‘పీసా’ను తలదన్నే రత్నేశ్వర మందిర్‌!

ABN , First Publish Date - 2020-09-11T05:30:00+05:30 IST

ఇటలీలోని ‘పీసా టవర్‌’ పేరు వినగానే కాస్త పక్కకు ఒరిగి ఉండే కట్టడం కళ్ళముందు కదులుతుంది. పీసా టవర్‌ నిర్మాణం కొంత జరిగాక, దాని పునాదిలో ఒకవైపున గట్టిదనం లేకపోవడం వల్ల ఆ కట్టడం పక్కకు ఒరిగి పోతోందని గ్రహించారు...

‘పీసా’ను తలదన్నే  రత్నేశ్వర మందిర్‌!

ఇటలీలోని ‘పీసా టవర్‌’ పేరు వినగానే కాస్త పక్కకు ఒరిగి ఉండే కట్టడం కళ్ళముందు కదులుతుంది. పీసా టవర్‌ నిర్మాణం కొంత జరిగాక, దాని పునాదిలో ఒకవైపున గట్టిదనం లేకపోవడం వల్ల ఆ కట్టడం పక్కకు ఒరిగి పోతోందని గ్రహించారు. నిర్మాణం పూర్తయ్యాక నాలుగు డిగ్రీల వంపు స్థిరపడిపోయింది. అదే పీసా టవర్‌కు విశ్వ విఖ్యాతి తీసుకువచ్చింది.

అయితే, దాన్ని తలదన్నే కట్టడం మన దేశంలోనే ఉంది. అదే రత్నేశ్వర్‌ మహాదేవ్‌ మందిరం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్ష్షేత్రమైన వారణాసిలో, మణికర్ణికా ఘాట్‌ సమీపంలో ఉంది. ఈ ఆలయం తొమ్మిది డిగ్రీల వంపుతో ఒడ్డువైపు ఒరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, పీసా టవర్‌ ఎత్తు 54 మీటర్లయితే ఈ రత్నేశ్వరుడి మందిరం ఎత్తు సుమారు 74 మీటర్లు. 


ఈ ఆలయ నిర్మాణం గురించీ, ఈ వంపు ఏర్పడడానికి కారణం గురించీ అనేక కథలున్నాయి. వాటిలో ఒక కథ ప్రకారం అయిదు వందల ఏళ్ళ క్రితం రాజా మాన్‌సింగ్‌ సేవకుడొకరు తన తల్లి పేరిట ఈ ఆలయం కట్టించి, ఆమె రుణం తీర్చుకున్నానని గొప్పలు చెప్పుకున్నాడట. అయితే ‘ఎప్పటికీ తీరనిది తల్లి రుణం’ అంటూ ఆ తల్లి ఇచ్చిన శాపంతో ఈ ఆలయం వంగిపోయిందట! అందుకే దీన్ని ‘మాతృ రుణ మందిరం’ అంటారట! ఇలాంటి కథలు మరెన్నో ఉన్నప్పటికీ, 1825 తరువాతే రత్నేశ్వర మహాదేవ్‌ ఆలయ నిర్మాణం జరిగినట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. 1860కి ముందు ఈ గుడి నిటారుగానే ఉండేదట! క్రమంగా వంగిపోవడానికి కారణం నదిలో కట్టడం వల్ల పునాదులు కుంగిపోవడమో, బలహీనపడడమోననే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా ఈ ఆలయం వారణాసిలో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది.

Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST