రేషన్‌ బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2022-08-02T05:03:56+05:30 IST

జిల్లాలో రేషన్‌ బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. లబ్ధిదారుల నుంచి వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి బయట మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

రేషన్‌ బియ్యం పక్కదారి
పట్టుబడిన పీడీఎస్‌ బియ్యం

 గ్రామాల్లో చిరు వ్యాపారుల ద్వారా సేకరణ
 రీ పాలిష్‌ చేసి ‘లెవీ’ ద్వారా తిరిగి ప్రభుత్వానికి అప్పగింత
తగ్గని మిల్లర్ల మాయాజాలాలు
అంతంతమాత్రంగా అధికారుల తనిఖీలు


జిల్లాలో రేషన్‌ బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. లబ్ధిదారుల నుంచి వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి బయట మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయడం... రీ పాలిష్‌ చేసి తిరిగి ప్రభుత్వానికే అండగట్టడం ఏళ్లుగా జరుగుతున్న తంతే. ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి కొత్త విధానాలు వచ్చినా వాటినీ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నిర్దేశించిన లెవీ లక్ష్యాన్ని ‘రీ పాలిష్‌’ బియ్యంతోనే పూర్తిచేస్తున్నారు.

నెల్లిమర్ల, ఆగస్టు 1:
జిల్లాలో కొందరు మిల్లర్లు ఎప్పటిలాగే పెడదారిని వీడడం లేదు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు, గిడ్డంగుల వద్దనున్న క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల సాయంతో తతంగాన్ని పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లిమర్ల, గజపతినగరం  నియోజకవర్గాల పరిధిలోని మిల్లులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌లో పెద్ద మాఫియానే నడుస్తోంది. కొందరు రైస్‌ మిల్లర్లు గ్రామాల్లో చిల్లర వ్యాపారులను ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. వారు రేషన్‌ అందిన వెంటనే లబ్ధిదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని మిల్లులకు చేర్చుతున్నారు. కిలో దగ్గర రూ.5 వరకూ మిల్లర్లు చిల్లర వ్యాపారులకు కమీషన్‌గా అందిస్తున్నారు. ఈ బియ్యాన్ని రీ పాలిష్‌ చేసి కొత్త సంచుల్లో ఎక్కిస్తున్నారు. వీటినే లెవీ లక్ష్యం మేరకు అందిస్తున్నారు. కొందరు మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చి బయట మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.

ఇలా చేస్తున్నారు..
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర పట్టించేందుకు మిల్లర్లకు అప్పగిస్తుంది. దీనికిగాను క్వింటాకు రూ.65 చెల్లిస్తుంది. గోనె సంచులు, హమాలీ చార్జీలు కూడా అదనంగా అందిస్తుంది. ఏటా ఖరీఫ్‌, రబీలో సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అందిస్తుంది. ఇక్కడే అసలు తంతు జరుగుతోంది. ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం లేదు. వాటిని గిడ్డంగుల్లో భద్రపరుస్తున్నారు. ఆ స్థానంలో చిరు వ్యాపారుల ద్వారా రప్పించుకున్న బియ్యాన్ని రీపాలిష్‌ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థకు అందిస్తున్నారు. లెవీ లక్ష్యానికి జమ చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బహిరంగ మార్కెట్‌లో బియ్యం విక్రయిస్తున్నారు. కొందరు మిల్లర్లు ఇతర ప్రాంతాలకు ధాన్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాదిలో మూడు నెలల పాటు మాత్రమే ధాన్యం మిల్లింగ్‌ చేస్తున్నారు. మిగతా సమయంలో రీ పాలిష్‌ బియ్యంతోనే వ్యాపారాన్ని మూడు పువ్వులు... ఆరు కాయలుగా చేసుకుంటున్నారు.

పర్యవేక్షణేదీ?
వాస్తవానికి మిల్లర్లు అందించే బియ్యాన్ని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పరిశీలించాలి. నేరుగా మరచేసి అందిస్తున్నారా.. లేకుంటే రీపాలిష్‌ చేస్తున్నారా అన్నది నిర్ధారించాలి. కానీ ముందస్తు ఒప్పందం ప్రకారమే అధికారులు ఆ బియ్యాన్ని అనుమతిస్తున్నారు. ఇటీవల మిల్లుల్లో జరుగుతున్న వ్యవహారంపై కొందరు అధికారులకు ఫిర్యాదులు అందినా స్పందించ లేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెలలో మరింతగా
ఈ నెలలో రేషన్‌ బియ్యం భారీగా పక్కదారి పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా మంది రేషన్‌ బియ్యాన్ని వినియోగించడం లేదు. బయట విక్రయిస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్‌ అందించనుంది. దీంతో బియ్యం కమీషన్‌ వ్యాపారులు భారీగా కొనుగోలు చేసి మిల్లర్లకు చేర్చనున్నారని తెలుస్తోంది.


నిఘా పెట్టాం
రేషన్‌ బియ్యం క్రయవిక్రయాలు నేరం.. ఎవరైనా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. కొందరు వ్యక్తులు మిల్లుకు బియ్యం తరలిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టిపెట్టాం. రేషన్‌ బియ్యం కొనుగోలుచేసి రీ పాలిష్‌ చేస్తున్న మిల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
                - రమణరాజు, తహసీల్దారు, నెల్లిమర్ల


Updated Date - 2022-08-02T05:03:56+05:30 IST