సరిహద్దుల మీదుగా రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌

ABN , First Publish Date - 2022-04-25T05:08:11+05:30 IST

చౌక బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం ఎంతగా ప్రయత్నిస్తున్న దళారులు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ప్రజలకు చేరాల్సిన బియ్యాన్ని దొడ్డి దారిన దర్జాగా సరిహద్దులు దాటించేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ నిఘా, నియంత్రణ కొరవడడంతో కొన్నిచోట్ల నేరుగా రేషన్‌ దుకాణాల నుంచే చౌకబియ్యం దళారుల పాలవుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.

సరిహద్దుల మీదుగా రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌

- జోరుగా అక్రమ రవాణా

- దాడులు జరుగుతున్నా ఆగని దందా

- దొడ్డిదారిన మహారాష్ట్రకు తరలిస్తున్న దళారులు 

- ప్రతిరోజూ క్వింటాళ్ల కొద్ది సరఫరా

- తనిఖీల భారమంతా పోలీసులపైనే

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

చౌక బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం ఎంతగా ప్రయత్నిస్తున్న దళారులు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ప్రజలకు చేరాల్సిన బియ్యాన్ని దొడ్డి దారిన దర్జాగా సరిహద్దులు దాటించేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ నిఘా, నియంత్రణ కొరవడడంతో కొన్నిచోట్ల నేరుగా రేషన్‌ దుకాణాల నుంచే చౌకబియ్యం దళారుల పాలవుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఈ తరహా దందా ఎక్కువగా సాగు తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో వరుసగా జరిగిన పోలీసుల దాడుల్లోనూ ఈ ప్రాంతంలోనే అధిక మొత్తంలో పీడీఎస్‌ బియ్యం పట్టుబడడం పైన పేర్కొన్న అంశాలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో అధికారుల వైఫల్యం ప్రముఖపాత్ర పోషిస్తుండగా తెలివిన మీరిన స్మగ్లర్లు కూడా రోజుకో రకమైన వ్యూహంతో చౌక బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తు న్నారు. రాష్ట్ర ఎన్‌ఫోర్సుమెంటుకు సవాలు విసురుతున్నారు. నిన్న మొన్నటి వరకు రైళ్ల ద్వారా చౌక బియ్యం స్మగ్లింగ్‌ జరిగితే తాజాగా చిన్న చిన్న ఆటోలు, గూడ్స్‌ క్యారియర్స్‌లో ఐదు క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్లు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్టు  తెలుస్తోంది.  రైల్వే పోలీసులు, ఇటు సివిల్‌ పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తుండటంతో దళారులు రూట్‌ మార్చి స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. జిల్లాలో మహారాష్ట్రకు ఎక్కువగా కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని గూడెం, సిర్పూరు(టి) ప్రాంతాల్లో ఉన్న మూడు మార్గాల గుండా భారీ ఎత్తున రవాణా జరుగుతున్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మార్గాల్లో స్మగ్లింగ్‌ నియంత్రణకు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నా సిబ్బంది కొరత కారణంగా ఆచరణలోకి రావడం లేదని అంటున్నారు. దాంతో కేవలం నలుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అయితే అటు పోలీసు యంత్రాంగానికి కూడా స్మగ్లింగ్‌ నియంత్రణ చేసే అధికారం ఉండడంతో కొంతకాలంగా పోలీసులు రోజు వారి జరుపుతున్న వాహన తనిఖీల్లోనే పెద్దఎత్తున చౌకబియ్యం అక్రమ రవాణాను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ తరహాలో పదుల సంఖ్యలో స్మగ్లింగ్‌ జరుగుతుండగా, పోలీసులు అదుపులోకి తీసుకొని జైళ్లకు పంపించారు. అయినా తిరిగి రాగానే సదరు స్మగ్లర్లు స్మగ్లింగ్‌నే వృత్తిగా మార్చుకొని బియ్యం రవాణాకు పాల్పడుతుండడం అధికారులకు మింగుడు పడటం లేదు. 

దళారులతో మహారాష్ట్రకు చేరవేత

పీడీఎస్‌ బియ్యంను దళారులు గ్రామాల్లో తిరుగుతూ లబ్ధిదారుల నుంచి కిలో రూ.8నుంచి రూ.12వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం పరిమాణం పెరగగానే క్వింటాళ్ల చొప్పున అక్రమ రవాణా చేసి తెలంగాణ  సరిహద్దు ఉన్న మహారాష్ట్రలోని వీరూర్‌, బల్లార్షా, చంద్రాపూర్‌లోని కొన్ని ప్రాంతాల దుకాణాలకు చేరవేస్తూ అక్కడ క్వింటాకు రూ.2100నుంచి రూ.2500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

అడపాదడపా దాడులు

పీడీఎస్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తూ ధనార్జనే ధ్యేయంగా దళారులు ఈ అక్రమ దందా కొనసాగిస్తుండగా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అడపా దడపా తనిఖీలు చేసి రైళ్లలో తరలిస్తున్న బియ్యంను స్వాధీన పర్చుకుని కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ప్యాసింజర్‌ రైళ్లలో అక్రమంగా బియ్యం తరలిస్తుండగా కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), రెబ్బెన వంటి ప్రాంతాల్లో స్మగ్లర్లను పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల వివరాలను పరిశీలిస్తే జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 22 నాటికి మొత్తం 61 కేసులు నమోదు కాగా, 622. 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.11.44లక్షల ఉండగా, 54 వాహనాలను సీజ్‌ చేశారు. గత రెండ్రోజుల్లోనూ దాదాపు 100 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు

-స్వామికుమార్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 

చౌక బియ్యం స్మగ్లింగ్‌ నియంత్రణ కోసం ఎన్‌ఫోర్సుమెంటు బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 61కేసులు నమోదు చేశాం. 54 వాహనా లను స్వాధీనం చేసుకున్నాం. పోలీసులు కూడా బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించి రోజు వారి తనిఖీలను ముమ్మరం చేశారు. గతంతో పోలీస్తే చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది.

Updated Date - 2022-04-25T05:08:11+05:30 IST