రేషన్‌ బండికి దూరం దూరం

ABN , First Publish Date - 2021-04-17T09:54:46+05:30 IST

రాజకీయ పార్టీలకు సేవలు చేయడంలో తలమునకలు అవుతున్న వలంటీర్లు, పేదలకు అవసరమైన రేషన్‌ పంపిణీని మాత్రం పూర్తిగా గాలికొదిలేశారు. ఎక్కడా ఏ రేషన్‌ బండిలోనూ

రేషన్‌ బండికి  దూరం దూరం

ఏమాత్రం కలిసిరాని వలంటీర్లు

స్లిప్పుల పంపిణీ ఊసే లేదు

ముందస్తు సమాచారం ఇవ్వరు

పోర్టబులిటీ అవగాహనే లేదు

భారమంతా రేషన్‌ డ్రైవర్లపైనే

‘రాజకీయ’ తలనొప్పులెందుకని మిన్నకుంటున్న అధికారులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాజకీయ పార్టీలకు సేవలు చేయడంలో తలమునకలు అవుతున్న వలంటీర్లు, పేదలకు అవసరమైన రేషన్‌ పంపిణీని మాత్రం పూర్తిగా గాలికొదిలేశారు. ఎక్కడా ఏ రేషన్‌ బండిలోనూ వలంటీరు ఉన్న దాఖలాలే లేవు. పొరపాటున ఎక్కడైనా ఒకరిద్దరు రేషన్‌ బండి వద్దకు వచ్చినా ఐదు, పది నిముషాలు మించి అక్కడ కనిపించడం లేదు. పింఛన్ల పంపిణీ నెలలో తొలి రెండురోజులే ఉంటుంది. మిగతా రోజుల్లో రేషన్‌ పంపిణీకి సహకరించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసినా, ఎక్కడా స్పందన కనిపించడం లేదు. ఫలితంగా రేషన్‌ ఎప్పుడు ఇస్తారు...బండి తమ వీధికి ఎప్పుడొస్తుంది...అసలు వస్తుందా లేక వెళ్లి రేషన్‌ షాపులో తెచ్చుకోవాలా అనే సమాచారం  కార్డుదారులకు ఉండటం లేదు. కేవలం రేషన్‌ వాహనం డ్రైవరు, హెల్పర్‌ తప్ప బండిలో ఎవరూ ఉండటం లేదు. 


సర్కారు చెప్పినా కదలరేం?

రేషన్‌ పంపిణీలో ఆలస్యాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఇటీవల వలంటీర్లకు పలు బాఽధ్యతలు అప్పగించింది. 1. రేషన్‌ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియజేస్తూ ప్రతి ఇంటికీ వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయాలి 2. రేషన్‌ వాహనం వచ్చే ఒకరోజు ముందు అక్కడి కార్డుదారులకు సమాచారం తెలపాలి 3. పంపిణీ సమయంలో రేషన్‌ వాహనం వద్దే ఉండాలి 4. కార్డుదారుల నుంచి ఈపోస్‌ యంత్రంలో వేలిముద్రలు తీసుకోవాలి 5. రేషన్‌ వాహనం వచ్చినప్పుడు రేషన్‌ తీసుకోనివారికి సమాచారం ఇచ్చి, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో గ్రామ/వార్డు సచివాలయం వద్ద రేషన్‌ ఇప్పించాలి 6. పోర్టబులిటీలో రేషన్‌ పొందే విధానంపై కార్డుదారులకు అవగాహన కల్పించాలి. వీటితో పాటు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం, మ్యాపింగ్‌ అవ్వని కార్డులకు సరుకుల పంపిణీ వంటి బాధ్యతలు వారికి ఇచ్చారు. అయితే, వీటిలో కనీసం కొన్ని అయినా పూర్తిచేస్తున్న దాఖలాలు లేవు.


అసలు ఇంటింటికీ వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయడం అనేది ఎక్కడా చేయడం లేదు. ఇక ముందు రోజు ఇంటికెళ్లి సమచారం ఇవ్వడం లాంటివి కనిపించడమే లేదు. పైగా రేషన్‌ ఎప్పుడిస్తారని కార్డుదారులు అడిగినా వలంటీర్లు స్పందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికీ చాలా మంది కార్డుదారులకు పోర్టబులిటీపై అవగాహన లేదు. పాత విధానంలో కార్డు ఉన్న షాపులోనే రేషన్‌ తీసుకోవాలనే భావనలో ఉండిపోతున్నారు. ఆ షాపునకు చెందిన సరుకులు వాహనంలో తెచ్చినప్పుడే రేషన్‌ తీసుకుంటున్నారు. పక్క రేషన్‌ షాపు నుంచీ సరుకులు తీసుకోవచ్చని అవగాహన ఉండటం లేదు. ఈ బాధ్యతను వలంటీర్లకు ప్రత్యేకంగా అప్పగించినప్పటికీ ఎక్కడా పట్టించుకోవడం లేదు. 


చెయ్యకున్నా అడిగేదెవరు?

వలంటీర్లు అందుబాటులో లేకపోవడంతో పనిభారం మొత్తం తమపైనే పడిందని డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వలంటీర్ల సహకారం ఉంటే త్వరగా పంపిణీ పూర్తిచేయొచ్చునని, కానీ వారు ముందుకు రావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే అధికార యంత్రాంగం కూడా వలంటీర్లపై ఒత్తిడి చేయడం లేదు. అప్పగించిన బాధ్యతలు చేపట్టని వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. వలంటీర్లవి రాజకీయ నియామకాలు కావడంతో, వారిపై చర్యలు తీసుకునే ధైర్యం యంత్రాంగం చేయలేకపోతోంది.

Updated Date - 2021-04-17T09:54:46+05:30 IST