మంత్రులది పంటల సందర్శన కాదు.. విహార యాత్ర

ABN , First Publish Date - 2022-01-20T05:45:31+05:30 IST

మంత్రులది పంటల సందర్శన కాదు.. విహార యాత్ర

మంత్రులది పంటల సందర్శన కాదు.. విహార యాత్ర

నష్టపరిహారం చెల్లించే వరకు రైతులకు అండ గా పోరాటం

బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి


నర్సంపేట, జనవరి 19: వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను సందర్శించే విధంగా మంత్రుల బృందం పర్యటన లేదని... విహార యాత్ర(పిక్నిక్‌స్పాట్‌)కు వచ్చి వెళ్లినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 200 నుంచి 250 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రావాల్సిన మంత్రుల బృందం హెలిక్యాప్టర్‌లో వచ్చి ఉమ్మడి జిల్లాలో నాలుగైదు ప్రాంతాల్లో పర్యటించి ఎంపిక చేసిన ఒకరిద్దరు రైతులతో మాట్లాడి హంగామా చేసి వెళ్లారని ఆయన ఆరోపించారు. మంత్రులు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదన్నారు. వారి పర్యటన పిక్నిక్‌స్పాట్‌కు వచ్చి వెళ్ళినట్లు ఉందన్నారు. వడగండ్ల వర్షానికి గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న, పసుపు, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పంటలు నష్టపోయి ఆర్థికంగా, మానసికంగా రైతులు కుంగిపోగా, క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సిన మంత్రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని రేవూరి విమర్శించారు.

ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారన్నారు. సీఎం మంగళవారం స్వయంగా వచ్చి పంటపొలాలను పరిశీలించి రైతులను ఆదుకోనున్నారని వారు ప్రచారం చేయడంతో న్యాయం జరుగుతుందని రైతులు ఆశించారన్నారు. కానీ, మంత్రుల బృందం వచ్చి వెళ్లడంతో రైతులు నిరాశకు గురయ్యారని రేవూరి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పంటపొలాలను పరిశీలించి 53వేల ఎకరాలకు పైగా పంటనష్టం జరిగిందని అంచనా వేసినట్లు తెలిపారు. పంటనష్టం జరిగిన వెంటనే బీజేపీకి చెందిన తాము బాధ్యత కలిగిన నాయకులుగా పంటపొలాలను రెండు రోజులుగా సందర్శించి రైతులకు మనోధైర్యం కల్పించామని అన్నారు. ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని, ప్రభుత్వం ఎకరానికి కనీసం రూ.20వేల చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం అందించే వరకు రైతులకు అండగా పోరాటాలు చేపడుతామని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-20T05:45:31+05:30 IST