పురావస్తు పరిశోధనల పథ నిర్ణేత

ABN , First Publish Date - 2022-07-02T08:30:57+05:30 IST

జీవిత పర్యంతం చరిత్రనే శ్వాసించి బతికినన్ని రోజులు శాసనాలను శాసించి, చరిత్రకే చరిత్రను అందించిన మేధావి రావిప్రోలు సుబ్రహ్మణ్యం.

పురావస్తు పరిశోధనల పథ నిర్ణేత

జీవిత పర్యంతం చరిత్రనే శ్వాసించి బతికినన్ని రోజులు శాసనాలను శాసించి, చరిత్రకే చరిత్రను అందించిన మేధావి రావిప్రోలు సుబ్రహ్మణ్యం. జవహర్‌లాల్ నెహ్రూ అభినందనలు అందుకున్న ప్రతిభామూర్తి. 1923న నెల్లూరు జిల్లా పల్లెపాడులో జన్మించిన సుబ్రహ్మణ్యం నెల్లూరు వి.ఆర్. కాలేజీలో కళాశాల విద్యను, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గొర్తి వెంకటరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మల వద్ద చరిత్ర పాఠాలు నేర్చుకొని, 23వ ఏటనే డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు. అప్పట్లో ఓ.యూ. నుంచి పిహెచ్.డి. పొందిన రెండవ వ్యక్తి. ఒరిస్సాలోని సూర్యవంశ గజపతులపై చేసిన పరిశోధనాత్మక రచన విశేష ప్రామాణికతను సాధించింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బ్రిటీషు పురాతత్వ శాస్త్రవేత్త సర్ మార్టిమర్ వీలర్ వద్ద పురావస్తు శాస్త్రం అధ్యయనం చేశారు. వీరితో కలసి హరప్పా, మొహంజొదారో త్రవ్వకాల్లో పాల్గొన్నారు. హంపీ (1947), శాలిహుండం (1953), నాగార్జున కొండ (1954–-1960), అమరావతి (1958) తవ్వకాలను రావిప్రోలు వారు జరిపించారు.


1954లో నాగార్జునకొండ వద్ద కృష్ణానదిపై డ్యామ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడి బౌద్ధమత సంపదను వెలికి తీయటంలో యావత్ భారత్ గర్వపడేలా రావిప్రోలు విశేష కృషి నిర్వహించారు. 1955 డిసెంబరు 10న ప్రధాని నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. అప్పటి గవర్నరు త్రివేది, బెజవాడ గోపాలరెడ్డి తరచూ అక్కడ పర్యటించి రావిప్రోలుతో చర్చించేవాళ్లు. 1957 ఆగష్టు 9న నాగార్జున కొండకు విచ్చేసిన రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ త్రవ్వకాలు, చారిత్రక సంపద గురించి తెలుసుకొని రావిప్రోలును స్వయంగా అభినందించారు. నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా అతి కొద్దికాలంలో ప్రాజెక్టు పూర్తయ్యే లోపలే, బౌద్ధ సంపదను నాగార్జున కొండపైకి తరలించారు. అక్కడ ప్రపంచఖ్యాతి పొంది ద్వీప పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు అయింది. చేతి పనిముట్లు, శిల్పాలు, శాసనాలు, బౌద్ధ స్థూపాలు, విహారాలు, అనేక చిత్రాలు, మహాస్థూపం, సింహళ విహారం, కుమార, నంది విహారం లాంటి వందల సంఖ్యలో పురావస్తు సంపదను సేకరించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ సముదాయాన్ని అశ్వమేధ స్థలంలో హిందూ అవశేషాలను స్నానఘట్టాల పునర్నిర్మాణం చేపట్టారు. బౌద్ధమత అవశేషాలను, అమరావతిలలో భద్రపరచారు. నాగార్జునసాగర్ త్రవ్వకాల్లో ఆదిశేషునిపై శయనించి వున్న రంగనాథుని విగ్రహం బయటపడడంతో దానికి గుడి కట్టించి, ప్రతి ఏడాది ఉత్సవాలకు ట్రస్ట్ కూడా ఏర్పరచారు. నాగార్జున యూనివర్శిటీలో మొదటగా ప్రాచీన చరిత్ర, పురావస్తు శాస్త్రాల విభాగాన్ని ప్రారంభించారు. శ్రీశైలం డ్యామ్‌లలో కూడా రావిప్రోలు విశేష ప్రతిభ కనబరిచారు. సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్‌గా బరోడా, కలకత్తా, మద్రాసు, విశాఖ, ఆగ్రా, న్యూఢిల్లీ, భోపాల్, డెహ్రూడూన్‌లలో కూడా విశేష కృషిచేసి చరిత్ర, పురావస్తు సంపదను వెలికితీయటంలో ఆద్యుడుగా నిలిచారు. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో 1976లో ‘ఎ.పి. హిస్టరీ కాంగ్రెస్‌’ ప్రారంభమైంది. 1979లో మలేషియా ప్రభుత్వ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆయన 50 పుస్తకాలు, పరిశోధనా వ్యాసాలను వ్రాసారు. 1975 నుండి మరణించే వరకు నాగార్జున విశ్వవిద్యాలయంలో పురావస్తు శాఖ ప్రొఫెసరుగా బాధ్యతలు నిర్వహించారు. జీవితకాలమంతా చరిత్ర అధ్యయనానికే అంకితమైన రావిప్రోలు 1981 నవంబరు 30న కీర్తి శేషుడయ్యారు. 


ఈతకోట సుబ్బారావు

(హైదరాబాద్‌లో జూలై 4న రావిప్రోలు సుబ్రహ్మణ్యం శతజయంతి వేడుకలు) 

Updated Date - 2022-07-02T08:30:57+05:30 IST