రేషన్‌బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2020-10-21T05:45:28+05:30 IST

జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్ల నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల నుంచి స్మగ్లర్లు పెద్దఎత్తున వేలాది క్వింటాళ్ల ప్రజా

రేషన్‌బియ్యం పక్కదారి

ఉత్తర తెలంగాణ జిల్లాల  నుంచి నాగ్‌పూర్‌కు రవాణా

సరిహద్దుల్లో నిఘా కరువు 

యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా


 (ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్ల నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాల నుంచి స్మగ్లర్లు పెద్దఎత్తున వేలాది క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌ ప్రాంతాలకు దర్జాగా లారీల్లో స్మగ్లింగ్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉపయోగపడాల్సిన రేషన్‌బియ్యం అధికార యంత్రాంగం నిఘా వైఫల్యం కారణంగా పక్కదారి పడుతోంది. దానికి తోడు రేషన్‌దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యంలో నాణ్యత లేదని కొందరు లబ్ధిదారులు వాటిని తినేందుకు ఇష్టపడడం లేదు. దీంతో కొంతమంది అక్రమార్కులు రేషన్‌ లబ్ధిదారుల నుంచి చౌక బియ్యాన్ని సేకరించేందుకు గ్రామాల వారీగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డుల్లో రేషన్‌ బియ్యన్ని రూ.8 నుంచి రూ.10 పెట్టి కొనుగోలు చేస్తారు. అన్ని వార్డుల్లో ఇలా సేకరించిన బియ్యాన్ని ఒకే చోట డంప్‌ చేస్తుంటారు. రాత్రి వేళల్లో నేరుగా వాహనాల్లో కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూరు(టి) మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ దందాలో దారిపొడవునా పలువురు అధికారులకు మాముళ్లు ఇస్తుండటంతో పట్టించుకునేవారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


లాక్‌ డౌన్‌కు ముందు ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా తెలంగాణ జిల్లాల నుంచి పెద్దఎత్తున రేషన్‌బియ్యాన్ని మహారాష్ట్రలోని వీరూర్‌, మాకొడి ప్రాంతాల్లో ఉన్న అక్రమ కొనుగోలు కేంద్రాలకు తరలించి కిలోకు రూ.18 నుంచి రూ.22 వరకు విక్రయించేవారు. మహారాష్ట్రలో ఈ బియ్యంపై  అధికారుల నిఘా లేకపోవటంతో ఈ దందాను యథేచ్ఛగా సాగించేవారు. కరోనా కారణంగా ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కావడంతో రూటు మార్చిన స్మగ్లర్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వీరికి రాజకీయ అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలో ప్రధానంగా సిర్పూరు(టి) మీదుగా మహారాష్ట్రకు వెళ్లే హుడ్కిలి రోడ్డు గుండా రేషన్‌బియ్యాన్ని స్మగ్లర్లు తరలిస్తున్నట్లు గుర్తించారు.  


మామూళ్ల మత్తులో అధికారులు

పేద ప్రజలకు ఉపయోగ పడాల్సిన రేషన్‌బియ్యం ద ర్జాగా లారీల ద్వారా మహారాష్ట్రకు స్మగ్లింగ్‌ అవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ముఖ్యంగా లారీల్లో రవాణా అవుతున్న బియ్యాన్ని కరీంనగర్‌ మొదలుకొని రాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సరిహద్దులు దాటుతున్న విషయాన్ని పరిశీలిస్తే ఈ వ్యవహారం వెనక పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టు వద్ద వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు జరగాల్సి ఉన్నా అక్కడ స్మగ్లర్లు ముందుగానే సిబ్బందిని మేనేజ్‌ చేస్తున్నారన్న విమర్శ లున్నాయి. అధికారుల నిఘా లేకపోవడంతో స్మగ్లర్లు రోజు విడిచి రోజు చొప్పున ఒక ట్రిప్పులో రాష్ట్రం నుంచి సుమారు రెండు వందల మెట్రిక్‌ టన్నులకు పైగా చౌక బియ్యం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. 


40 శాతం రేషన్‌బియ్యం పక్కదారి

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందచేస్తున్న చౌక బియ్యంలో సుమారు 40శాతం దుర్వినియోగమవుతున్నట్లు సమాచారం. గ్రామాల్లో రేషన్‌షాపుల ద్వారా బియ్యా న్ని తీసుకున్న లబ్ధిదారుల నుంచి పలువురు అక్రమా ర్కులు కిలోకు రూ.8 నుంచి రూ.11కు కొనుగోలు చేస్తు న్నారు. అనంతరం ఈ బియ్యాన్ని స్మగ్లర్లకు కిలో రూ.13 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. ఇక బియ్యం భారీ పరిమాణంలో జమ కాగానే సదరు స్మగ్లర్లు అధికారులకు మామూళ్లు ముట్ట చెప్పి దొడ్డిదారిన మహరాష్ట్రకు రవాణా చేసి అక్కడ కిలోకు రూ.21 నుంచి 25 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో 278 రేషన్‌ దుకాణాల ద్వారా 1.35 లక్షల లబ్ధిదారులకు ప్రతి నెలా 3000 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణి జరుగుతోంది. ఇక జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ దాడులలో మొత్తం 1691.18 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా 80 మందిపై 39 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-10-21T05:45:28+05:30 IST