రేషన్‌ మిల్లర్ల మాయాజాలం

ABN , First Publish Date - 2021-10-20T05:08:28+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో రైస్‌ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు.

రేషన్‌ మిల్లర్ల మాయాజాలం
గద్వాలలో పట్టుబడిన ప్రభుత్వ వడ్ల లారీలు(ఫైల్‌)

అధికారుల కన్నుకప్పి అడ్డదారిలో వడ్లు అమ్ముకుంటున్న వైనం

బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న మిల్లుల్లో వడ్ల నిల్వలు?

మామూళ్ల మత్తులో సివిల్‌ సప్లయ్‌ అధికారులు


గద్వాల క్రైం, అక్టోబరు 19: జోగుళాంబ గద్వాల జిల్లాలో రైస్‌ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు. బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లులో ప్రభుత్వం మిల్లులకు ఇచ్చిన వడ్లను నిల్వ చేయడం, ప్రభుత్వం కేటాయించిన వడ్లను తీసుకోని మిల్లర్ల వడ్లను బ్లాక్‌ లిస్టులో ఉంచిన మిల్లర్లు తీసుకోవడం ఇక్కడ జరుగుతున్న అవినీతికి అద్దం పడుతున్నది. మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వడ్లను ఇతర రాష్ర్టాలకు అమ్ముకుని, రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి గవర్నమెంట్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


గద్వాలలో 17 మిల్లులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికారికంగా అసోసియేషన్‌లో రైస్‌ మిల్లులు 46 ఉన్నాయి. అందులో గద్వాల పట్టణంలో, పట్టణ శివారులో 17 రైస్‌ మిల్లులు ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే అందులో మూడు మిల్లులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతుండటంతో గతంలో ఉన్న జిల్లా అధికారులు వాటిని బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచారు. బ్లాక్‌ లిస్టులో లేని వాటికి ఒక్కో మిల్లుకు 75 వేల బస్తాల వడ్లను ప్రభుత్వం కేటాయించింది. కొన్ని మిల్లుల యజమానులు అధికారుల అండదండలతో లక్ష బస్తాలు వరకు తీసుకున్నట్లు తెలిసింది. వీరు ప్రభుత్వానికి క్వింటాలు వడ్లకు 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను ఇతర రాష్ర్టాలకు అడ్డదారిలో అమ్ముకుని, రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి గవర్నమెంట్‌కు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ఇతర పేర్లపై బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న మిల్లులు తెరిచే యత్నం

గద్వాల పట్టణంలో మూడు రైస్‌ మిల్లులను బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచగా, అందులో రెండు రైస్‌ మిల్లుల్లో ప్రభుత్వానికి సంబంధించిన వడ్ల నిల్వలు ఉంచినట్లు సమాచారం. అయితే పట్టణంలోని బ్లాక్‌ లిస్టులో ఉన్న మూడు మినహాయించి 14 మిల్లులు ఉండగా వాటిలో 10 మంది మిల్లర్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన వడ్లను తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆ నలుగురి పేర్ల మీద వడ్లను బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లర్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ రెండు మిల్లుల్లో దాదాపు 2 లక్షల బస్తాలను నిల్వచేసి, దొంగతనంగా అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలియదా? లేక తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఇంకో విచిత్రమేమంటే బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న మిల్లు యజమానులు ఇతర పేర్లతో రైస్‌ మిల్లులు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఒకే గోదాంలో రెండు మిల్లుల వడ్లు

ప్రభుత్వం సరఫరా చేసే వడ్లను సంబంధిత రైస్‌ మిల్లర్లు మిల్లుల్లో ఉంచుకోవాలి. లేదంటే ప్రత్యేకంగా గోదాంలో నిల్వ చేయాలి. కానీ సోమవారం పట్టుపడిన తమిళనాడుకు సరఫరా చేస్తున్న వడ్లను ఆంజనేయ రైస్‌ మిల్లు యజమాని, ఇంకో రైస్‌ మిల్లు యజమానితో కలిసి అయిజ రోడ్డులో ఉన్న కొండపల్లి రోడ్డు ఎదురుగా గల ఒక గోదాంలో ఇద్దరి వడ్లను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పట్టుబడిన వడ్లలో తేడాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేగాక కేసు తప్పుదోవ పట్టే ప్రమాదమూ లేకపోలేదు. సోమవారం తమిళనాడుకు చెందిన లారీలలో వడ్లను తరలిస్తుంటే తమను కాదని ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలను పంపడం ఏంటని? గద్వాల లారీ అసోసియేషన్‌ నాయకులు అడగటంతో ఈ విషయాలు బయట పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలను తేల్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.


అందుబాటులో లేని అధికారి

ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల అధికారి రేవతిని వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2021-10-20T05:08:28+05:30 IST