటంటే ఈ పంపింగ్ ప్రాజెక్టులకు నీటి లభ్యత పెద్ద ప్రశ్నార్థకం. ట్రైబ్యునల్ నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుంది. అంతవరకు నిరీక్షణే. ఇటువంటి చిక్కులున్న ప్రాజెక్టుకు చిటుక్కున పరిపాలనా అనుమతులు ఇచ్చేసారు. తెలంగాణ తమ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు లభించాయి అనే ముసుగు వాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి ఆ సాకు కూడా లేదు. కొత్తకాలువలు లేవు అన్న మిష కేంద్ర జలసంఘం నుంచి అనుమతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది సందేహాస్పదం. ఇటువంటి అనుమతులు లేకుండా వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టుకు ఏ బాంక్ ఆర్ధిక సాయం చేయటానికి ముందుకొస్తుందీ? రాష్ట్ర నిధులతో నిర్మాణం చేపట్టే సత్తా లేదని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ముందుకు ఎలా వెళ్ళుతుంది?


 అనాలోచితంగా ఇచ్చిన జీవో 203 రద్దు చేయాలి. రద్దు చేస్తే ఎన్.జి.టి. ముందున్న ఫిర్యాదు వ్యర్థమవుతుంది. కాలువలు వెడల్పు చేయడానికీ, లైనింగ్‌తో మెరుగుపరచటానికి ఎటువంటి అనుమ తులు, ఎవరి ప్రమేయం అవసరం లేదు. ఆ పనులకు మరలా విడి విడిగా అనుమతులు ఇచ్చుకోవచ్చు. స్టేలు అడ్డం రావు. పంపింగ్ స్కీంకి కూడా నీటిలభ్యత, వినియోగసరళి, ఎటువంటి పరిస్థితులలో నీటిని బయటకు తీస్తామో వివరణ ఇస్తూ తిరిగి తాఖీదు ఇవ్వాలి. ఒకవేళ దీనికీ అడ్డంకులు కలిగినా మిగతా పనులు ముందుకెళ్ళడానికి అవకాశముంది. అన్నీ ఆగిపోవు. ఈ స్కీం గురించి అపెక్స్ కౌన్సిల్‌లో ప్రస్తావించండి, వివరణ ఇవ్వండి, సాధించండి. అంతేగానీ హడావిడిగా నీటి లభ్యతమీద స్పష్టత లేకుండా కార్యాచరణ విధాన వివరణ లేకుండా ముందుకెళ్ళితే బోర్లాపడటమే జరుగుతుంది. అడ్డంకులున్న విధానాన్ని ఎంచుకొని ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎవరినో నిందించడం వల్ల ఉపయోగముండదు. బనకచెర్ల రెగ్యులేటర్ దాకా గోదావరి నీటిని మళ్ళించే పథకాన్ని తయారుచేశారు. దీనిని ముందుకుతీసుకెళ్ళడానికి కావలిసింది పట్టుదల, డబ్బు, సాధనం, ఉపాయం. అబ్బే అది ఎవరో నడిచినదారి, నా దారి వేరు, ముళ్ళకంపలున్నా అటే నడుస్తానంటే ఫలితం దైవాధీనమే!

కురుమద్దాలి వెంకట సుబ్బారావు

Updated Date - 2020-06-02T06:25:55+05:30 IST