రావమ్మా సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-14T06:11:02+05:30 IST

ఒక వసంతం కరిగిపోయింది. మరో వసంతం కొత్త ఆశలను ఎదలో నింపడం కోసం.. వస్తుంది తెలుగింట ముగ్గుల పండుగై...

రావమ్మా సంక్రాంతి

ఒక వసంతం కరిగిపోయింది.

మరో వసంతం కొత్త ఆశలను

ఎదలో నింపడం కోసం..

వస్తుంది తెలుగింట ముగ్గుల పండుగై.

రంగురంగుల రంగవల్లికలు 

ఇంటిముందరే కాదు..

మా జీవితాల్లో కూడా 

హరివిల్లులై మెరవాలని

కార్మిక కర్షకలోకం నిను ఆహ్వానిస్తుంది..

రావమ్మా సంక్రాంతి.!


పంటకాపు పస్తులను కనులనిండా 

చూడటం కోసం..

కాయాన్ని నమ్ముకున్న కర్షకుడు..

కల్లాల్లో కన్నీరును కారుస్తూ 

కుప్పకూలుతున్న

రోజులను చూడటం కోసం 

రావమ్మా సంక్రాంతి!


వాకిట్లో గొబ్బెమ్మలు

గుబులుపట్టుకొని కూసున్నయి.

వరిగింజలన్నీ తూకాల్లో 

తాలుగింజలై ఎగిరిపోతుంటే

హాలికుడు గుండెల్లో బాధను చూడగా..

రావమ్మా సంక్రాంతి!


తెగిన గాలిపటాల్లా గాల్లో 

ఎగురుతున్న బతుకులను

దారమై మము గమ్యానికి చేర్చడానికి..

కరోనకోరలు విరిచి.. భోగిమంటల్లో విసిరి..

రోగాల బాధలను తీర్చి..

దుఃఖాల శోకాలు తీర్చి..

గంగిరెద్దుల ఆటలతో..

కోడిపందాల ఆటవిడుపులతో

ఆయురారోగ్యాల చల్లని పండుగవై

మము దీవించగా రావమ్మా సంక్రాంతి.!


అశోక్ గోనె

Updated Date - 2022-01-14T06:11:02+05:30 IST