Tokyo Olympics: జావెలిన్‌ త్రో ఫైనల్‌‌కు నీరజ్ అర్హత.. రెజ్లింగ్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన దహియా!

ABN , First Publish Date - 2021-08-04T14:44:59+05:30 IST

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌‌లో పురుషుల జావెలిన్‌ త్రోలో భారత యువ అథ్లెట్ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Tokyo Olympics: జావెలిన్‌ త్రో ఫైనల్‌‌కు నీరజ్ అర్హత.. రెజ్లింగ్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన దహియా!

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌‌లో పురుషుల జావెలిన్‌ త్రోలో భారత యువ అథ్లెట్ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్‌-ఏ క్వాలిఫై రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. దీంతో జావెలిన్ విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. 23 ఏళ్ల నీరజ్ తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్నాడు. ఈనెల 7న జావెలిన్ త్రో ఫైనల్‌ జరగనుంది. ఈ ఫైనల్లో తొలి మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో నీరజ్ నిలిస్తే పతకం తన ఖాతాలో పడుతుంది. మరోవైపు జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన మరో ఆటగాడు శివ్‌పాల్ సింగ్‌ నిరాశపర్చాడు. గ్రూప్‌-బీ క్వాలిఫై రౌండ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. 


అటు రెజ్లింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇవాళ జరిగిన పురుషుల రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కొలంబియాకు చెందిన రెజ్లర్ టిగ్రరోస్‌పై 13-2 తేడాతో ఘన విజయం సాధించాడు. మరోవైపు మహిళల 57 కిలోల రెజ్లింగ్‌లో భారత్‌కు చెందిన రెజ్లర్ అన్షు మాలిక్ నిరాశపర్చింది. తొలి రౌండ్‌లోనే బెలారస్‌కు చెందిన కురాచ్‌కినా చేతిలో 2-8 తేడాతో ఓడిపోవడంతో క్వార్టర్ ఫైనల్ చేరలేకపోయింది. 

Updated Date - 2021-08-04T14:44:59+05:30 IST