సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత వన్డే జట్టులోకి అశ్విన్

ABN , First Publish Date - 2021-12-26T22:19:04+05:30 IST

టీమిండియా ఆఫ్ బ్రేక్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి రాబోతున్నాడా? దక్షిణాఫ్రికాతో త్వరలో

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత వన్డే జట్టులోకి అశ్విన్

ముంబై: టీమిండియా ఆఫ్ బ్రేక్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టులోకి రాబోతున్నాడా? దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడబోతున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలో ఎంపిక చేయనున్న వన్డే జట్టు కోసం అశ్విన్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించడంతో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. 


చేతన్‌శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే జట్టులోకి అశ్విన్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఎంపిక చేయనున్న వన్డే జట్టులో అశ్విన్‌కు చోటు దక్కడం ఖాయమని చెబుతున్నారు. అయితే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్పిన్నర్లతో అశ్విన్‌కు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.


టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా అశ్విన్‌పై మంచి గురి ఉంది. అతడిని తాను  ఆల్‌రౌండర్ బౌలర్ అని పిలుస్తానని గతంలో చెప్పుకొచ్చాడు. రోహిత్ జట్టులో ఉంటే అదనపు బలం వస్తుందన్నాడు. అతడు ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలుగుతాడని ప్రశంసించాడు. ఇక, ఐపీఎల్ రెండో అంచెలో అద్భుతంగా రాణించిన వెంకటేశ్ అయ్యర్‌కు కూడా వన్డే జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.


విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలు బాదిన రుతురాజ్ గైక్వాడ్‌ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరమైన వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జనవరి 19న జరగనుండగా, 21, 23 తేదీల్లో రెండు మూడు వన్డేలు జరగనున్నాయి.  

Updated Date - 2021-12-26T22:19:04+05:30 IST