టీకా తయారీ.. భారత్ ప్రయత్నాలకు అమెరికా బ్రేకులు!

ABN , First Publish Date - 2021-04-20T22:41:34+05:30 IST

పెద్ద ఎత్తున టీకాలు తయారు చేయాలన్న భారత్ ప్రయత్నాలకు అమెరికా నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి.

టీకా తయారీ.. భారత్ ప్రయత్నాలకు అమెరికా బ్రేకులు!

న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున టీకాలు తయారు చేయాలన్న భారత్ ప్రయత్నాలకు అమెరికా నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. టీకా ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల విషయంలో అమెరికా అవసరాలకే పెద్ద పీట వేయాలంటూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో..ముడిసరుకుల కొరతతో ఇబ్బంది పడుతున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని నేరుగా అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లింది. అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్వీట్ చేస్తూ సీరం సీఈఓ అదర్ పూనావాలా సోషల్ మీడియా వేదికగా కీలక అభ్యర్ధన చేశారు. ‘‘కరోనాను ఓడించేందుకు మనమందరం నిజంగా ఏకమవ్వాలంటే..టీకా ముడిసరుకులు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను సడలించాలి.’’ అని ఆయన ట్వీట్ చేశారు. 


ఏమిటీ ముడిసరుకులు..?

అడ్జువెంట్స్.. ఇవి టీకాల్లో చాలా ముఖ్యమైన భాగం . రోగనిరోధకశక్తిని టీకాలు సరైన రీతిలో ప్రేరేపించేందుకు ఇవి ఎంతో అవసరం! రకరకాల అడ్జువెంట్స్‌ను టీకా తయారీలో వినియోగిస్తుంటారు. వీటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతికపై పేటెంట్లు కూడా ఉండటంతో అడ్జువెంట్స్ ఉత్పత్తి, పంపిణీలపై గట్టి నిఘా ఉంటుంది. అయితే..దేశీయావసరాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ అడ్జువెంట్ ఎగుమతిపై ఆంక్షలు విధించింది. అమెరికా రక్షణ ఉత్పత్తి చట్టం పరిధిలోకి అడ్జువెంట్స్‌ను తెస్తూ వీటి ఎగుమతికి అడ్డుపడుతోంది. దీంతో..‘సీరం’తో సహా అనేక టీకా తయారీ సంస్థలు ముడిసరుకుల కటకటతో అవస్థలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘సీరం’ సీఈఓ అదర్ పూనావాలా తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా అమెరికా అధ్యక్షుడికే ట్వీట్ చేశారు. 


దేశీయంగానే అడ్జువెంట్స్‌ను ఉత్పత్తి చేసేందుకు..

టీకాలకు డిమాండ్‌కు పెరుగుతున్న నేపథ్యంలో అడ్జువెంట్స్‌ను దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు భారత కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయమై భారత్ బయోటెక్ ఇప్పటికే తొలి విజయం అందుకుంది. అడ్జువెంట్స్ తయారీకి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ఐఐసీటీతో చేసుకున్న ఒప్పందం సత్ఫలితాలను ఇచ్చింది. భారత్ బయోటెక్ తయారు చేసిన  కొవాక్సిన్‌లో అల్యుమినియం హైడ్రాక్సైడ్ రసాయనం ఆధారిత అడ్జువెంట్ ఉంటుంది. దీని ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను భారత పరిశోధన సంస్థ ఐఐసీటీ నాలుగు నెలల్లోనే అభివృద్ధి చేయడంతో భారత్ బయోటెక్ టీకా ఉత్పత్తిని పెంచగలిగింది. 

Updated Date - 2021-04-20T22:41:34+05:30 IST