Abn logo
Sep 22 2021 @ 00:14AM

జీవనగోదావరి దాటిన ‘రత్న’ శిల్పి

స్వాతంత్ర్యోద్యమంలో విదేశీవస్తు బహిష్కరణలో భాగంగా రాజమహేంద్రవరం గోదావరీ నదీతీరాన ఊపిరి పోసుకున్న దస్తూరీ లేఖిని రత్నం పెన్ను. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరుప్రఖ్యాతులు పొందిన రత్నం పెన్నుల రెండోతరం శిల్పి కోసూరి వెంకటరమణమూర్తి 80వ పడిలో రాజమండ్రిలో (సెప్టెంబర్‌ 20వ తేదీ) సోమవారం కన్నుమూశారు. మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో రమణమూర్తి తండ్రి వెంకటరత్నం 1932లో రత్నం పెన్నుల కంపెనీని స్థాపించారు. సన్నని పాళీ, చెక్క మెటీరియల్‌తో కూడిన ఈ ఇంకు పెన్ను అనతి కాలంలోనే అమితమైన ఆదరణ పొందింది. అందమైన దస్తూరీకి ఆలంబనగా నిలిచిన ఈ చిన్ని కళాకాండం దశాబ్దాల పాటు కరాల్లో ఒదిగిపోయి అక్షర సుమాలు సృష్టించింది. తలకట్లు కలిపి రాసే రాతకు, దస్తావేజుల రాతకు రత్నం పెన్నులు పెట్టింది పేరు. అఖిలభారత ఖాదీగ్రామీణ సంస్థ కార్యదర్శి కుమరప్ప 1933లో ఈ సంస్థను సందర్శించి రెండు పెన్నులు తీసుకెళ్లారు. వాటిలో ఒక పెన్నును మహాత్మా గాంధీకి అందజేశారు. రత్నం స్వదేశీ ఉద్యమ మమకారానికి, పెన్ను అపురూప పనితీరుకు అబ్బురపడ్డ గాంధీజీ 1935 జూలై 16న వెంకటరత్నాన్ని అభినందిస్తూ స్వయంగా లేఖ రాశారు. సీవై చింతామణి, న్యాపతి సుబ్బారావు పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, రాంనాధ్ గోయంకా తదితరులు రత్నం పెన్నులు వాడి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతులు బాబు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి గిరి, ప్రధానులు నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి తదితర ఉద్దండులు వెంకటరత్నం పెన్నులు వాడి పొగడ్తలు కురిపించిన వారే. వెంకట రత్నం నిత్యం స్వాతంత్య్రం కోసం తపించిన గాంధేయవాది కూడా. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆనందంతో ఊగిపోయి రాజమండ్రి పురవీధుల్లో ఆయన రత్నం పెన్నులు పంచిపెట్టారు. బాల్యం నుంచి రమణమూర్తి తండ్రికి తోడుగా ఉంటూ పెన్నుల తయారీలో తన కళాకౌశలాన్ని జోడిస్తూ పెన్నుల రాతకు మరింత పదును పెట్టారు. 1981లో వెంకటరత్నం  మృతి చెందాక రాజమహేంద్రవరం రంగ్రీజుపేటలో రత్నం సన్స్ పెన్ వర్క్స్ సంస్థను రమణమూర్తి బలోపేతం చేశారు. రత్నం పెన్నులకు అధునాతన హంగులు జోడించి అలుపెరగని కృషితో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రత్నం పెన్నులు నాటి నుంచి నేటివరకు లాభసాటి వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక స్వరాజ్య చిహ్నంగానే వాటి తయారీ, అమ్మకాలు జరగడం విశేషం. రెండో తరంలో వెంకట రమణ మూర్తి పెన్నులకు కూడా ఎక్కడా ఆదరణ తగ్గలేదు. ప్రధాని ఇందిరా గాంధీ, రాష్ట్రపతులు జ్ఞానీ జైల్‌సింగ్, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, పలువురు గవర్నర్లు ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఈ పెన్నులతో రాసి ముగ్ధులయ్యారు. 2019లో జెర్మన్ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్ ఇండియాకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఆమెకు రత్నం పెన్నును బహుమతిగా అందించారు. విదేశాలకు సైతం పెన్నులు ఎగుమతి చేస్తూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకున్న రత్నం పెన్నులు తయారీని మూడోతరానికి అప్పజెప్పి నిష్క్రమించిన వారధి కె.వి రమణమూర్తి. చెళ్లపిళ్ల, శ్రీశ్రీ, గుర్రం జాషువా, విశ్వనాథ వంటి ఉద్ధండ కవులు సైతం రత్నఝరితంతో సాహిత్యాన్ని సృష్టించి ఈ కలాలకు ఫిదా ఐనవారే. ఇప్పుడు మూడోతరంలో వెంకటరమణ మూర్తి కుమారులు ఇద్దరు రత్నం కలాల కీర్తి శిఖరాలను వంశపారంపర్యంగా నిలబెట్టే వారసత్వ భాధ్యతను తీసుకున్నారు. తొమ్మిది దశాబ్దాల రత్నం పెన్నుల ప్రస్థానంలో అలుపెరగని కలాల కీలక కృషీవలుడు వెంకటరమణమూర్తి అస్తమయం ఆ తరహా పెన్నులంటే మక్కువచూపే వారికి, వాటి వాడకందారులకు నిజంగా లోటే.

చిలుకూరి శ్రీనివాసరావు

ప్రత్యేకంమరిన్ని...