రామాయణ సారం: అహంకారంతో ఎవరైనా మనల్ని హేళన చేసినప్పుడు ఏం చేయాలి?

ABN , First Publish Date - 2021-12-13T14:24:56+05:30 IST

ఈ ప్రశ్నకు రామాయణంలో చక్కని సమాధానం ఉంది.

రామాయణ సారం: అహంకారంతో ఎవరైనా మనల్ని హేళన చేసినప్పుడు ఏం చేయాలి?

ఈ ప్రశ్నకు రామాయణంలో చక్కని సమాధానం ఉంది. రామాయణ గాథను అనుసరించి.. శ్రీరాముని దూతగా మారిన అంగదుడు రావణుని సభకు వెళతాడు. అక్కడ ఈ ఘట్టం కనిపిస్తుంది. త్వరలో రామరావణ యుద్ధం జరగబోతోంది. అయితే శ్రీరాముడు ఈ యుద్ధాన్ని నివారించడానికి తన వంతుగా మరొక ప్రయత్నం చేశాడు. రావణుణ్ణి యుద్ధం నుంచి విరమింపజేసేందుకు అంగదుని.. లంక ఆస్థానానికి దూతగా పంపాడు. 


రావణుడు తన ఆస్థానానికి వచ్చిన అంగదుణ్ణి చూడగానే  'ఎవరు నువ్వు?' అని ప్రశ్నించాడు. 

అంగదుడు దీనికి సమాధానమిస్తూ.. నా పేరు అంగదుడు. నా తండ్రి పేరు వాలి. మీకు వాలి గుర్తున్నారా? అతనిని ఎప్పుడైనా కలిశారా?' అని అడిగాడు.

వాలి అనే పేరు వినగానే రావణుడు.. 'అవునవును, నాకు వాలి అనే కోతి గతంలో ఉండేదని గుర్తుంది' అంటూ హేళనగా మాట్లాడాడు. ఈ మాట వినగానే అంగదుడు ఆశ్చర్యపోయాడు. అయితే రావణుడు.. గతంలో తాను వాలితో యుద్ధానికి తలపడి, ఓటమిపాలై అతని దగ్గర ఆరు నెలల పాటు బందీగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రావణుడి లాంటి వారికి ఒక అలవాటు ఉంటుంది.. ఇలాంటివారు తమ అహంభావంతో ఇతరులు ఎటువంటివారైనప్పటికీ చిన్నచూపు చూస్తూ, తామెంతో గొప్పవారిమని విర్రవీగుతుంటారు. 

రావణుడు.. అంగదునితో 'వాలి కుమారుడివైన నువ్వు రాముని సాయం చేయడమేమిటి? ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు?' అని ప్రశ్నించాడు.


వాలి.. రాముని చేతిలో చనిపోయాడని రావణునికి తెలుసు, అయినా ఈ వాగ్వాదాన్ని కొనసాగించేందుకు అబద్ధమాడాడు. వెంటనే వాలి కుమారుడైన అంగదుడు సమాధానమిస్తూ.. 'వాలి ఇప్పుడు మీకు బాగా గుర్తుకువస్తున్నారు కదా? కొన్ని రోజుల తర్వాత మీరు కూడా.. శ్రీరాముడు వాలిని పంపిన చోటుకే వెళ్తారు. అప్పడు అక్కడ మీరు వాలిని ఎలా ఉన్నారని? అడగండి అని సమాధానమిచ్చాడు.

నీతి: అంగదుడు చిన్నవాడు.. రావణుడు మహా పండితుడు, ప్రపంచ విజేత. అయితే అహంకారం కారణంగా రావణుడు.. అంగదుని హేళన చేస్తూ మాట్లాడాడు. అయితే అంగదుడు.. రావణుని అహకారం అణిగేలా తగిన సమాధానం చెప్పాడు. మన జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఎవరైనా మనల్ని అహంకారంతో హేళన చేస్తే.. మనం వెంటనే ఆగ్రహానికి గురి కాకుండా, ఎదుటివారి మాటలకు తగిన సమాధానం ఇవ్వాలి.

Updated Date - 2021-12-13T14:24:56+05:30 IST