రేషన్‌ బియ్యం.. మాకేం భయం!

ABN , First Publish Date - 2022-07-05T05:03:47+05:30 IST

జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు, చుట్టుపక్కల మండలాల్లో రేషన్‌ బియ్యం అక్రమవ్యాపారం జోరుగా సాగుతోంది. వైసీపీకి చెందిన కొందరు నేతలు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా చౌకధరల దుకాణాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అడ్డుకుంటే వారిపై బెదిరింపులు, దౌర్జన్యానికి దిగుతున్నారు.

రేషన్‌ బియ్యం..  మాకేం భయం!

రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు

ఒంగోలు, చుట్టుపక్కల 

మండలాల్లో భారీగా బియ్యం కొనుగోలు

మాకే ఇవ్వాలని డీలర్లపై ఒత్తిళ్లు 

పట్టపగలే అక్రమంగా తరలింపు 

అధికారులకూ బెదిరింపులు

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 4 : జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు, చుట్టుపక్కల మండలాల్లో రేషన్‌ బియ్యం అక్రమవ్యాపారం జోరుగా సాగుతోంది. వైసీపీకి చెందిన కొందరు నేతలు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా చౌకధరల దుకాణాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అడ్డుకుంటే వారిపై బెదిరింపులు, దౌర్జన్యానికి దిగుతున్నారు. ఒంగోలులోని ఐదారుగురు రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను వ్యాపారంగా చేసుకొని లక్షలు పోగేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు కావడం, బెదిరింపులకు దిగుతుండటంతో సంబంధిత అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 


డీలర్లపై ఒత్తిళ్లు

అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న వారు ఒంగోలుతోపాటు మద్దిపాడు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో డీలర్ల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. డీలర్లు కార్డుదారుల వద్ద కిలో బియ్యాన్ని రూ.9నుంచి 10కి కొనుగోలు చేస్తున్నారు. వారికి బియ్యం అక్రమ వ్యాపారులు రూ.14నుంచి రూ.16 చెల్లిస్తున్నారు. డీలర్ల వద్ద బియ్యం కొనుగోలు విషయంలో ఆ ఐదుగురు అక్రమార్కులు పోటీపడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని డీలర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి మాకు బియ్యం ఇవ్వకపోతే మీషాపుపై దాడులు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఒక్కో డీలర్‌పై ఇద్దరు, ముగ్గురు అక్రమ వ్యాపారులు ఈ విధంగా ఒత్తిడి చేస్తుండటంతో ఎవరికి ఇవ్వాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒక అక్రమ వ్యాపారి అయితే బియ్యం తనకే ఇవ్వాలంటూ అడ్వాన్స్‌లు ఇచ్చిపోతున్నాడు. అతను ఇతర దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు ఓ రైసు మిల్లుతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. దీంతో మిల్లుకు బియ్యం సరఫరా చేసేందుకు డీలర్లపై మరింత ఒత్తిడి పెంచినట్లు సమాచారం. 


అధికారులకూ బెదిరింపులు 

రేషన్‌ మాఫియా అధికారులను కూడా బెదిరించే స్థాయికి చేరుకుంది. అక్రమంగా బియ్యం తరలించే వాహనాన్ని పట్టుకుంటే అక్కడకు చేరుకొని అధికారపార్టీ నేతల అండతో బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల ఒంగోలులో రాత్రి సమయంలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాన్ని స్టేషన్‌కు తరలించకముందే అక్రమంగా రేషన్‌ బియ్యం తరలించే వ్యక్తి హుటాహుటిన అక్కడకు చేరుకుని పోలీసులు బెదిరించాడు. వాహనాన్ని తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఆ మరుసటి రోజు ఒక సీఐపై దౌర్జన్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకెందుకులే అన్న ధోరణిలో పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిస్తున్నాయి.


Updated Date - 2022-07-05T05:03:47+05:30 IST