చాహల్‌కు ఎదురైన చేదు ఘటనపై తీవ్రంగా స్పందించిన రవిశాస్త్రి

ABN , First Publish Date - 2022-04-10T01:51:30+05:30 IST

ఓ క్రికెటర్ తప్పతాగి 15 అంతస్తు బాల్కనీ నుంచి తనను వేలాడదీశాడంటూ టీమిండియా బౌలర్, రాజస్థాన్ రాయల్స్

చాహల్‌కు ఎదురైన చేదు ఘటనపై తీవ్రంగా స్పందించిన రవిశాస్త్రి

ముంబై: ఓ క్రికెటర్ తప్పతాగి 15వ అంతస్తు బాల్కనీ నుంచి తనను వేలాడదీశాడంటూ టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా స్పందించాడు. చాహల్‌ను వేధించిన ఆ క్రికెటర్‌పై నిషేధం విధించాలని, జీవితంలో ఎప్పుడూ మళ్లీ క్రికెట్ మైదానమే చూడకుండా చేయాలని అన్నాడు. ఇది ఆందోళన చెందాల్సిన పెద్ద విషయమని, నవ్వుకోవాల్సిన విషయం కానే కాదని అన్నాడు.  


‘‘ఇది నవ్వు కోవాల్సిన విషయం కాదు. చాహల్‌ను వేలాడదీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటే అప్పుడదని నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే. ఒకరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కొందరు మాత్రం దీనిని చాలా సరదాగా తీసుకుంటున్నారు. నా వరకు చెప్పాలంటే మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. ఆ వ్యక్తి అలా చేయడం ఎంతమాత్రమూ సరికాదు. ఒకవేళ మీరే ఆ పరిస్థితుల్లో ఉండి అలా చేస్తే పొరపాట్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది సహించరానిది’’ అని శాస్త్రి అన్నాడు.  


ఇలాంటి ఘటనను తాను వినడం ఇదే తొలిసారని రవి పేర్కొన్నాడు. అలాంటి ఘటనే ఇప్పుడు జరిగి ఉంటే వెంటనే ఆ వ్యక్తిపై జీవితకాల నిషేధం విధించి ఉండేవారని, లేదంటే వీలైనంత త్వరగా పునరావాస కేంద్రానికి తరలించి ఉండేవారని అన్నాడు.


జీవిత కాలం నిషేధం విధించడంతోపాటు అతడిని క్రికెట్ మైదానంలోకే అడుగుపెట్టకుండా చేస్తే  అది తమాషానో, కాదో తెలుసుకుంటాడని రవి అన్నాడు. ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగినప్పుడు ఆటగాళ్లు వెంటనే చెప్పడం చాలా అవసరమని అన్నాడు. మేల్కోడానికి ఓ దురదృష్టకర ఘటన జరిగేంత వరకు వేచి చూడడం సరికాదని అన్నాడు. అంతేకాదు, ఇలాంటి విషయాలు బయటపెట్టడం బాధ్యత అని తెలుసుకోవాలన్నాడు. 

Updated Date - 2022-04-10T01:51:30+05:30 IST