ఈడీ ముందుకు హీరో రవితేజ పరుగులు.. తెల్లవారుజాము నుంచే...!

ABN , First Publish Date - 2021-09-09T15:41:23+05:30 IST

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈడీ విచారణకు రవితేజ నేడు హాజరయ్యారు. అయితే తెల్లవారుజామున నుంచి ఇంట్లో రవితేజ అందుబాటులో లేకుండా పోయారు.

ఈడీ ముందుకు హీరో రవితేజ పరుగులు.. తెల్లవారుజాము నుంచే...!

హైదరాబాద్ : టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హీరో రవితేజ నేడు హాజరయ్యారు. ఆయనతో పాటు కారు డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజరయ్యాడు. అయితే తెల్లవారుజామున నుంచి ఇంట్లో రవితేజ అందుబాటులో లేకుండా పోయారు. గెస్ట్ హౌజ్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి రవితేజ చేరుకున్నారు. అక్కడ కవరేజ్ కోసం సిద్ధంగా ఉన్న మీడియాను చూసి రవితేజ పరుగులు పెడుతూ ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.


ఆది నుంచి సినీ నటులు మీడియా కంట పడకుండా రహస్య ప్రాంతాల నుంచి విచారణకు హాజరవుతుండటం గమనార్హం. గతంలో ఎక్సైజ్‌ అధికారులు రవితేజ, శ్రీనివాస్‌లను విచారించిన విషయం తెలిసిందే. ఆ సమాచారంతో పాటు కెల్విన్‌తో ఆర్థిక సంబంధాలపైన ఈడీ ఇవాళ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో సినీరంగానికి చెందిన 12మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవదీప్‌తో పాటు ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ 13న, ముమైత్‌ఖాన్‌ 15న, తనీష్‌ 17న, తరుణ్‌ 22న విచారణకు హాజరుకానున్నారు.


రానాపై ప్రశ్నల వర్షం..

కాగా.. బుధవారం నాడు ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘కెల్విన్‌ మాస్కెరాన్స్‌ ఎవరో తెలియదా!? అయితే.. మీ ఇద్దరి మధ్యలో ఈ ఆర్థిక లావాదేవిలేమిటి? అనుమానాస్పద లావాదేవీలపై వివరణ ఇవ్వండి?’’ అని రానాపై ఈడీ ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఎఫ్‌-క్లబ్‌ పార్టీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా ప్రశ్నించింది. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గోయెల్‌ నేతృత్వంలోని బృందం రానాను విచారించింది. సాయంత్రం 5.30 గంటలకు విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది.

Updated Date - 2021-09-09T15:41:23+05:30 IST