రేషన బియ్యం రైట్‌ రైట్‌

ABN , First Publish Date - 2022-08-05T06:45:14+05:30 IST

రేషన బియ్యం రైట్‌ రైట్‌

రేషన బియ్యం రైట్‌ రైట్‌
తల్లాడలో పట్టుకున్న బియ్యం లారీలు

తప్పుడు పత్రాలతో జిల్లా మీదుగా తరలుతున్న సరుకు

అడ్డుకట్టకు కానరాని కఠిన చర్యలు 

ఫలితంగా కొనసాగుతున్న దందా 

ఖమ్మం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : పేదలకోసం పంపిణీచేస్తున్న పౌరసరఫరాల బియ్యం విదేశాలకు తరలుతున్నాయి. ప్రభుత్వం తెల్లరేషన కార్డుదారులకు అందిస్తున్న బియ్యం అడ్డదారిలో ఎగుమతవుతున్నాయి. తప్పుడు అనుమతి పత్రాలతో ఉమ్మడిజిల్లా మీదుగా రేషన్‌బియ్యం భారీగా తరలతున్నా అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులపైతాత్కాలిక చర్యలే తప్ప కఠిన చర్యలు తీసుకోకపోతుండటంతో దందా కొనసాగుతూనే ఉందన్న అభిప్రాయాలున్నాయి. పొరుగు జిల్లాలనుంచి జిల్లా మీదుగా తరలుతున్న రేషనబియ్యం ఏపీలోని కాకినాడ, విశాఖ ఓడరేవుల ద్వారా విదేశాలకు తరలిపోతుండగా.. అక్రమార్కులు రూ.కోట్లలో సంపాదిస్తున్నారని సమాచారం. ఇదంతా బహిరంగ రహస్యమేనని, అలాంటి వారిపై తూతూమంత్రపు కేసులు తప్ప కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం కిలో బియ్యాన్ని కేవలం రూపాయికే ఇస్తుండగా.. ఆ బియ్యాన్ని తినడానికి ప్రజలు ఎక్కువశాతంమంది ఇష్టపడడంలేదు. దొడ్డు బియ్యం వస్తున్నాయని, నిల్వ ఉన్న బియ్యం వల్ల రసాయన పొడితో ఆరోగ్యం దెబ్బతింటుందని భావించి పేదలు ఈ బియ్యాన్ని కొనడం లేదు. ఒక వేళ కొన్నా ఎంతోకొంతకు అమ్మేసుకుంటున్నారు. షాపుల్లో కిలో రూ.40నుంచి50కు సన్నరకాల బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇదే అవకాశంగా రేషనడీలర్లు కార్డుదారులకు కిలోకు రూ.5నుంచి రూ.8వరకు చెల్లించి వారి వద్ద నుంచి రేషన్‌బియ్యాన్ని తీసుకుని పక్కదారి పట్టిస్తున్నారు. రేషనడీలర్లు ఆ బియ్యంను రైస్‌మిల్లర్లకు ఇతర వ్యాపారులకు కిలో రూ.10కిపైగా అమ్ముతున్నారు. అలా చేతులు మారుతున్న బియ్యం చివరికి మిల్లర్ల చేతికి చేరి వాటిని రీపాలీ్‌షచేసి విదేశాలకు తరలుతోంది. మహబూబాబాద్‌, ఉమ్మడి నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఎక్కువగా రేషనబియ్యం విదేశాలకు తరలుతోందని సమాచారం. జిల్లాలో కూడా కొందరు బియ్యం వ్యాపారులు.. రైస్‌మిల్లు యజమానుల రేషన బియ్యం కొనుగోలుచేసి విదేశాలకు ఎగుమతిచేస్తున్నారు. కొంతమంది బియ్యం గోడౌన్లనుంచే నేరుగా తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు రేషనబియ్యం అక్రమ తరలింపు కేసులు 78 నమోదవగా.. 1,934 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. కాగా గురువారం కర్ణాటక వేబిల్లులతో తిరుమలాయపాలెం నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్న 3లారీలకు 630క్వింటాళ్ల రేషనబియ్యాన్ని అధికారులు తల్లాడ వద్ద పట్టుకున్నారు. దీనిపై పోలీసులు, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. అయితే పట్టుబడిన లారీ సిబ్బంది మాత్రం బియ్యం ఎక్కడినుం చి వస్తున్నాయి, ఎక్కడ కొనుగోలుచేశారన్న విషయంపై నోరు విప్పడం లేదు. ఈ రవాణా వెనుక కొందరు మిల్లర్లు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు చెందిన తప్పుడు అనుమతి పత్రా లు, వేబిల్లులతో ఈ బియ్యం అక్రమరవాణా సాగుతోంది. ఇది మహబూబాబాద్‌, మిర్యాలగూడెం, ఏపీలోని జగ్గయ్యపేట తదితర ప్రాంతాలనుంచి ఈ తప్పుడు వేబిల్లుతో బియ్యం రవాణా చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద మామూళ్లు ముట్టచెప్పి కాకినాడ పోర్టుకు పంపుతున్నారు. ఇవి కేవలం పట్టుబడిన సంఘటనలు మాత్రమే. రోజూ ఖమ్మం, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మార్గంలో పెద్దసంఖ్యలో రేషన బియ్యం లారీ లు తరలిపోతున్నాయి. ఇప్పటికైనా రేషణబియ్యం రవాణాపై దృష్టిపెట్టాలని, ప్రధాన రహదారులతో పాటు కాకినాడ, విశాఖ పోర్టుల్లో తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. 

630క్వింటాళ్ల రేషన బియ్యం పట్టివేత

కర్ణాటక వే బిల్లులు చూపి అక్రమ రావాణా

తల్లాడలో రెండు లారీలు, ఓ వ్యాన సీజ్‌

తల్లాడ: రేషనబియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఖమ్మం కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్నిరోజులుగా అధికారులు బృందాలుగా ఏర్పడి రాత్రివేళల్లో రేషన బియ్యం అక్రమరవాణ జరిగే రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రెండు జాతీయ రహదారులకు కేంద్రమైన తల్లాడలో పౌరసరఫరాలశాఖకు చెందిన ముగ్గురు డీటీలు, మరో ముగ్గురు ఆర్‌ఐల బృందం తనిఖీలు నిర్వహించి అక్రమంగా రేషనబియ్యం తరలిస్తున్న రెండు లారీలు, మరో డీసీఎం వ్యానను పట్టుకున్నారు. మూడు వాహనాల్లోని 630క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు లారీలు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినట్లు ఆ రాష్ట్ర వేబిల్స్‌తో ఉన్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం నుంచి మరో డీసీఎం వ్యానలో స్మగ్లర్లు రేషనబియ్యాన్ని కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను వైరాలోని ఎంఎల్‌ఎస్‌ ఫాయింట్‌కు తరలించారు. బియ్యాన్ని పరిశీలన కోసం ఖమ్మం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు లారీ డ్రైవర్లు అయిన అల్లూరి సీతరామరాజు జిల్లా అడ్డతీగెలకు చెందిన ఎన.కొసరాజు, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లికి చెందిన ఏ.వెంకటి, మిర్యాలగూడెంకు చెందిన దుబ్బాక రాజు, వ్యాన డ్రైవర్‌ కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన సత్తిబాబులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాహనాల యజమానులు, అక్రమంగా బియ్యం తరలింపులోని సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడుల్లో డీటీలు సీహెచ.సత్యనారాయణ, విజయబాబు, నిస్సార్‌ అహ్మద్‌, ఆర్‌ఐలు కిరణ్‌, పవన, మధుసూదన పాల్గొన్నారు. పట్టుబడ్డ లారీలు కర్ణాటక వేబిల్స్‌తో ఉన్నా  అవి మహబూబాబాద్‌, మిర్యాలగూడ తదితర ప్రాంతాలనుంచే సేకరించి కాకినాడకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు.



Updated Date - 2022-08-05T06:45:14+05:30 IST