Abn logo
Oct 17 2021 @ 00:22AM

వెల్లువెత్తిన జనం.. రావణ దహనం...

జనసంద్రమైన ఉర్సు రంగలీల మైదానం, ఉర్సు గుట్ట వద్ద దహనమవుతున్న 90ఫీట్ల భారీ రావణుడి ప్రతిమ,సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

రంగలీల మైదానంలో అంబరాన్నంటిన దసరా ఉత్సవాలు
ఆకట్టుకున్న బాణసంచా విన్యాసాలు
90 అడుగుల రావణ ప్రతిమకు నిప్పు పెట్టిన మంత్రి ఎర్రబెల్లి


ఏకశిలనగర్‌ (వరంగల్‌), అక్టోబరు 16 : ఇసుకేస్తే రాలనంత జనం... నింగిలో హరివిల్లులను ఆవిష్కరించిన తారాజువ్వలు... కాలిపోతూ, పేలిపోతూ నేలకూలిన 90 అడుగుల దశకంఠుడు... ఆద్యంతం మార్మోగిన కేరింతలు.. దసరా పండుగ సందర్భంగా నగరంలోని ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో శుక్రవారం రాత్రి రావణ వధ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకకు జనం భారీసంఖ్యలో హాజరయ్యారు.  వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఉర్సు, కరీమాబాద్‌ దసరా ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తొలుత సాయంత్రం 5 గంటలకు కరీమాబాద్‌ రామస్వామి గుడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సీతారామ లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలతో, వారి వేషధారణలతో శోభాయాత్ర బయలుదేరింది. ఈ సందర్భంగా కళాకారులు కోలాటాలు, చిడుతల రామాయణ నృత్యాలు ప్రదర్శించారు. అశేష జనం సాక్షిగా యాత్ర  ఉర్సు గుట్ట రంగలీల మైదానానికి చేరుకున్న తర్వాత రావణవధ వేడుక మొదలైంది. సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అప్పటికే ఉర్సుగుట్ట పరిసర ప్రాంతాలు జనంతో నిండిపోయాయి.

రాత్రి 7.30 గంటల సమయంలో సభ మొదలైంది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌  అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు,  విశిష్ట అతిథులుగా కలెక్టర్‌ గోపి, సీపీ తరుణ్‌జోషి, నగర మేయర్‌ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌,  ఎంపీ పసునూరి  దయాకర్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,  కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా మసూద్‌, స్థానిక కార్పొరేటర్లు మరుపల్ల రవి, ముష్కమల్ల అరుణ సుధాకర్‌, పల్లం పద్మ రవి, సిద్దం రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారాజువ్వలు నింగిలో ఆశ్చర్యపరిచే డిజైన్లలో వెలుగులు విరజిమ్ముతూ ఆకట్టుకున్నాయి. వేలాదిమంది జనం నీలాకాశంలో బాణసంచా విన్యాసాలను కేరింతలు కొడుతూ వీక్షించారు.  అనంతరం  రాత్రి 8.05 గంటలకు రావణ ప్రతిమకు మంత్రి దయాకర్‌ రావు నిప్పంటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ , మేయర్‌ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌, ఎంపీ పసునూరి దయాకర్‌ పాల్గొన్నారు. ఒక పద్ధతి ప్రకారం బాణసంచా వెలుగులు విరజిమ్మూతూ రావణ ప్రతిమ అంతా వ్యాపించిన తర్వాత, భారీ శబ్దాలతో టపాసులు  పేలడం మొదలైంది. ప్రతిమలోని ఒక్కోభాగం కాలిపోతూ పేలిపోతున్న దృశ్యాలను వేలాదిమంది హర్షధ్వానాలు చేస్తూ తిలకించారు. ఈ సందర్భంగా వేదికపై అమర్చిన డిస్కోలైట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాంబుల మోత, తారాజువ్వల విన్యాసాల సందడితో రంగలీల  మైదానం రంగులమయమైంది.  వీక్షకులు తమ సెల్‌ఫోన్‌లలో ఆ దృశ్యాలను రికార్డు చేసుకున్నారు.  ఉత్సవాలలో ప్రధానంగా   రావణాసుర విగ్రహాన్ని  దహనం చేసే ముందు గ్రేటర్‌ కార్పొరేషన్‌ వారు  చేపట్టిన ఎలక్ట్రికల్‌ రావణవధ ఆకట్టుకుంది. విద్యుత్‌ కాంతులలో ఉర్సు గుట్ట, రంగలీల మైదానం దేదీప్యమానంగా వెలిగిపోయింది. గుట్టపై, మైదానంలో విద్యుత్‌ లైట్ల అలంకరణలతో కొత్త వాతావరణం కనిపించింది. అయితే ప్రతీ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నాగుపాము, చైనా రింగ్‌ తదితర ఐటమ్స్‌ లేకపోవడంతో జనం నిరాశ చెందారు. కాగా, సభా వేదికపై ఆసీనులైన వారిలో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నరేందర్‌ మాత్రమే మాట్లాడారు. సమయాభావం వల్ల మిగతావారితో మాట్లాడించలేకపోతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి.