Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 29 Jul 2022 15:34:56 IST

Ramarao on duty: సినిమా రివ్యూ

twitter-iconwatsapp-iconfb-icon

సినిమా రివ్యూ: ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao on duty Review)

విడుదల తేదీ: 29–7–2022

నటీనటులు: రవితేజ, (Ravi teja)రజిషా విజయన్‌(Rajisha vijayan), దివ్యాంశ కౌశిక్‌, తనికెళ్ల భరణి, తొట్టెంపూడి వేణు, సమ్మెట గాంధీ, నాజర్‌, నరేశ్‌, మధుమణి, పవిత్రా లోకేష్‌, జాన్‌ విజయ్‌, శ్రీ, మిర్చి హేమంత్‌, జెమినీ సురేశ్‌, అరవింద్‌ కృష్ణ, చైతన్యకృష్ణ తదితరులు. 

కెమెరా: సత్యం సూర్యన్‌,

సంగీతం: సామ్‌ సి.ఎస్‌, 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌

నిర్మాణ సంస్థలు: శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌

నిర్మాతలు: సుధాకర్‌ చెరుకూరి

కథ–స్ర్కీన్‌ప్లే– దర్శకత్వం: శరత్‌ మండవ(Sarath mandava)


జయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకెళ్తుంటారు మాస్‌ మహారాజా రవితేజ. ఆయన స్టైల్‌ కామెడీ, ఎనర్జీని పక్కనపెట్టి నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన గతంలో పలు చిత్రాలకు రచయితగా పని చేశారు. ఇప్పుడు రవితేజను తెరపై డిప్యూటీ కలెక్టర్‌గా చూపించారు. మరీ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు అకట్టుకుందో చూద్దాం. (Ramarao on duty Review)


కథ: 

రామారావు (రవితేజ) నీతి, నిజాయతీ గల డిప్యూటీ కలెక్టర్‌. అన్యాయం జరిగిందీ అంటే రిస్క్‌ అయినా సరే నియమ నిబంధనలు పక్కనపెట్టి పోరాటం చేయడానికి సిద్ధపడతాడు. అతని నిజాయతీ తోటి అధికారులకు, రాజకీయ నాయకులకు నచ్చదు. అందుకే తరచూ బదిలీ అవుతుంటాడు. అలా తన సొంతూరుకే అధికారిగా వస్తాడు. అక్కడ తన చిన్ననాటి ప్రేయసి మాలిని (రజిషా విజయన్‌) భర్త సురేంద్ర (చైతన్య కృష్ణ) కనబడటం లేదని తెలుసుకుంటాడు. ఆ కేసు సి.ఐ మురళీ (వేణు)అంతగా పట్టించుకోకపోవడం వలన స్వయంగా రామారావే ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. అక్కడ మిస్‌ అయింది.. సురేంద్ర ఒక్కడే కాదని, మరో 20 మంది ఉన్నారని తెలుసుకుంటాడు. అందుకు కారణం ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది. తమ్ముడి లాంటి అనంత్‌ (రాహుల్‌ రామకృష్ణ) రామారావుని ఎందుకు చంపాలనుకున్నాడు? 20 మంది మిస్సింగ్‌ వెనకున్నది ఎవరు? రామారావు ఈ కేసును ఎలా చేధించాడు అన్నది మిగతా కథ. (Ramarao on duty Review)


Ramarao on duty: సినిమా రివ్యూ

విశ్లేషణ: 

చిత్తూరు జిల్లాలోని సాగే నిజాయతీ గల డిప్యూటీ కలెక్టర్‌ కథ ఇది. అతని నిజాయతీతో అన్యాయం జరిగిన ప్రతి చోట పోరాడి సమస్యలు పరిష్కరిస్తుంటాడు. రవితేజ సినిమా అంటే ప్రేక్షకులు కోరుకునే వినోదం, రవితేజ నోట పలికే మాస్‌, ఎనర్జిటిక్‌ డైలాగ్‌లు. ఇవేమీ లేకుండా కాస్త భిన్నమైన కథ ఎంచుకున్నారు రవితేజ. తన స్నేహితురాలు మాలిని చెప్పిన విషయాలను బట్టి రామారావు కేసు టేకప్‌ చేసి సి.ఐ మురళీ (తొట్టెంపూడి వేణు) కలిసి మాట్లాడడం, అతను అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో రామారావే ఈ కేసును ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. రవితేజ– రజిషా సన్నివేశం వచ్చిన ప్రతిసారీ ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌’ చిత్రం గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ సన్నివేశాలు ‘పుష్ప’ సినిమాతో కంపేర్‌ చేసేలా ఉన్నాయి. రాహుల్‌ రామకృష్ణ, కబీర్‌ పాత్రధారి అరవింద్‌ కృష్ణ పరిచయం సమయంలోనే మిస్సింగ్‌ కేసుకు, వారికి ఏదో సంబంధం ఉందని ఊహించేలా ఉంది. ఇంటర్వెల్‌ సీన్‌లో రాహుల్‌ రామకృష్ణ ఎటాక్‌ సీన్‌ ట్విస్ట్‌లో బలం లేదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ నుంచి జరిగే ఇన్వెస్టిగేషన్‌ కాస్త ఆసక్తిగా సాగుతుంది. అయితే దర్శకుడి కథలో విషయం ఉన్నా తెరపై చూపించడంతో విఫలం అయ్యాడు. ఓ మిస్సింగ్‌ కేసును చేధిస్తునప్పుడు సమస్య పరిష్కారానికి సదరు హీరో ఏం చేయబోతున్నాడు అన్న ఉత్కంఠ కలిగించేలా ఉండాలి. పాత్రలు పడుతున్న వేదనను స్ర్కీన్‌ ముందు కూర్చున ప్రేక్షకుడు ఫీల్‌ అయ్యేలా ఉండాలి. కానీ తెరపై చూస్తునప్పుడు అలాంటి భావన కలగలేదు. కుటుంబ సభ్యుల మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు కూడా వీక్‌గా ఉన్నాయి. అక్కడక్కడా కాస్త హాస్యాన్ని జోడించి ఉంటే బావుండును. 

ఇక నటీనటుల విషయానికొస్తే నటన విషయంలో రవితేజకు పేరు పెట్టాల్సిన పని లేదు. రామారావుగా తన డ్యూటీ తాను సక్రమంగా చేశాడు. డైలాగ్‌ డెలివరీలో రవితేజ ఎనర్జీ కనిపించలేదు. అంటే ఆ తరహా డైలాగ్‌లు రాయలేదా? ఆ పాత్ర తీరు అంతేనా అన్నది దర్శకుడికే తెలియాలి. రామారావు భార్యగా దివ్యాంశ కౌశిక్‌ పాత్ర చిన్నదే అయినా ఫర్వాలేదనిపించింది. ఆమెకు పెద్దగా డైలాగులు కూడా లేవు. మాలిని పాత్రలో రజిషా విజయన్‌ ఆకట్టుకుంది. ఆమెకు లెంగ్త్‌ ఎక్కువగానే ఉంది. వేణు పాత్రలో మెరుపులేమీ లేవు. నాజర్‌, నరేశ్‌, తనికెళ్ల భరణి, సమ్మెట గాంధీ పాత్రలకు న్యాయం చేశారు. ఎస్‌.పిగా జాన్‌ విజయ్‌ పాత్ర బావుంది. సామ్‌.సి.ఎస్‌ సంగీతం ఒకే. పాటలు వరకూ అలరించాడు. ఆర్‌ఆర్‌ విషయంలో ‘క్రాక్‌’ సినిమాను గుర్తు చేశాడు. మెలోడీ ట్యూన్‌తో చేసిన ‘సీసా’ పాటకు మంచి మార్కులే పడతాయి. పాటల చిత్రీకరణ పెట్టిన ఖర్చు కూడా తెరపై కనిపిస్తుంది. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ బావుంది. కొన్నేళ్ల క్రితం, ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ సంఘటనలతో ఈ చిత్రం రూపొందిందని ప్రారంభంలోనే చెప్పారు. దానికి తగ్గట్లే ఆర్ట్‌ వర్క్‌ బావుంది. యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 


కమర్షియల్‌ చిత్రాలకు యాక్షన్‌ సన్నివేశాలు, ఓ నాలుగు పాటలే బలం. కానీ అన్ని సందర్భల్లోనూ ఆ ఫార్ములా వర్కవుట్‌ కాదు. రవితేజ లాంటి మాస్‌ హీరోతో సినిమా అంటే ప్రేక్షకులు వినోదాన్ని తప్పకుండా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ఈ చిత్రంలో అదే మిస్‌ అయింది. అయితే కథను, దర్శకుడిని నమ్మి రవితేజ తన స్టైల్‌ను పక్కనపెట్టి సీరియస్‌ పాత్రతో ఈ సినిమా చేశాడని మాత్రం అర్థమవుతోంది.  పతాక సన్నివేశాలను బట్టి చూస్తే ‘రామారావు ఆన్‌డ్యూటీ’కి సీక్వెల్‌ కూడా ఉందని చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతోంది.


ట్యాగ్‌లైన్‌: రామారావు... అభిమానులకు నిరాశే! Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement