‘ఫిట్ టు ఫ్లై’ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్న రవిశాస్త్రి

ABN , First Publish Date - 2021-09-17T02:24:26+05:30 IST

ఇంగ్లండ్‌లో కరోనా బారినపడి 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి

‘ఫిట్ టు ఫ్లై’ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్న రవిశాస్త్రి

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో కరోనా బారినపడి 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ఇప్పుడు స్వదేశం వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వీరు ఫ్లైట్ ఎక్కాలంటే తొలుత ‘ఫిట్ టు ఫ్లై’ సర్టిఫికెట్ అవసరం. కరోనా నెగటివ్ సర్టిఫికెట్‌కు ఇది అదనం. శాస్త్రి, అరుణ్, శ్రీధర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 


అయితే, హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం.. వారి సీటీ స్కోర్ 38కిపైగా ఉండాలి. అలా ఉంటేనే వారు విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు. సీటీ స్కోరు నిబంధనలకు అనుగుణంగా ఉంటే మరో రెండు మూడు రోజుల్లో వారు స్వదేశానికి వస్తారని భావిస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్ సోకిన వ్యక్తుల్లో సీటీ (సీటీ స్కాన్) స్కోరు వైరల్ వర్క్ లోడును సూచిస్తుంది. సీటీ స్కోరు ఎక్కువగా ఉంటే పూర్తిగా కోలుకున్నారని, వారు సుదూర విమాన ప్రయాణాలు చేయొచ్చని అర్థం. ఇందుకు కనీసం 40 స్కోరు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు కోచ్‌లలో ఎలాంటి లక్షణాలు లేవు. పూర్తిగా కోలుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. సర్టిఫికెట్ వచ్చిన వెంటనే ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తారు.  

Updated Date - 2021-09-17T02:24:26+05:30 IST