Ravi Shastri: ఆ ఒక్కటీ సాధిస్తే పనిపూర్తయినట్టే!

ABN , First Publish Date - 2021-09-19T00:24:11+05:30 IST

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడు. దీంతో బీసీసీఐ

Ravi Shastri: ఆ ఒక్కటీ సాధిస్తే పనిపూర్తయినట్టే!

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. కోచ్‌గా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి తాజాగా మాట్లాడుతూ.. ఇకపైనా కోచ్‌గా కొనసాగడంపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించాడు. గత 5 ఏళ్లలో సాధించిన దానికి సంతృప్తిగా ఉందన్నాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంటే అన్నీ సాధించినట్టేనని చెప్పుకొచ్చాడు. 


‘‘నేను కోరుకున్నవన్నీ సాధించాను. టెస్టు క్రికెట్‌లో నంబర్ వన్‌గా నిలిచాం. ఆస్ట్రేలియాలో రెండుసార్లు, ఇంగ్లండ్‌‌లో ఒకసారి ఆయా జట్లపై విజయం సాధించాం. వైట్‌బాల్ క్రికెట్‌లో ప్రపంచంలోని అన్ని జట్లను వారి గడ్డపైనే మట్టికరిపించాం. టీ20 ప్రపంచకప్ కనుక సాధిస్తే అన్నీ సాధించినట్టే. అంతకుమించి మరేం లేదు’’ అని రవి స్పష్టం చేశాడు. 


ఏదీ ఎక్కువ కాకూడదనే విషయాన్ని తాను నమ్ముతానని, కోచ్ బాధ్యతల నుంచి బయటపడాలనే అనుకుంటానని పేర్కొన్న రవిశాస్త్రి.. సాధించాల్సిన దానికంటే ఎక్కువగానే సాధించానని పేర్కొన్నాడు. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం అంటే బ్రెజిల్, ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్లకు కోచ్‌గా ఉండడం లాంటిదేనని అన్నాడు. తుపాకి గురి ఎప్పుడూ మనవైపే ఉంటుందని పేర్కొన్నాడు.  

Updated Date - 2021-09-19T00:24:11+05:30 IST