రేషన్‌ సేవలు మరింత వేగంగా

ABN , First Publish Date - 2022-06-26T06:13:07+05:30 IST

రేషన్‌ సేవలు మరింత వేగంగా అందనున్నాయి. చౌకధరల దుకాణాల్లో ఇప్పటి వరకు ఉన్న పాత ఈ-పాస్‌ మిషన్లలో ఒక్కోసారి థంబ్‌, ఐరిస్‌ సరిగా రికార్డు కాకపోయేది. ఫలితంగా కార్డుదారులు రోజుల తరబడి రేషన్‌షాపు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ సమస్యలకు చెక్‌ పడనుంది.

రేషన్‌ సేవలు మరింత వేగంగా

- ఇక క్షణాల్లో ఐరిస్‌, ఽథంబ్‌ క్యాప్చరింగ్‌

- 4జీ సదుపాయంతో కొత్త ఈ పాస్‌ మిషన్లు

- ఇక అంతరాయం లేకుండా సరుకుల పంపిణీ

- జిల్లాలో 760 మంది డీలర్లకు అందజేత


కామారెడ్డి, జూన్‌ 25: రేషన్‌ సేవలు మరింత వేగంగా అందనున్నాయి. చౌకధరల దుకాణాల్లో ఇప్పటి వరకు ఉన్న పాత ఈ-పాస్‌ మిషన్లలో ఒక్కోసారి థంబ్‌, ఐరిస్‌ సరిగా రికార్డు కాకపోయేది. ఫలితంగా కార్డుదారులు రోజుల తరబడి రేషన్‌షాపు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ సమస్యలకు చెక్‌ పడనుంది. ఇందుకోసం 4జీ సదుపాయంతో కొత్త ఈ పాస్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే జిల్లాలోని 760 మంది డీలర్లకు చేరాయి. వైఫై, బ్లూటూత్‌ కలిగి ఉండే ఈ కొత్త మిషన్‌లో థంబ్‌, ఐరిస్‌ క్షణాల్లో క్యాప్చర్‌ కావడం వల్ల కార్డుదారులకు అంతరాయం లేకుండా సరుకులు అందనున్నాయి. జిల్లాలో మొత్తం 2,53,782 రేషన్‌కార్డులుండగా వచ్చేనెల నుంచి కొత్త మిషన్ల ద్వారా బియ్యం ఇవ్వనున్నారు.

ఇబ్బందులకు చెక్‌

ఇన్నాళ్లు రేషన్‌షాపుల్లో పాత ఈపాస్‌ మిషన్ల మూలానా రేషన్‌ కార్డుదారులు బియ్యానికి వస్తే నెట్‌ సౌకర్యం లేక, ఉన్న థంబ్‌, ఐరిస్‌ పనిచేయక రోజుల తరబడి రేషన్‌ షాపుల చుట్టు తిరిగేవారు. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4జీ సేవలు అందుబాటులో ఉండేలా అత్యాధునికి సేవలు అందించే ఈ పాస్‌మిషన్లను రేషన్‌ డీలర్లకు అందించనున్నారు. ఈ మిషన్‌ తూకంవేసే కాంటాకు అనుసంధానమై ఉంటుందని బ్లూటూత్‌, వైఫైతో కనెక్ట్‌ అయి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చేనెల నుంచి ఆధునిక ఈ పాస్‌ మిషన్లతోనే రేషన్‌ డీలర్లు కార్డుదారులకు బియ్యం అందజేస్తారు.

జిల్లాలో 760 రేషన్‌ షాపులు

జిల్లా వ్యాప్తంగా 760 రేషన్‌ దుకాణాలు ఉండగా 2,53,785 కార్డులున్నాయి. అందులో ఆహార భద్రత కార్డులు 2,35,208 ఉండగా, అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 17,585, అన్నపూర్ణ కార్డులు 989 ఉన్నాయి. ఈనెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం అందిస్తుండగా ఈ పాస్‌ సేవలు త్వరితగతిన అందనున్నాయి. ప్రతినెల 1 నుంచి 15వ తేదీలోపు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, కూలీల కుటుంబాల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం వేళల్లో డీలర్లు రేషన్‌ బియ్యం అందజేస్తారు.


4జీ సేవలతో త్వరగా రేషన్‌

- రాజశేఖర్‌, డీఎస్‌వో, కామారెడ్డి

పాత మిషన్లతో పోల్చితే ప్రభుత్వం రేషన్‌ డీలర్లుకు కొత్తగా అందిస్తున్న మిషన్లతో త్వరతిగతిన పని పూర్తవుతోంది. ఈ మిషన్‌తో 4జీ సేవలు అందడం వల్ల థంబ్‌, ఐరిస్‌ వేగంగా క్యాప్చర్‌ చేస్తోంది. గతంలో కూలీలు, రైతుల చేతుల్లో రేఖలు అరిగి పాత మిషన్‌ వారి థంబ్‌ క్యాప్చరింగ్‌ సహకరించేది కాదు. ఐరిస్‌తో కంటిని క్యప్చరింగ్‌ చేయడంలో సమయం గడిచేది. ఈ ఇబ్బందులు కొత్త మిషన్లతో తొలగుతాయి. తూకంలో ఎలాంటి తేడాలు లేకుండా సరుకులు లబ్ధిదారునికి చేరుతాయి. ప్రస్తుతం విజన్‌టెక్‌ కంపెనీకి చెందిన ఆధునిక ఈ పాస్‌ మిషన్‌లు రేషన్‌ డీలర్లకు అందించాం.

Updated Date - 2022-06-26T06:13:07+05:30 IST